సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 95 శాతం రేషన్ దుకాణాల్లో సంప్రదాయ గొలుసు కాంటాలను వినియోగించడంతో కార్డుదారులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి కిలోకు సగటున 80నుంచి 120 గ్రాముల తరుగుదల వచ్చేది. పైగా లబ్ధిదారులు బియ్యం తీసుకోలేకపోతే కొందరు రేషన్ డీలర్లే కాజేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ కాంటాలను తప్పనిసరి చేసినా పెద్దగా ప్రయోజనం లేదని భావించిన పౌరసరఫరాల శాఖ.. పటిష్టమైన వ్యవస్థను తీసుకరావడం తోనే పక్కదారికి, తూకంలో కోతకు అడ్డుకట్టకు వేయవచ్చన్న నిర్ణయానికి వచ్చింది. తదనుగుణంగా వేలిముద్రల (బయోమెట్రిక్) ఆధారంగా పనిచేసే ఈ–పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను ప్రయోగాత్మకంగా పరిచయం చేసింది.
తొలుత మన జిల్లా పట్టణ (జీహెచ్‌ఎంసీ) ప్రాంతంలో 218 రేషన్ దుకాణాల్లో గతేడాది మార్చి నెలలో పైలట్ ప్రాజెక్టుగా ఈ–పాస్ యంత్రాల ద్వారా సరుకుల పంపిణీ చేశారు. ఈ విధానంలో సగటున 30 శాతం బియ్యం కోటా మిగలడంతో రూ.కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. ఇలా విజయవంతం కావడంతో ఈ పద్ధతిని ఏప్రిల్ నుంచి కొనసాగించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి తెచ్చారు. పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే మరింత ఆధునిక సాంకేతికతో పనిచేసే మిషన్లను వినియోగిస్తున్నారు. ఈ–పాస్ మిషన్లకు ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ కాంటాలను అనుసంధానించి బియ్యం అందజేస్తున్నారు. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో 30 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 11శాతం బియ్యం మిగులుతున్నాయి. సగటున 18 శాతం బియ్యం మిగులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మూడు నెలల్లో రూ.4.20 కోట్లు ఆదా..
జిల్లాలో మూడు నెలల్లో రూ.4 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. ఈ–పాస్ మిషన్ల రాకతో ప్రతినెలా సగటున 550 టన్నుల బియ్యం పౌరసరఫరాల శాఖకు మిగులుతున్నాయి. జిల్లాలో 5.18 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. వీరికి ప్రతినెలా 11,038 టన్నుల బియ్యం అవసరం. కొందరు క్రమం తప్పకుండా తీసుకెళ్లకపోక పోవడం కారణంగా డీలర్ల వద్ద ప్రతినెలా సగటున రెండు వేల టన్నుల బియ్యం కోటా బ్యాలెన్స్ ఉంటోంది.
ఇది పోను సుమారు 9వేల టన్నుల బియ్యం కోటాకు చౌకధరల దుకాణాల డీలర్లు ప్రతినెలా డీడీలు చెల్లిస్తున్నారు. అయితే ఇందులో 8,580 టన్నుల బియ్యాన్ని మాత్రమే కార్డుదారులు తీసుకెళ్తుండగా.. రమారమి మరో 610 టన్నుల బియ్యం వరకు మిగులుతున్నాయి. ప్రభుత్వం ఒక్కో కిలో బియ్యాన్ని దాదాపు రూ. 26 చొప్పున కొనుగోలు చేసి.. పేద కుటుంబాలకు రూపాయికి అందజేస్తున్న విషయం తెలిసిందే. అంటే ఒక్కో కిలోపై ప్రభుత్వం రూ.25 సబ్సిడీ భరిస్తోందన్నమాట. ఈ లెక్కన ప్రతినెలా 1.50 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతున్నాయి. గత నెలలో 560 టన్నుల బియ్యం మిగలగా.. 1.34 కోట్ల రూపాయల ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట పడింది. మొత్తం మీద మూడు నెలల్లోనే 4.20 కోట్ల రూపాయలు ఆదా అవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment