ముదిరాజ్ సింహ గర్జన (పాత చిత్రం)
పురాతన కాలం నుంచి ఘనమైన చరిత్ర కలిగిన ముదిరాజ్‌లు నేటి సమాజంలో సామాజిక అభివృద్ది లేని, హక్కుల సాధన లేని, రాజకీయ అభివృద్ది లేని, ముఖ్యంగా యువతకు ఏ మాత్రం మార్గదర్శకం చేయలేని కులంగా మనుగడ సాగిస్తున్నారు. దేశంలోని ఏ సామాజిక బృందాలతో పోల్చినా ముదిరాజ్‌లు సమాజంలో విద్య, ఆర్థిక, రాజకీయ అంశాల్లో 100 అడుగులు వెనుకబడి ఉన్నారు. కన్నీళ్లు తప్ప ఆనందం లేని బతుకులు గడుపుతున్న వారికి విద్యలేదు, ఉద్యోగాలు లేవు. గత వందేళ్లలో ఒక ఐ.పి.యస్ కాని ఒక ఐ.ఎ.యస్ కానీ ముదిరాజ్‌లలో లేరంటే ఆశ్చర్యపడాల్సింది లేదు.
ముదిరాజ్‌లలో 100 మంది విద్యార్థులు చదువు మొదలు పెడితే డిగ్రీస్థాయికి వచ్చేసరికి 30%మంది డ్రాపౌట్స్ అవుతున్నారు. ఇక మనలో 90% కుటుం బాలు బీపీఎల్ కుటుంబాలే అన్నది వాస్తవం. ఇక గ్రామీణ ప్రాంతంలో ముదిరాజుల బతుకులు చెరువులో ప్రభుత్వం వేసే చేపల్లాంటి బ్రతుకులు. బయటకి వస్తే ఊపిరాడక చచ్చిపోతాం. లోపలే ఉంటే నాచు తీరున అణిగిపోయి ఉంటాం. చేపల వృత్తిపై బతుకుతున్నా ఆదాయం అంతంత మాత్రమే.
రానున్న రెండేళ్ళ కాలవ్యవధిలో, వెయ్యికోట్ల రూపాయల భారీ నిధులతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలు తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యపారిశ్రామిక రంగం ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేస్తుందని పాలకులు చెబుతున్నారు. మత్స్య పరిశ్రమతో ముదిరాజ్‌లలో మార్పు వస్తుందీ అనుకున్నాం కానీ పేరుకు తెలంగాణ ప్రభుత్వం మత్స్య పరిశ్రమకు వెయ్యి కోట్లు కేటాయించినట్లు ప్రకటించినా రాష్ట్రంలో 40 లక్షలమంది జనాభాతో ఉన్న ముదిరాజ్‌లకు ఆ మొత్తం ఒక మూలకూ సరిపోదన్నది వాస్తవం. ఇలాంటివాటి వల్ల మనకు పెద్దగా ఉపయోగపడేది ఏమీ లేదు.
వందేళ్లుగా అంటే 1920ల నుంచి ఇదే దుస్థితిలో ఉంటున్నాం. కోమాలో ఉన్న ముదిరాజ్‌ల బతుకులు మారాలంటే మన యువత ఇప్పటికైనా జనాభా దామాషా ప్రాతిపదికన సమాజంలోని అన్ని అవకాశాల్లో వాటాకోసం ఉద్యమించాల్సిందే. ముదిరాజ్‌లు గత వైభవాన్ని సాధించాలంటే ఓటు రాజులుగా కొనసాగుతున్న పరిస్థితి పోవాలి.
-పి. సురేంద్రబాబు ముదిరాజ్, ముదిరాజ్ సేవా సమితి అధ్యక్షులు ‘ 93945 58798
Comments
Please login to add a commentAdd a comment