Ranga Reddy districts
-
బ్యూటీ స్టార్
-
దీపం.. వేగవంతం
వంటగ్యాస్ కనెక్షన్ లేని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు దీపం కనెక్షన్లు ఇచ్చేందుకు అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. రెండేళ్ల కిందట జిల్లాకు మంజూరైన కనెక్షన్లు వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు చేరలేదు. వీలైనంత త్వరగా వీటిని పేద కుటుంబాలకు ఇవ్వాలని జిల్లా పౌర సరఫరాల శాఖ సంకల్పించింది. దరఖాస్తు చేసుకున్న అర్హులకు దాదాపు 20 రోజుల్లో కనెక్షన్లు అందజేయాలని యోచిస్తోంది. సాక్షి,రంగారెడ్డి జిల్లా: జిల్లాకు 2015–16 సంవత్సరంలో 41,746 దీపం కనెక్షన్లు (కొత్త రంగారెడ్డి జిల్లా కోటా) మంజూరయ్యాయి. వీటి కోసం జిల్లా వ్యాప్తంగా 24,243 లబ్ధిదారులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నిబంధనల ప్రకారం అర్హులను గుర్తించిన యంత్రాంగం.. 23,978 దరఖాస్తులను ఆమోదించింది. వీరిలో 14,482 మందికి వంటగ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఆమోదం పొందిన వాటిలో మిగిలిన లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే జిల్లాకు మంజూరైన మొత్తం 41,746 కనెక్షన్లలో 58 శాతం కనెక్షన్లకు మాత్రమే దరఖాస్తులు అందగా.. మిగిలిన 42 శాతం అంటే 17,768 కనెక్షన్లకు దరఖాస్తులు రాలేదు. క్షేత్రస్థాయిలో బీపీఎల్ కుటుంబాలకు సమాచారం చేరకపోవడం, అధికారులు ప్రచారం కల్పించడకపోవడం తదితర కారణాల వల్ల స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. ఈ నేపథ్యంలో కనెక్షన్లు అవసరం అనుకున్న బీపీఎల్ కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులు ఉంటే దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని వంటగ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు జిల్లా పౌరసరఫరాల అధికారులు సూచించారు. అలాగే కిరోసిన్ తీసుకుంటున్న కుటుంబాలకు దీపం కనెక్షన్లు పొందేలా చూడాలని చౌక ధరల దుకాణాల యజమానులకు చెప్పినట్లు అధికారులు అంటున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఇలా... ► ఆహార భద్రత (రేషన్)కార్డు కలిగి ఉండి వంటగ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆధార్‌కార్డు తప్పనిసరి. ► తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి. ► నిబంధనల మేరకు అర్హులుగా గుర్తిస్తే.. లబ్ధిదారులు తమ వాటాగా సుమారు రూ.వెయ్యి చెల్లించాలి. ► గ్యాస్ నింపిన బండ, నాణ్యమైన రెగ్యులేటర్, పైపు అందజేస్తారు. ► స్టౌని లబ్ధిదారులు మార్కెట్లో గానీ, వంటగ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్దనైనా కొనుగోలు చేసుకోవచ్చు. ► ఒకవేళ మార్కెట్లో స్టౌను కొనుగోలు చేస్తే డిస్ట్రిబ్యూటర్‌కు ఇన్స్టలేషన్ చార్జీల కింద రూ.250 చెల్లించాలి. -
పక్కదారికి అడ్డుకట్ట..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 95 శాతం రేషన్ దుకాణాల్లో సంప్రదాయ గొలుసు కాంటాలను వినియోగించడంతో కార్డుదారులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి కిలోకు సగటున 80నుంచి 120 గ్రాముల తరుగుదల వచ్చేది. పైగా లబ్ధిదారులు బియ్యం తీసుకోలేకపోతే కొందరు రేషన్ డీలర్లే కాజేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ కాంటాలను తప్పనిసరి చేసినా పెద్దగా ప్రయోజనం లేదని భావించిన పౌరసరఫరాల శాఖ.. పటిష్టమైన వ్యవస్థను తీసుకరావడం తోనే పక్కదారికి, తూకంలో కోతకు అడ్డుకట్టకు వేయవచ్చన్న నిర్ణయానికి వచ్చింది. తదనుగుణంగా వేలిముద్రల (బయోమెట్రిక్) ఆధారంగా పనిచేసే ఈ–పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను ప్రయోగాత్మకంగా పరిచయం చేసింది. తొలుత మన జిల్లా పట్టణ (జీహెచ్ఎంసీ) ప్రాంతంలో 218 రేషన్ దుకాణాల్లో గతేడాది మార్చి నెలలో పైలట్ ప్రాజెక్టుగా ఈ–పాస్ యంత్రాల ద్వారా సరుకుల పంపిణీ చేశారు. ఈ విధానంలో సగటున 30 శాతం బియ్యం కోటా మిగలడంతో రూ.కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. ఇలా విజయవంతం కావడంతో ఈ పద్ధతిని ఏప్రిల్ నుంచి కొనసాగించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి తెచ్చారు. పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే మరింత ఆధునిక సాంకేతికతో పనిచేసే మిషన్లను వినియోగిస్తున్నారు. ఈ–పాస్ మిషన్లకు ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ కాంటాలను అనుసంధానించి బియ్యం అందజేస్తున్నారు. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో 30 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 11శాతం బియ్యం మిగులుతున్నాయి. సగటున 18 శాతం బియ్యం మిగులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మూడు నెలల్లో రూ.4.20 కోట్లు ఆదా.. జిల్లాలో మూడు నెలల్లో రూ.4 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. ఈ–పాస్ మిషన్ల రాకతో ప్రతినెలా సగటున 550 టన్నుల బియ్యం పౌరసరఫరాల శాఖకు మిగులుతున్నాయి. జిల్లాలో 5.18 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. వీరికి ప్రతినెలా 11,038 టన్నుల బియ్యం అవసరం. కొందరు క్రమం తప్పకుండా తీసుకెళ్లకపోక పోవడం కారణంగా డీలర్ల వద్ద ప్రతినెలా సగటున రెండు వేల టన్నుల బియ్యం కోటా బ్యాలెన్స్ ఉంటోంది. ఇది పోను సుమారు 9వేల టన్నుల బియ్యం కోటాకు చౌకధరల దుకాణాల డీలర్లు ప్రతినెలా డీడీలు చెల్లిస్తున్నారు. అయితే ఇందులో 8,580 టన్నుల బియ్యాన్ని మాత్రమే కార్డుదారులు తీసుకెళ్తుండగా.. రమారమి మరో 610 టన్నుల బియ్యం వరకు మిగులుతున్నాయి. ప్రభుత్వం ఒక్కో కిలో బియ్యాన్ని దాదాపు రూ. 26 చొప్పున కొనుగోలు చేసి.. పేద కుటుంబాలకు రూపాయికి అందజేస్తున్న విషయం తెలిసిందే. అంటే ఒక్కో కిలోపై ప్రభుత్వం రూ.25 సబ్సిడీ భరిస్తోందన్నమాట. ఈ లెక్కన ప్రతినెలా 1.50 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతున్నాయి. గత నెలలో 560 టన్నుల బియ్యం మిగలగా.. 1.34 కోట్ల రూపాయల ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట పడింది. మొత్తం మీద మూడు నెలల్లోనే 4.20 కోట్ల రూపాయలు ఆదా అవడం విశేషం. -
ముంచెత్తిన వాన..
* మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వర్ష బీభత్సం * పంటలకు భారీ నష్టం.. అంధకారంలో సిద్దిపేట సాక్షి, నెట్వర్క్: మెదక్, రంగారెడ్డి జిల్లాలను శనివారం కూడా వర్షం ముంచెత్తింది. మెదక్ జిల్లా సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ప్రభావంతో విద్యుత్ స్తంభాలు పడిపోవడం, తీగలు తెగిపోవడంతో సిద్దిపేట పట్టణం అంధకారంలో మునిగిపోయింది. ఇక్కడ 45 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. హైదరాబాద్, మెదక్, ఇతర ప్రధాన రహదారులపై రాకపోకలు స్తంభించాయి. గజ్వేల్ నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వడగళ్ల వాన పడింది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఆరు లేన్ల రహదారి పనుల్లో భాగంగా బిగించిన విద్యుత్ స్తంభాలు ఈదురుగాలులకు వంగిపోయాయి. రద్దీగా ఉండే రహదారిపై ఇవి వంగిపోవడంతో ప్రయాణికులు భీతిల్లారు. ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. అలాగే, రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. చేవెళ్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షానికి క్యారెట్, బీట్రూట్ తదితర పంటలకు నష్టం జరిగింది. మొయినాబాద్ మండలంలో పిడుగుపాటుతో 4 పశువులు మృత్యువాత పడ్డాయి. శంషాబాద్, కందుకూరు మండలాల్లో భారీ వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. కొలన్‌గూడలో వడగళ్ల ధాటికి బండ నర్సింహాకు చెందిన 5 గొర్రెలు, 5 మేకలు మృతి చెందాయి. కందుకూరు మండలం బేగంపేటలో ఈదురుగాలులకు దెయ్యాల ఐలయ్య ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. గ్రామంలోని వ్యవసాయ పొలంలో యాదయ్యకు చెందిన ఇల్లు కూలిపోయి ఆయన భార్య యాదమ్మకు స్వల్పగాయాలయ్యాయి. శంషాబాద్ మండలం చిన్నగోల్కొండలో దాదాపు పది ఇళ్ల రేకులు లేచిపోయాయి.