bpl families
-
బీపీఎల్ కుటుంబాలకు రూ.5 వేలు సాయం
చండీగఢ్: కరోనా మహమ్మారితో జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడే పేదలను ఆదుకునేందుకు హరియాణా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో దారిద్య్ర రేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న కుటుంబాలకు 5 వేల రూపాయల నగదు సాయం అందిస్తామని హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ సోమవారం ప్రకటించారు. కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ విధించిన క్రమంలో జీవనోపాధి కోల్పోయిన బీపీఎల్ కుటుంబాలకు నగదు సాయం అందించాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ మరికొంత కాలం కొనసాగుతుందని అనిల్ విజ్ తెలిపారు. మే 10 నుంచి 17 వరకూ ‘సురక్షిత్ హరియాణా’ పేరిట కరోనాపై ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమం చేపడతామన్నారు. లాక్‌డౌన్‌కు తోడు కఠిన నియంత్రణలను అమలు చేస్తామని చెప్పారు. అంత్యక్రియలు, వివాహ వేడుకలకు ల11 మందికి మించి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇక గడిచిన 24 గంటల్లో హర్యానాలో 13,548 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 151 మంది మహమ్మారి బారినపడి మరణించారు. చదవండి: ‘వ్యాక్సిన్ల కొరత.. డబ్బులిచ్చి కొందామన్న లభించడం లేదు’ -
బీపీఎల్ కుటుంబాలకు ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి : వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రిలో చికిత్స అనంతరం బీపీఎల్ కుటుంబాలకు చెల్లించే ఆర్థిక సాయంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 26 విభాగాల్లో 836 శస్త్ర చికిత్సలకు ఈ ఆర్థిక సాయాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ. 5వేలు చెల్లించేందుకు ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులో పేర్కొంది. కాగా, డిసెంబరు 1వ తేదీ నుంచి ఆసుపత్రిలో చికిత్స అనంతరం బీపీఎల్ కుటుంబాలకు వైద్యారోగ్యశాఖ ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ నేపథ్యంలో చికిత్స చేయించుకున్న రోగులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డు సహా ఇతర వివరాలను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. -
‘ఉజ్వల స్కీమ్’కు మరింత సబ్సిడీ!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉజ్వల స్కీమ్’ కింద ఇప్పటి వరకు దేశంలోని 7.30 కోట్ల పేద కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేశారు. 2020 సంవత్సరం నాటికి దేశంలోని ఎనిమిది కోట్ల పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యంలో ఇప్పటికే 91.25 లక్ష్యాన్ని సాధించింది. కనుక మిగతా లక్ష్యాన్ని పూర్తి చేయడంలో మరెంతో సమయం పట్టదు. ఇన్ని కోట్ల గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసినప్పటికీ గత రెండేళ్ల కాలంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగం పెరిగింది మాత్రం 0.8 శాతం మాత్రమే. పెరిగిన వినియోగదారుల సంఖ్య కూడా ఆరు శాతమే. ఇలా ఎందుకు జరుగుతోంది ? ఉజ్వల స్కీమ్ కింద వంట గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారిలో ఎక్కువ మంది గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయడం లేదనేది సులభంగానే అర్థం అవుతోంది. ఉజ్వల స్కీమ్ కింద వినియోగదారులంతా కలిసి ఏడాదికి తలసరి 3.4 శాతం సిలిండర్లు వినియోగిస్తున్న ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. ‘కొలాబరేటివ్ క్లీన్ ఏర్ పాలసీ సెంటర్’ ప్రకారం వీరు తలసరి కనీసం తొమ్మిది సిలిండర్లు వినియోగించాలి. మరి ఎందుకు వినియోగించడం లేదు. గ్యాస్ సిలిండర్ల ఖరీదును భరించలేక వారంతా ఇప్పటికీ వంట చెరకు, పిడకలపైనే ఆధారపడి వంట చేసుకుంటున్నారు. దేశం మొత్తం మీదుండే ఐదొంతుల గ్రామీణ ప్రజల్లో రెండొంతుల మంది బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నారు. వారిలో 85 శాతం మంది ఇప్పటికీ సంప్రదాయ వంట చెరకునే వాడుతున్నారని ‘ఇండియా స్పెండ్’ పరిశోధన సంస్థ వెల్లడించింది. వంట కోసం కట్టెలు, పిడకలు, ఊక ఉపయోగించడం వల్ల రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. మొత్తం కాలుష్యంలో వీటి వాటా 25 నుంచి 30 శాతం ఉంటుంది. వంట కాలుష్యం వల్ల ఏటా 4,80.000 మంది అకాలంగా మరణిస్తున్నారన్నది క్లీన్ ఏర్ పాలసీ సెంటర్ అంచనా. వంట గ్యాస్‌ను ఉపయోగించడం ఈ అకాల మరణాలను సులభంగా అడ్డుకోవచ్చు. ఈ పేద వినియోగదారుల ఇంటికి గ్యాస్ సిలిండర్‌ను కచ్చితంగా పంపించడం వల్ల ఒక్కొక్క వినియోగదారుడి ఆరోగ్యం ప్రభుత్వం పెడుతున్న ఖర్చును 3,800 నుంచి 1,800 రూపాయల వరకు ఆదా చేయవచ్చు. వంటగ్యాస్ సబ్సిడీ కోసం కేంద్రం ఖర్చు పెడుతున్న మొత్తం 2019–20 బడ్జెట్ అంచనాల ప్రకారం 32,989 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్జు పెడుతున్నా ఆశించిన ఫలితం రాకపోవడం బాధాకరం. ఉజ్వల స్కీమ్ కింద పేద వినియోగదారుడికి సిలిండర్‌కు ఆరేడు వందల రూపాల భారం పడుతోంది. అది ఏ నాలుగు వందల రూపాయల లోపల వస్తేగానీ, అంటే 350 రూపాయలకు వస్తేనేగానీ ఆ వినియోగదారుడు కొనుగోలు చేయడానికి సాహసించలేడు. అందుకని ఈ మేరకు పేదలపై సిలిండర్ సబ్సిడీని పెంచి, మిగతా వినియోగదారులపై తగ్గించాలని ‘సీసీఏపీసీ’ కేంద్రానికి సిఫార్సు చేసింది. -
ఆపద్బంధు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: బాధిత కుటుంబాలకు ఆపన్నహస్తం అందించే ‘ఆపద్బంధు’పథకాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు వర్తించే ఈ పథకం గతేడాది నవంబర్ ఒకటో తేదీతో ముగిసింది. అయితే, తాజాగా ఈ పథకాన్ని ఈ ఏడాది నవంబర్ ఒకటి వరకు పొడిగిస్తూ సోమవారం విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. 17 కేటగిరీల కింద ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబీకులు ఈ పథకానికి అర్హులు. ఆపద్బంధు కింద రూ.50 వేల సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అల్లర్లు, శాంతిభద్రతల విఘాతంలో ప్రాణాలొదిలినా, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినా, పడవ ప్రమాదంలో కొట్టుకుపోయినా, వరదలు, తుపాను, ఉప్పెన, నీట మునిగినా, వంతెన/భవనాలు కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయినా.. వారికి ఆపద్బంధు వర్తించనుంది. అలాగే, అగ్ని ప్రమాదం, విద్యుదాఘాతం, భూ కంపాలు, తీవ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారు కూడా అర్హులే. అత్యాచార వేధింపులకు గురైన ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలను కూడా ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకోనున్నారు. కల్లు గీత కార్మికులకు కూడా ఆపద్బంధు సాయం అందనుంది. అయితే, ఎక్సైజ్ శాఖ ఇన్సూరెన్స్ కవర్ కాకుంటేనే.. దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే, కుక్కకాటు/రెబీస్ బారిన పడి 12 నెలల్లోపు మృతి చెందినవారికీ ఆపద్భందు వర్తించనుంది. పాము కాటు, వన్య మృగాల దాడిలో చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలితే ఈ పథకం కింద ఆర్థిక చేయూత లభించనుంది. వడదెబ్బ, ఇతర ప్రమాదాల్లో మృత్యువాత పడ్డవారికి కూడా ఆపద్బంధు రానుంది. ఈ తొమ్మిది కేటగిరీలకు వర్తించదు.. ఆత్మహత్యకు పాల్పడినా, మద్యం సేవించి మరణించినా ఆపద్బంధు వర్తించదు. అలాగే, సుఖ వ్యాధులు, మానసిక రోగంతో మరణించినా, చట్టాన్ని ఉల్లంఘిస్తూ చనిపోయినవారు అనర్హులే. యుద్ధం, అణు విస్పోటనం, గర్భవతులు, ప్రసవ సమయంలో చనిపోయినవారి కుటుంబాలకు కూడా ప్రయోజనం లభించదు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సాయుధ బలగాలకు ఈ పథకం వర్తించదు. -
పేదింట వెలుగులు!
సాక్షి, ఊర్కొండ: గ్రామీణ ప్రాంతాల పేదల ఇళ్లలో వెలుగు నింపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న అన్ని కులాల నిరుపేదలకు రూ.125లకే విద్యుత్ మీటరు కనెక్షన్ ఇస్తున్నారు. రూ.125 కూడా దరఖాస్తు చేసుకునేందుకు అయ్యే ఖర్చు మాత్రమే. ఈ పథకాన్ని మార్చి 31వరకు పొడిగించినట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. లబ్ధిదారులు ఆధార్‌కార్డు జిరాక్స్, రెండు ఫొటోలు, ఫోన్ నంబర్‌తో సంబంధిత విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. విచారణ అనంతరం విద్యుత్ మీటర్‌తో పాటు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. అనంతరం సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు విచారణ జరిపి విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసి సర్వీస్ వైరు, మీటర్, స్విచ్ బోర్డు, ఎల్ఈడీ బల్బు, ఎర్తింగ్ తదితర కనెక్షన్లు ఉచితంగా ఇస్తారు. సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ల బిగింపు గ్రామాల్లో విద్యుత్ లో–ఓల్టేజీ లేకుండా ఇప్పటికే కొత్త మీటర్లు ఏర్పాటు చేస్తున్న వీధుల్లో ట్రాన్స్‌కో అధికారులు సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు సమకూరుస్తున్నారు. దీన్‌దయాళ్ పథకం కింద విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు కొన్ని గ్రామాల్లో లో–ఓల్టేజీ సమస్యను అధిగమించేందుకు ఈ ట్రాన్స్ఫార్మర్లు ఉపయోగపడనున్నాయి. ధ్రువీకరణ పత్రం తప్పనిసరి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జీవన్‌జ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది. వారికి ఉచితంగానే కనెక్షన్ ఇచ్చి ప్రతినెలా వారి బిల్లులో రూ.5 అదనంగా వసూలు చేస్తారు. ఇలా రూ.125 అయ్యేవరకు ఉంటుంది. 100 యూనిట్లు వాడుకునేందుకు ప్రభుత్వం వారికి సబ్సిడీ కల్పిస్తుందని, గతంలో విద్యుత్ కనెక్షన్ తీసుకున్న వారు ఎస్సీ, ఎస్టీలు అయితే కుల ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే వారిని 100 యూనిట్ల సబ్సిడీలో చేర్చే అవకాశం ఉంటుంది. ఇతర కులాలకు చెందిన నిరుపేదలకు కూడా రూ.125లకే మీటర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సద్వినియోగం చేసుకోవాలి కరెంట్ మీటర్ లేని నిరుపేదలంతా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మండలంలో ఇప్పటికే 1000 మీటర్ల దాకా బిగించాం. మీటర్లు బిగించిన చోట లోఓల్టేజీ రాకుండా సింగిల్, త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. దాదాపు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిలో వెలుగులు నింపాం. ఇంకా కావాల్సిన వారు దరఖాస్తు చేసుకుంటే తక్షణమే మీటర్లు ఏర్పాటు చేస్తాం. – రవి, ఏఈ, ఊర్కొండ -
ముదిరాజ్‌ల భవిష్యత్ చిత్రపటం!
పురాతన కాలం నుంచి ఘనమైన చరిత్ర కలిగిన ముదిరాజ్‌లు నేటి సమాజంలో సామాజిక అభివృద్ది లేని, హక్కుల సాధన లేని, రాజకీయ అభివృద్ది లేని, ముఖ్యంగా యువతకు ఏ మాత్రం మార్గదర్శకం చేయలేని కులంగా మనుగడ సాగిస్తున్నారు. దేశంలోని ఏ సామాజిక బృందాలతో పోల్చినా ముదిరాజ్‌లు సమాజంలో విద్య, ఆర్థిక, రాజకీయ అంశాల్లో 100 అడుగులు వెనుకబడి ఉన్నారు. కన్నీళ్లు తప్ప ఆనందం లేని బతుకులు గడుపుతున్న వారికి విద్యలేదు, ఉద్యోగాలు లేవు. గత వందేళ్లలో ఒక ఐ.పి.యస్ కాని ఒక ఐ.ఎ.యస్ కానీ ముదిరాజ్‌లలో లేరంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. ముదిరాజ్‌లలో 100 మంది విద్యార్థులు చదువు మొదలు పెడితే డిగ్రీస్థాయికి వచ్చేసరికి 30%మంది డ్రాపౌట్స్ అవుతున్నారు. ఇక మనలో 90% కుటుం బాలు బీపీఎల్ కుటుంబాలే అన్నది వాస్తవం. ఇక గ్రామీణ ప్రాంతంలో ముదిరాజుల బతుకులు చెరువులో ప్రభుత్వం వేసే చేపల్లాంటి బ్రతుకులు. బయటకి వస్తే ఊపిరాడక చచ్చిపోతాం. లోపలే ఉంటే నాచు తీరున అణిగిపోయి ఉంటాం. చేపల వృత్తిపై బతుకుతున్నా ఆదాయం అంతంత మాత్రమే. రానున్న రెండేళ్ళ కాలవ్యవధిలో, వెయ్యికోట్ల రూపాయల భారీ నిధులతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలు తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యపారిశ్రామిక రంగం ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేస్తుందని పాలకులు చెబుతున్నారు. మత్స్య పరిశ్రమతో ముదిరాజ్‌లలో మార్పు వస్తుందీ అనుకున్నాం కానీ పేరుకు తెలంగాణ ప్రభుత్వం మత్స్య పరిశ్రమకు వెయ్యి కోట్లు కేటాయించినట్లు ప్రకటించినా రాష్ట్రంలో 40 లక్షలమంది జనాభాతో ఉన్న ముదిరాజ్‌లకు ఆ మొత్తం ఒక మూలకూ సరిపోదన్నది వాస్తవం. ఇలాంటివాటి వల్ల మనకు పెద్దగా ఉపయోగపడేది ఏమీ లేదు. వందేళ్లుగా అంటే 1920ల నుంచి ఇదే దుస్థితిలో ఉంటున్నాం. కోమాలో ఉన్న ముదిరాజ్‌ల బతుకులు మారాలంటే మన యువత ఇప్పటికైనా జనాభా దామాషా ప్రాతిపదికన సమాజంలోని అన్ని అవకాశాల్లో వాటాకోసం ఉద్యమించాల్సిందే. ముదిరాజ్‌లు గత వైభవాన్ని సాధించాలంటే ఓటు రాజులుగా కొనసాగుతున్న పరిస్థితి పోవాలి. -పి. సురేంద్రబాబు ముదిరాజ్, ముదిరాజ్ సేవా సమితి అధ్యక్షులు ‘ 93945 58798 -
భూములు రీ అసైన్?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములు పేదల అధీనంలో ఉంటే వాటిని వారికే తిరిగి అసైన్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కబ్జాలో లేని, విక్రయించేసుకున్న వారికి చేసిన అసైన్మెంట్లను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వాస్తవానికి అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు చట్టపరంగా నేరం. ఆ లావాదేవీలు కూడా చెల్లవు. అయినా ఆ అసైన్డ్ భూములను దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలు కొనుగోలు చేసి, వినియోగించుకుంటున్నట్లయితే వారికే తిరిగి అసైన్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా అసైన్డ్ భూముల సమస్యకు పరిష్కారం చూపాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు త్వరలోనే నిర్ణయం వెలువరించనుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఆరు లక్షల ఎకరాలు అన్యాక్రాంతం.. రాష్ట్రంలో పేదలకు భూముల అసైన్మెంట్ ప్రక్రియ చాలా ఏళ్లుగా జరుగుతోంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు తెలంగాణవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల వరకు పేదలకు అసైన్ చేసినట్లు అంచనా. కానీ ఈ భూమిలో 30 శాతానికిపైగా అన్యాక్రాంతమైంది. భూమి పొందిన పేదలే ఇతరులకు అమ్ముకున్నారు. వీటిలో చాలా వరకు పేదలే కొనుగోలు చేశారు. అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల్లో బీపీఎల్ కేటగిరీలో ఉన్న పేదలు కొన్నవే 60 శాతానికి పైగానే ఉంటాయని.. మిగతావి వివిధ సంస్థలు, బడాబాబుల చేతిలోకి వెళ్లాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే దాదాపు 3 లక్షల ఎకరాల మేర అసైన్డ్ భూమి చేతులు మారినా పేదల ఆధీనంలోనే ఉన్నట్లయింది. ప్రక్షాళనలో వెలుగులోకి.. చాలా కాలంగా అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై చర్చలు జరుగుతున్నా.. తాజాగా భూరికార్డుల ప్రక్షాళనలో లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రక్షాళనలో దాదాపు 40వేలకు పైగా సర్వే నంబర్ల పరిధిలోని 1.25 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూమి ఇతరుల చేతుల్లో ఉన్నట్లుగా తేలింది. ప్రక్షాళన కార్యక్రమం పూర్తయ్యే సరికి ఇది ఐదారు లక్షల ఎకరాల దాకా చేరుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో భూబదలాయింపు నిరోధక చట్టం (పీవోటీ)–1977 ప్రకారం ఈ భూములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిని ముందే ఊహించిన ప్రభుత్వం రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మొదలైనప్పుడే తగిన మార్గదర్శకాలు జారీ చేసింది. అసైన్డ్ భూముల్లో ఇతరులు కబ్జాలో ఉంటే వారి సామాజిక, ఆర్థిక వివరాలను కూడా సేకరించి నమోదు చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు వివరాల సేకరణ కూడా జరుగుతోంది. ఈ సమాచారం ఆధారంగా.. బీపీఎల్ పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలు కనుక అసైన్డ్ భూముల కబ్జాలో ఉంటే వారి పేరిట మళ్లీ అసైన్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్, రెవెన్యూ ఉన్నతాధికారులు ఇప్పటికే అంతర్గత సమావేశాల్లో రెవెన్యూ యంత్రాంగానికి సంకేతాలు ఇస్తున్నారు. ఈ అంశంపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన 10 మంది మంత్రులతో కేబినెట్ సబ్‌కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ త్వరలో రెవెన్యూ ఉన్నతాధికారులతో చర్చిస్తుందని, అనంతరం ప్రభుత్వం అసైన్డ్ భూములపై నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తుందని సమాచారం. మూడు లక్షల ఎకరాలు రీ అసైన్! అన్యాక్రాంతమై పేదల చేతుల్లో ఉన్న సుమారు 3 లక్షల ఎకరాల భూమిని రీ అసైన్ చేసే అవకాశముందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే కచ్చితంగా కబ్జాలో ఉండి, సాగుచేస్తున్న వారికే రీఅసైన్ చేయనున్నారు. చాలాచోట్ల అసైన్డ్ భూముల పట్టాలున్నా.. భూమి లేని పరిస్థితి ఉంది. కొందరు లబ్ధిదారులకు ఫలానా చోట 2 ఎకరాలు అసైన్ చేసినట్టు రికార్డులు ఉన్నా.. ఆ సర్వే నంబర్లో తగినంత భూమి లేదు. ఇలాంటి కేసుల విషయంలో అసైన్మెంట్ను రద్దు చేయాలని, కబ్జాలో ఉండి సాగు చేస్తున్న వాటిని మాత్రమే అసైన్డ్ భూమిగా గుర్తించాలని నిర్ణయించారు. దీనివల్ల నష్టపోయే లబ్ధిదారులకు మరో రూపంలో లబ్ధి చేకూర్చాలని యోచిస్తున్నారు. బడా బాబులకు లీజు..! కొన్ని ప్రాంతాల్లోని అసైన్డ్ భూములు పలు బడా సంస్థలు, వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. అసైనీలకు ఎంతోకొంత ముట్టజెప్పి ఆయా సంస్థలు, వ్యక్తులు అసైన్డ్ భూములను తీసుకున్నారు. ఈ భూముల విషయంగానూ ప్రభుత్వం స్పష్టతతోనే ఉన్నట్టు సమాచారం. బీపీఎల్ పరిధిలోనికి రాని వ్యక్తుల చేతుల్లో అసైన్డ్ భూమి ఉంటే... ఆ భూమి వివరాలను నేరుగా తెలంగాణ రాష్ట్ర భూనిర్వహణ సంస్థ (టీఎస్ఎల్ఎంఏ)కు పంపాలని నిర్ణయించారు. టీఎస్ఎల్ఎంఏ సమావేశంలో నిర్ణయించిన మేర సదరు భూమిని లీజుకు ఇవ్వడం, లేదా భారీగా రుసుము కట్టించుకుని రెగ్యులరైజ్ చేయడం వంటివి చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే అసైన్డ్ భూమిని రెగ్యులరైజ్ చేసేందుకు పీవోటీ చట్టం అంగీకరించదు. ఈ నేపథ్యంలో పీవోటీ చట్టానికి పకడ్బందీ సవరణలు చేయడం ద్వారా రెగ్యులరైజ్ చేయవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. లేదంటే సదరు భూమిని లీజుకు ఇవ్వవచ్చని పేర్కొంటున్నారు. మొత్తంగా కేబినెట్ సబ్‌కమిటీ భేటీ తర్వాత పూర్తి స్పష్టత రానుంది. -
దీపం.. వేగవంతం
వంటగ్యాస్ కనెక్షన్ లేని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు దీపం కనెక్షన్లు ఇచ్చేందుకు అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. రెండేళ్ల కిందట జిల్లాకు మంజూరైన కనెక్షన్లు వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు చేరలేదు. వీలైనంత త్వరగా వీటిని పేద కుటుంబాలకు ఇవ్వాలని జిల్లా పౌర సరఫరాల శాఖ సంకల్పించింది. దరఖాస్తు చేసుకున్న అర్హులకు దాదాపు 20 రోజుల్లో కనెక్షన్లు అందజేయాలని యోచిస్తోంది. సాక్షి,రంగారెడ్డి జిల్లా: జిల్లాకు 2015–16 సంవత్సరంలో 41,746 దీపం కనెక్షన్లు (కొత్త రంగారెడ్డి జిల్లా కోటా) మంజూరయ్యాయి. వీటి కోసం జిల్లా వ్యాప్తంగా 24,243 లబ్ధిదారులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నిబంధనల ప్రకారం అర్హులను గుర్తించిన యంత్రాంగం.. 23,978 దరఖాస్తులను ఆమోదించింది. వీరిలో 14,482 మందికి వంటగ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఆమోదం పొందిన వాటిలో మిగిలిన లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే జిల్లాకు మంజూరైన మొత్తం 41,746 కనెక్షన్లలో 58 శాతం కనెక్షన్లకు మాత్రమే దరఖాస్తులు అందగా.. మిగిలిన 42 శాతం అంటే 17,768 కనెక్షన్లకు దరఖాస్తులు రాలేదు. క్షేత్రస్థాయిలో బీపీఎల్ కుటుంబాలకు సమాచారం చేరకపోవడం, అధికారులు ప్రచారం కల్పించడకపోవడం తదితర కారణాల వల్ల స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. ఈ నేపథ్యంలో కనెక్షన్లు అవసరం అనుకున్న బీపీఎల్ కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులు ఉంటే దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని వంటగ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు జిల్లా పౌరసరఫరాల అధికారులు సూచించారు. అలాగే కిరోసిన్ తీసుకుంటున్న కుటుంబాలకు దీపం కనెక్షన్లు పొందేలా చూడాలని చౌక ధరల దుకాణాల యజమానులకు చెప్పినట్లు అధికారులు అంటున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఇలా... ► ఆహార భద్రత (రేషన్)కార్డు కలిగి ఉండి వంటగ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆధార్‌కార్డు తప్పనిసరి. ► తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి. ► నిబంధనల మేరకు అర్హులుగా గుర్తిస్తే.. లబ్ధిదారులు తమ వాటాగా సుమారు రూ.వెయ్యి చెల్లించాలి. ► గ్యాస్ నింపిన బండ, నాణ్యమైన రెగ్యులేటర్, పైపు అందజేస్తారు. ► స్టౌని లబ్ధిదారులు మార్కెట్లో గానీ, వంటగ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్దనైనా కొనుగోలు చేసుకోవచ్చు. ► ఒకవేళ మార్కెట్లో స్టౌను కొనుగోలు చేస్తే డిస్ట్రిబ్యూటర్‌కు ఇన్స్టలేషన్ చార్జీల కింద రూ.250 చెల్లించాలి. -
మనిషి ప్రాణానికి రూ.26, ఆవు ప్రాణానికి రూ.70
న్యూఢిల్లీ: సాంస్కృతికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతున్న భారత దేశంలో మనిషి ప్రాణాలు ఎక్కువ విలువైనవా? ఆవు ప్రాణాలు ఎక్కువ విలువైనవా? అని ఎవరైనాఅడిగితే గతంలోనైతే ఏమాత్రం ఆలోచించకుండా మనిషి ప్రాణాలే ఎక్కువ విలువైనవని చెప్పేవారు. గోమాంసం పేరిట మనుషులను గొడ్డులాబాది ప్రాణాలను తీస్తున్న ప్రస్తుతం పరిస్థితుల్లో మనిషి ప్రాణం కన్నా ఆవు ప్రాణమే కచ్చితంగా విలువైనదని చెప్పవచ్చు! అందుకే రాజస్థాన్‌లోని వసుంధర రాజే ప్రభుత్వం కూడా పేదలకిచ్చే విలువకన్నా ఆవులకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజలను ఆదుకునేందుకు వసుంధర రాజె ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద ప్రతి వ్యక్తిపై రోజుకు 26.65 రూపాయలను ఖర్చు చేస్తోంది. అదే ప్రతి ఆవు సంరక్షణకు రోజుకు 70 రూపాయలను ఖర్చు పెడుతున్నది. అదే దూడలపై 35 రూపాయల చొప్పున ఖర్చు చేస్తోంది. ఇది కేవలం వాటి దాణా కోసం వెచ్చిస్తున్న సొమ్ము మాత్రమే. ఈ మొత్తాన్ని కూడా ప్రజల నుంచే రాబట్టేందుకు 33 రకాల ప్రజల లావాదేవీలపై పది శాతం ఆవు సెస్సును విధిస్తోంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై కూడా ఎన్నడూ శ్రద్ధ పెట్టని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గోసంరక్షణ శాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. జైపూర్‌లోని హింగోనియా గోసంరక్షణ శాలలో వేలాది ఆవులు మరణించడమే అందుకు కారణం కావచ్చు. అధునాతన హంగులతో రాష్ట్రంలో పలు గోసంరక్షణ శాలలను నిర్మించాలని, వేళకు వాటికి దాణా అందుతుందో, లేదో తెలుసుకోవడానికి సీసీటీవీ కెమేరాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంతోకాలంపాటు గోవుల ఆలనా, పాలనా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నెలలో గోసంరక్షణ కోసం ఓ ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఆ కమిటీ సమావేశమై ఆవుల మేత కోసం ఒక్కో ఆవుపై రోజుకు 32 రూపాయలను, ప్రతి దూడపై 16 రూపాయలను ఖర్చు పెట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మూడు నెలలపాటు అమలు చేయాలని నిర్ణయించి, అమలు చేసింది కూడా. మళ్లీ ఏప్రిల్ మాసంలో ఈ కమిటీ రాజస్థాన్‌లోని 13 జిల్లాల మున్సిపల్ అధికారులతో సమావేశమై ఒక్కో అవుపై ఖర్చుపెట్టే మొత్తాన్ని 70 రూపాయలకు, దూడపై పెట్టే ఖర్చుపెట్టే మొత్తాన్ని 35 రూపాయలకు పెంచాలని తీర్మానించింది. పెరిగిన ఈ అదనపు భారాన్ని ప్రజల నుంచి ఏ రూపంలో వసూలు చేయాలని ఇప్పుడు మున్సిపాలిటీలు కసరత్తు చేస్తున్నాయి. రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లాకు చెందిన రషీద్ దారిద్య్ర రేఖకు దిగువున జీవిస్తున్నాడు. ఆయన రోజు రిక్షా తొక్కడం ద్వారా రోజుకు 60 నుంచి 70 రూపాయలు సంపాదిస్తున్నాడు. అందులో తన ఖర్చులుపోనూ ఉంటున్న గుడెశెకు అద్దె చెల్లించాలి. భార్యా, ఇద్దరు పిల్లలను పోషించాలి. రాజస్థాన్‌లో దాదాపు 30 శాతం మంది రషీద్ లాంటి వారు ఉన్నారు. వారి బతుకులు అలా తెల్లారిపోవాల్సిందేనా!. -
990 రూ.లకే ఎల్పీజీ స్టవ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేదలకు మరో బంపర్ ఆఫర్ ఇస్తోంది ఎన్డీయే సర్కార్. తనను తాను శ్రామిక్ నంబర్ వన్‌గా అభివర్ణించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన వున్న గ్రామీణ మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా, వారి సాధికారత కోసం మరో నిర్ణయం తీసుకుంది. ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేసే ప్రతిష్టాత్మక పథకంతో పాటు గ్యాస్ స్టవ్ ఖరీదును దాదాపు సగానికి తగ్గించి పేదలకు అందించనున్నట్టు తెలుస్తోంది. పేద కుటుంబాలపై భారాన్ని తగ్గించేందుకు వీలుగా రూ 990 రూ.లకే గ్యాస్ స్టవ్ ను అందించనున్నట్టు సమాచారం. బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనక్షన్లు అందిస్తున్న పథకానికి కొనసాగింపుగా ఈ తగ్గింపు ఉంటుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. వీటిని సమూహ సేకరణ ద్వారా (బల్క్ ప్రొక్యూర్మెంట్ ) అందించిననున్నట్టు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. కాగా ఉత్తరప్రదేశ్‌లోని బాలియాలో మే 1న ఉజ్వల యోజన పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించిన ప్రధాని మోదీ వచ్చే మూడేండ్లలో దేశవ్యాప్తంగా దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్నవారిలో ఐదుకోట్ల మందికి ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇందుకు రూ.8000 కోట్లు కేటాయించామనీ, ప్రతి ఎల్పీజీ కనెక్షన్‌కు పథకం కింద రూ.1600 ఆర్థికసాయం లభిస్తుందని ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే -
ఆహార భద్రత భారం రూ.960 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న జాతీయ ఆహార భద్రతా పథకం నిర్వహణ భారం రాష్ట్ర ప్రభుత్వంపై భారీగానే పడనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం తొలగించిన కార్డులను మినహాయించి, మిగిలిన లబ్ధిదారులకు ఆహార భద్రత పథకాన్ని అమలు చేస్తే ఏటా ఏకంగా రూ.960 కోట్ల మేర భారం పడే అవకాశాలున్నట్లు సర్కారు అంచనా వేస్తోంది. కేంద్ర మార్గదర్శకాల మేరకు 75 శాతం గ్రామీణ, 50 శాతం పట్టణ ప్రాంతాల్లోని బీపీఎల్ కుటుంబాలకు ఆహార భద్రతా పథకాన్ని వర్తింపజేయాల్సి ఉంది. ఈ లెక్కన ఆహార భద్రత పథకానికి 1.91 కోట్ల మంది అర్హులుగా తేల్చిన కేంద్రం.. అందుకు 13.36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటుందని లెక్కకట్టింది. అదనంగా ఉన్న కుటుంబాలకు అయ్యే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని సూచించింది. తాజా అంచనా మేరకు ఆహార భద్రత పథకం కింద రాష్ట్రంలో సుమారు 2.71 కోట్ల మంది అర్హులుగా ఉంటారని సర్కారు తేల్చింది. కేంద్రం కిందకు వచ్చేవారిని మినహాయిస్తే రాష్ట్రం సుమారు 80 లక్షల మంది భారాన్ని మోయాల్సి వస్తుంది. వీరికి ప్రతినెలా 4 కేజీల బియ్యాన్ని అందించాలంటే బహిరంగ మార్కెట్లో కిలో బియాన్ని రూ.25 వరకు కొని లబ్ధిదారులకు కిలో రూపాయికే అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో లభ్ధిదారునిపై రూ.100 చొప్పున మొత్తం 80 వేల మందిపై ఏటా రూ.960 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రంలో ఆహార భద్రత పథకం అమలుకు మొత్తం 18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉండగా, కేంద్రం తన వాటాగా 13 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇస్తుంది. మిగతా 5 లక్షల మెట్రిక్ టన్నుల భారాన్ని రాష్ట్రం మోయాల్సిందే. దీనిపై మరోమారు కేంద్రాన్ని సంప్రదించి పథకం అదనపు భారాన్ని తగ్గించాలని కోరే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
1.72 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్
రాష్ట్రంలో ఉన్న మొత్తం 1.72 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఉత్తరప్రదేశ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 201 తహసీళ్లకు గాను 166 చోట్ల 33/11 కెవి సబ్స్టేషన్ల నిర్మాణం ఈ సంవత్సరం అక్టోబర్నాటికల్లా పూర్తవుతుందని ఆయన చెప్పారు. మిగిలినవి 2015 మార్చికి పూర్తవుతాయి. రాష్ట్రమంతటికీ కోతలు లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలన్న ప్రణాళిక కోసం 122 ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అంపారా-డి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు, హర్దువాగంజ్, పాంకా విస్తరణ, ఓబ్రా-సి, ఘాతంపూర్, మేజా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను తగిన కాలావధిలోగా పూర్తి చేయాలన్నారు. లోహియా గ్రామాల్లో సోలార్ లైట్ల ఏర్పాటును సీనియర్ అధికారులు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,200 సోలార్ పంపులను ఏర్పాటుచేసేందుకు కూడా నిధులు విడుదల చేశామని అన్నారు.