వంటగ్యాస్ కనెక్షన్ లేని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు దీపం కనెక్షన్లు ఇచ్చేందుకు అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. రెండేళ్ల కిందట జిల్లాకు మంజూరైన కనెక్షన్లు వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు చేరలేదు. వీలైనంత త్వరగా వీటిని పేద కుటుంబాలకు ఇవ్వాలని జిల్లా పౌర సరఫరాల శాఖ సంకల్పించింది. దరఖాస్తు చేసుకున్న అర్హులకు దాదాపు 20 రోజుల్లో కనెక్షన్లు అందజేయాలని యోచిస్తోంది.
సాక్షి,రంగారెడ్డి జిల్లా: జిల్లాకు 2015–16 సంవత్సరంలో 41,746 దీపం కనెక్షన్లు (కొత్త రంగారెడ్డి జిల్లా కోటా) మంజూరయ్యాయి. వీటి కోసం జిల్లా వ్యాప్తంగా 24,243 లబ్ధిదారులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నిబంధనల ప్రకారం అర్హులను గుర్తించిన యంత్రాంగం.. 23,978 దరఖాస్తులను ఆమోదించింది. వీరిలో 14,482 మందికి వంటగ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఆమోదం పొందిన వాటిలో మిగిలిన లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అయితే జిల్లాకు మంజూరైన మొత్తం 41,746 కనెక్షన్లలో 58 శాతం కనెక్షన్లకు మాత్రమే దరఖాస్తులు అందగా.. మిగిలిన 42 శాతం అంటే 17,768 కనెక్షన్లకు దరఖాస్తులు రాలేదు. క్షేత్రస్థాయిలో బీపీఎల్ కుటుంబాలకు సమాచారం చేరకపోవడం, అధికారులు ప్రచారం కల్పించడకపోవడం తదితర కారణాల వల్ల స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది.
ఈ నేపథ్యంలో కనెక్షన్లు అవసరం అనుకున్న బీపీఎల్ కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులు ఉంటే దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని వంటగ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు జిల్లా పౌరసరఫరాల అధికారులు సూచించారు. అలాగే కిరోసిన్ తీసుకుంటున్న కుటుంబాలకు దీపం కనెక్షన్లు పొందేలా చూడాలని చౌక ధరల దుకాణాల యజమానులకు చెప్పినట్లు అధికారులు అంటున్నారు.
దరఖాస్తు ప్రక్రియ ఇలా...
► ఆహార భద్రత (రేషన్)కార్డు కలిగి ఉండి వంటగ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఆధార్‌కార్డు తప్పనిసరి.
► తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి.
► నిబంధనల మేరకు అర్హులుగా గుర్తిస్తే.. లబ్ధిదారులు తమ వాటాగా సుమారు రూ.వెయ్యి చెల్లించాలి.
► గ్యాస్ నింపిన బండ, నాణ్యమైన రెగ్యులేటర్, పైపు అందజేస్తారు.
► స్టౌని లబ్ధిదారులు మార్కెట్‌లో గానీ, వంటగ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్దనైనా కొనుగోలు చేసుకోవచ్చు.
► ఒకవేళ మార్కెట్‌లో స్టౌను కొనుగోలు చేస్తే డిస్ట్రిబ్యూటర్‌కు ఇన్‌స్టలేషన్ చార్జీల కింద రూ.250 చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment