Mudiraj
-
ముదిరాజ్‌ల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముదిరాజ్‌ల ఆత్మగౌరవం దెబ్బతీసేవిధంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ముదిరాజ్‌ల ఆత్మగౌరవసభలో ఈటల మాట్లాడుతూ జనాభానిష్పత్తి ప్రకారం ముదిరాజ్ లు 11 శాతం ఉన్నారని, పదకొండుమందికి ఎమ్మె ల్యేలుగా అవకాశం దక్కాలని, ఇరవై ఏళ్ల నుంచి ఇద్దరు లేక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. తెలంగాణలో బీసీలు 52 శాతం ఉంటే... 9 మంత్రి పదవులు రావాలని, కానీ మూడు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఒకశాతం జనాభా లేని జాతి నుంచి సీఎంతో పాటు నలుగురుæ మంత్రులు ఉన్నారన్నా రు. మేము ఈ రాష్ట్రానికి ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం ఇస్తున్నామని, కానీ మీరు చేపపిల్లల పేరిట రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని, చేపపిల్లలు కాదు నేరుగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో బీసీలు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్‌ల ఆత్మగౌరవ సభను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని, మీటింగ్‌కు వెళితే ప్రభుత్వ పథకాలు రావని బెదిరించారని ఈటల ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అన్నింటిని ఎదుర్కొని ఆత్మగౌరవసభకు భారీగా తరలివచ్చారన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితం అందరికీ తెలుసని తాను ప్రజల మనిషినని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా, గుండాలు చంపుతామని బెదిరించినా వెనక్కి తగ్గలేదని, రాష్ట్రంలో అన్ని కులాల సమస్యలపై గొంతెత్తి పోరాడానని గుర్తు చేశారు. ముదిరాజ్‌లను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని తాను ఎమ్మెల్యే అయిన మొదటిరోజు నుంచే కొట్లాడుతున్నానని, వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 జడ్చర్ల సభలో ముదిరాజ్‌లను బీసీడి నుంచి బీసీ ఏలోకి మారుస్తా అని చెప్పారని, అదే సభలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ప్రకటించారన్నారు. అయితే బీసీ ఏ రిజర్వేషన్ ఒక్క సంవత్సరం మాత్రమే అమలైందని, మైనారిటీ వారు ఏడుగురు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, సుప్రీంకోర్టుకు వెళ్లి వారు గెలిచారని, మనకు ఎవరు లేక పట్టించుకోవడం లేదని చెప్పారు. మేం వేరే రాష్ట్రం నుంచి వచ్చామా : నీలం మధు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా మా ముదిరాజ్‌లను గుండెల్లో పెట్టుకొని ఎవరు ఎన్ని సీట్లు కేటాయిస్తారో, వారితోనే పొత్తు పెట్టుకొని వారితోనే ఉంటామని ముది రాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలంమధు చెప్పారు. ఆరోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడామో.. అదే ఆత్మగౌరవం ముదిరాజ్ జాతికి దక్కేలా పోరాడతామన్నా రు. బీసీల్లో 60 లక్షల మంది ఉన్న ముదిరా జ్లకు రాజకీయ గుర్తింపు లేదా..?మేము వేరే రాష్ట్రం నుంచి వచ్చామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ముదిరాజ్‌లందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ సభతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దద్దరిల్లింది. ఈటల రాజేందర్ ప్రసంగిస్తుండగా సభకు హాజరైన పలువురు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట శంకర్, పులుమేడ రాజు, చొప్పారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ముదిరాజ్‌లు ఐక్యంగా ఉంటూ రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ముదిరాజ్ జనాభా 60 లక్షల మంది ఉన్నారని, ముదిరాజ్‌లు అత్యధికంగా ఉండే ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండేసి అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో నిర్వహించే ముదిరాజ్ ప్లీనరీ పోస్టర్‌ను శుక్రవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, హోంమంత్రి మహమూద్ అలీ మంత్రుల నివాసాల్లో వేర్వేరుగా ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడారు. విద్య, ఉద్యోగాలలో అనేక తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేలా ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ కేటగిరీలోకి మార్చే ప్రక్రియను బీసీ కమిషన్ వెంటనే చేపట్టాలన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా నిర్వహిస్తున్న ముదిరాజ్ ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువత ప్రధానకార్యదర్శి అల్లుడు జగన్, యువత సభ్యులు బొక్క శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణసాగర్, రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి డి.కనకయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధిక, యువ నేతలు రంజిత్, పొకల రవి, యాదగిరిలు పాల్గొన్నారు. -
అన్ని కులవృత్తుల డీఎన్ఏ ఒక్కటే
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమ వారం రవీంద్రభారతిలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులవృత్తుల డీఎన్ఏ ఒక్కటేనని పేర్కొన్నారు. గత పాలకులు కులవృత్తులను విస్మరించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కుల సంఘాలు ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవడానికి స్థలంతో పాటు రూ.5 కోట్ల నిధులను కేటాయించినట్లు శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. మత్స్యకారుల చేపల పెంపకం కోసం రూ.185 కోట్ల నిధులను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం పలు రంగాల్లో రాణిస్తున్న ముదిరాజ్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాజేందర్, యువజన విభాగం అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జగన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పోరాడితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి
బన్సీలాల్‌పేట్: పీడిత కులాలు తమ భాష, సంస్కృతి మూలాలను మర్చిపోకుండా చైతన్యవంతమైన దిశగా ముందుకు సాగాలని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. మాజీ ఎమ్మెల్సీ, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్వర్యంలో సికింద్రాబాద్ బోయిగూడ ముదిరాజ్ సంఘంలో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ శతాబ్ది ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజ్యాంగ బద్ధంగా దక్కాల్సిన న్యాయమైన హక్కుల కోసం అణగారిన వర్గాలు పోరాడితే ప్రభుత్వాలు దిగొస్తాయన్నారు. రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తుల హక్కులతో పాటు వారి అభ్యున్నతి, వికాసానికి కాసాని జ్ఞానేశ్వర్ చేస్తున్న కృషి అమోఘమైనదని కొనియాడారు. క్రిష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలను, ఆదర్శాలను ఆచరణలో సాఫ ల్యం చేయడానికి ముదిరాజ్ మహాసభ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొ న్నారు. ముదిరాజ్‌లను బీసీ ‘డి’ నుంచి ‘ఏ’లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టుకు నివేదించడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత కోళి సమాజ్ అధ్యక్షుడు, గుజరాత్ ఎమ్మెల్యే కువార్జీ భావాలియా, సుప్రీంకోర్టు న్యాయవాది పాండు, ముదిరాజ్ మహాసభ నాయకులు వెంకటేష్, చెన్నయ్య, ప్రకాష్, సదానంద్, జగదీష్, వీరేష్, సాయి, శారదా, శ్రీనివాస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
3 నెలలు.. వేల మందికి ఉపాధి
సాక్షి, హైదరాబాద్: దళిత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహకార సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) సరికొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. 2020–21 వార్షిక సంవత్సరం ఎక్కువ భాగం కోవిడ్– 19 భయంతో గడిచిపోగా.. మిగతా సమ యాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి అవ కాశాలు పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉన్న ఎస్సీ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనుంది. ప్రస్తుత వార్షిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో తక్కువ సమయంలో శిక్షణ పూర్తి చేసి ఉపాధి కల్పించే అవకాశాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం విద్యాసంస్థలు, శిక్షణ సంస్థల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదు. ఈ క్రమంలో శిక్షణతో కూడిన ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించిన ఎస్సీ కార్పొరేషన్ ప్రభుత్వానికి నివేదించి అనుమతి కోసం వేచి చూస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ ఉన్న కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ రంగాల్లో నిరుద్యోగ ఎస్సీ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి టాప్ కంపెనీలతో ఎస్సీ కార్పొరేషన్ ఇప్పటికే పలు ఎంవోయూలు చేసుకుంది. దీంతో ప్రభుత్వం అనుమతిస్తే శిక్షణ తరగతులను ప్రారంభించనుంది. దీని కోసం రూ.25.8 కోట్లు ఖర్చు చేసి మూడు నెలల్లో 3,135 మందికి శిక్షణ ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించింది. నైపుణ్యాభివృద్ధి మాత్రమే కాకుండా ఉద్యోగాలు కల్పించేలా కార్యాచరణ రూపొందిచినట్లు ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి.కరుణాకర్ తెలిపారు. -
ముదిరాజ్‌ల అభివృద్ధికి కృషిచేస్తా
సాక్షి, ఖైరతాబాద్ : ముదిరాజ్‌ల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని మంత్రి ఈటల పేర్కొన్నారు. మనకెందుకులే అనుకునే స్థాయి నుంచి ఏ అవకాశాన్నీ వదులుకోకూడదనే స్థాయికి ముదిరాజ్‌లు ఎదిగా రన్నారు. ముదిరాజ్‌ల అభ్యున్నతికి కృషి చేసిన కోర్వి కృష్ణస్వామి 126వ జయంతి సందర్భంగా శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిర్వహిం చారు. ఈ సభకు హాజరైన మంత్రి ఈటల మాట్లాడుతూ.. ఉద్యమ బాధ్యతలు నిర్వహిస్తూనే ముదిరాజ్‌ల కోసం కృషి చేశానని తెలిపారు. జాతి సమస్యలు పరిష్కరించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని కలవగా.. ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ముదిరాజ్‌ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ‘నాకు పాలిచ్చి పెంచిన తల్లి ముదిరాజ్. వారికి అన్ని వేళలా అండగా ఉంటాను’అని ఆయన హామీ ఇచ్చారన్నారు. అన్నట్లుగానే ముదిరాజ్‌ల అభ్యు న్నతి కోసం చేప పిల్లల పంపిణీ, భవనాల ఏర్పాట్లు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ఈటల ఉద్యమ నేతగా, సీఎం కేసీఆర్‌కు కుడిభుజంగా ఎదిగారన్నారు. రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, ఎంపీ బండప్రకాశ్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో పర్యటించి ముదిరాజ్‌ల అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. -
ముదిరాజ్‌లను అన్నివిధాలా ఆదుకుంటాం
సాక్షి,బాన్సువాడ(నిజామాబాద్): ముదిరాజ్ కులస్తులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆపద్ధర్మ మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడలో కొత్త బాన్సువాడ ముదిరాజ్ కులస్తులు టీఆర్ఎస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తు చేసిన తీర్మాణ పత్రాన్ని మంత్రికి అందజేశారు. మంత్రికి పూలు, పండ్లు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడలో ఉన్న పేద ముదిరాజ్ కులస్తులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని, స్థలాలు ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. బీసీ కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ముదిరాజ్ కులస్తులను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చేందుకు మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఎకరం, అర ఎకరం భూమి ఉన్న ముదిరాజ్‌లకు సబ్సిడిపై పూలు, పండ్లు పెంపకం కోసం పాలీహౌస్ను మంజురు చేయిస్తామని అన్నారు. విత్తనాలు, డ్రిప్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. పాత బాన్సువాడ ముదిరాజ్ కళ్యాణ మండపంకు రూ. 30 లక్షలు, కోటగిరిలో ముదిరాజ్ కళ్యాణ మండపం నిర్మాణానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో ముదిరాజ్ సంఘాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నియోజకవర్గ నాయకులు గురువినయ్, మండల అధ్యక్షులు గడుమల లింగం, కొత్త బాన్సువాడ అధ్యక్షులు ఉప్పరి లింగం, వైస్ ఎంపిపి జిన్న రఘురామయ్య, జిల్లా నాయకులు మామిళ్ల రాజు, టీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, గంగాధర్, ఏజాస్, పాత బాలక్రిష్ణ, పంతులు రాము, నార్ల ఉదయ్, రాజేష్ తదితరులు ఉన్నారు. -
ముదిరాజ్‌ల భవిష్యత్ చిత్రపటం!
పురాతన కాలం నుంచి ఘనమైన చరిత్ర కలిగిన ముదిరాజ్‌లు నేటి సమాజంలో సామాజిక అభివృద్ది లేని, హక్కుల సాధన లేని, రాజకీయ అభివృద్ది లేని, ముఖ్యంగా యువతకు ఏ మాత్రం మార్గదర్శకం చేయలేని కులంగా మనుగడ సాగిస్తున్నారు. దేశంలోని ఏ సామాజిక బృందాలతో పోల్చినా ముదిరాజ్‌లు సమాజంలో విద్య, ఆర్థిక, రాజకీయ అంశాల్లో 100 అడుగులు వెనుకబడి ఉన్నారు. కన్నీళ్లు తప్ప ఆనందం లేని బతుకులు గడుపుతున్న వారికి విద్యలేదు, ఉద్యోగాలు లేవు. గత వందేళ్లలో ఒక ఐ.పి.యస్ కాని ఒక ఐ.ఎ.యస్ కానీ ముదిరాజ్‌లలో లేరంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. ముదిరాజ్‌లలో 100 మంది విద్యార్థులు చదువు మొదలు పెడితే డిగ్రీస్థాయికి వచ్చేసరికి 30%మంది డ్రాపౌట్స్ అవుతున్నారు. ఇక మనలో 90% కుటుం బాలు బీపీఎల్ కుటుంబాలే అన్నది వాస్తవం. ఇక గ్రామీణ ప్రాంతంలో ముదిరాజుల బతుకులు చెరువులో ప్రభుత్వం వేసే చేపల్లాంటి బ్రతుకులు. బయటకి వస్తే ఊపిరాడక చచ్చిపోతాం. లోపలే ఉంటే నాచు తీరున అణిగిపోయి ఉంటాం. చేపల వృత్తిపై బతుకుతున్నా ఆదాయం అంతంత మాత్రమే. రానున్న రెండేళ్ళ కాలవ్యవధిలో, వెయ్యికోట్ల రూపాయల భారీ నిధులతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలు తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యపారిశ్రామిక రంగం ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేస్తుందని పాలకులు చెబుతున్నారు. మత్స్య పరిశ్రమతో ముదిరాజ్‌లలో మార్పు వస్తుందీ అనుకున్నాం కానీ పేరుకు తెలంగాణ ప్రభుత్వం మత్స్య పరిశ్రమకు వెయ్యి కోట్లు కేటాయించినట్లు ప్రకటించినా రాష్ట్రంలో 40 లక్షలమంది జనాభాతో ఉన్న ముదిరాజ్‌లకు ఆ మొత్తం ఒక మూలకూ సరిపోదన్నది వాస్తవం. ఇలాంటివాటి వల్ల మనకు పెద్దగా ఉపయోగపడేది ఏమీ లేదు. వందేళ్లుగా అంటే 1920ల నుంచి ఇదే దుస్థితిలో ఉంటున్నాం. కోమాలో ఉన్న ముదిరాజ్‌ల బతుకులు మారాలంటే మన యువత ఇప్పటికైనా జనాభా దామాషా ప్రాతిపదికన సమాజంలోని అన్ని అవకాశాల్లో వాటాకోసం ఉద్యమించాల్సిందే. ముదిరాజ్‌లు గత వైభవాన్ని సాధించాలంటే ఓటు రాజులుగా కొనసాగుతున్న పరిస్థితి పోవాలి. -పి. సురేంద్రబాబు ముదిరాజ్, ముదిరాజ్ సేవా సమితి అధ్యక్షులు ‘ 93945 58798 -
ముదిరాజ్‌ల సంక్షేమానికి వెయ్యి కోట్లు
సాక్షి. జనగామ: ముదిరాజ్‌ల సంక్షేమానికి రూ.వెయ్యి కోట్లతో 38 రకాల సౌకర్యాలను కల్పిస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేం ద్రంలో బుధవారం భారీ బహిరంగ సభను నిర్వహిం చారు. జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఈటల ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రోకర్ల పాత్రను తగ్గించి మత్స్యకారులు లాభం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ముదిరాజ్‌లకు వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను సరఫరా చేస్తామని, రుణాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చేపల పెంపకంలో బ్రోకర్ల వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల్లో మత్స్యకారుల సంక్షేమంపై అధ్యయనం చేశామని గుర్తు చేశారు. మత్స్యకారుడు ఏ కారణంతో చనిపోయినా రూ.6 లక్షల బీమా ఇస్తామని హామీ ఇచ్చారు. చెరువులపై రైతులు, ముదిరాజ్‌లు, రజకులకు హక్కులు కల్పించేవిధంగా జీవోను జారీ చేస్తామని తెలిపారు. బండా ప్రకాశ్‌కు వ్యక్తిగతంగా రాజ్యసభ సీటు రాలేదని, ముదిరాజ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం కోసమే కేసీఆర్ సీటు కేటాయించారన్నారు. వైఎస్ చొరవతో ముదిరాజ్‌లను బీసీ(డీ) నుంచి బీసీ(ఏ)లో చేర్చారని, ఏడాదిపాటు రిజర్వేషన్లు అనుభవించామని, ముదిరాజ్‌లలో ఐక్యత లేకపోవడంతో రిజర్వేషన్లు నీరుగారిపోయాయని విచా రం వ్యక్తం చేశారు. సామాజిక ఉద్యమకారుడిగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతోందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. హరితహారం, మిషన్ కాకతీయతో ముదిరాజ్ లకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎంపీ లు బండా ప్రకాష్, నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, రాజయ్య, యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘చేప’ తెచ్చిన తంటా!
► రెండు గ్రామాల మధ్య వివాదం ► గంగపుత్రులు, ముదిరాజ్‌ల మధ్య వాగ్వాదం ► చేపల వేటను అడ్డుకున్న ముదిరాజ్‌లు ► కలెక్టర్‌ను కలిసిన గంగపుత్రులు మోపాల్ (నిజామాబాద్ రూరల్): చెరువులో చేపలు పట్టే విషయమై రెండు గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. వేరే గ్రామానికి చెందిన గంగపుత్రులు చేపలు పడుతుండగా, ముదిరాజ్ కులస్తులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు, పోలీసుల జోక్యంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది. నిజామాబాద్ రూరల్ మండలంలోని పాంగ్రా సచివాలయ పరిధిలో ఉన్న మాధవనగర్ చేపల చెరువులో బోర్గాం గ్రామానికి చెందిన గంగపుత్రులు శుక్రవారం చేపల వేట ప్రారంభించారు. అయితే, మా గ్రామ చెరువులో మీరెలా చేపలు పడతారని మాధవనగర్‌కు చెందిన ముదిరాజ్ కులస్తులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడకు చేరుకొని సర్దిచెప్పారు. సమస్య ఉంటే స్టేషన్‌కు వచ్చి సామరస్యంగా మాట్లాడుకోవాలని ఏఎస్సై సీతారాం సూచించారు.మరోవైపు, గంగపుత్రులు కలెక్టర్ యోగితారాణాను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. 1990 నుంచి తాము సదరు చెరువులో చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. చెరువుపై తమకే హక్కుందని, చేపలు పట్టుకొనేందుకు కోర్టు కూడా ఆదేశాలు (ఇంజక్షన్ ఆర్డర్స్) ఇచ్చిందని చెప్పారు. స్పందించిన కలెక్టర్ వెంటనే సమస్య పరిష్కరించాలని మత్స్య శాఖ ఏడీ మహిపాల్, ఆర్డీవో వినోద్‌కుమార్‌లను ఆదేశించారు. దీంతో ఆర్డీవో, ఏడీ, తహసీల్దార్ సుదర్శన్ ఆర్డీవో కార్యాలయంలో బోర్గాం గ్రామానికి చెందిన మత్స్య సహకార సంఘం ప్రతినిధులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువు గంగపుత్రుల పేరు మీదే రిజిస్ట్రేషన్ అయి ఉందని మత్స్య శాఖ ఏడీ అధికారులకు వివరించారు. చెరువులో చేపలు పట్టుకొనేందుకు కోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిందని గంగపుత్రులు ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు. చేపలు వేటాడేందుకు తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, పోలీస్ అధికారులు హైదరాబాద్‌లో సీఎం సమావేశానికి వెళ్లినందున, సమస్యను శనివారం పరిష్కరిస్తామని అధికారులు వారికి సూచించారు. మాకే హక్కు ఉంది: గంగపుత్రులు 1990 నుంచి తాము అదే చెరువులో చేపలు పట్టుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని బోర్గాం గ్రామానికి చెందిన గంగపుత్రులు విలేకరులకు తెలిపారు. చేపలు పట్టుకొనేందుకు కోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 18 నుంచి 23 వరకు చేపలు పట్టుకొనేందుకు న్యాయస్థానం ఉత్తర్వులు (ఇంజక్షన్ ఆర్డర్స్) జారీ చేసిందని తెలిపారు. అలాగే, చేపల వేటకు అడ్డు తగులుతున్న నలుగురికి నోటీసులు కూడా ఇచ్చిందని మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు పసుల చిన్న నర్సయ్య, కార్యదర్శి తోపారం గంగాధర్, నారాయణ తదితరులు తెలిపారు. చేప పిల్లలు మేమే వేశాం: ముదిరాజ్‌లు మా గ్రామంలోని చెరువుపై మాకే హక్కు ఉంటుంది. మా గ్రామస్తులు ఈ చెరువు స్థలాన్ని గతంలో కుంట కోసం విరాళంగా ఇచ్చారు. రూ.లక్ష విలువైన చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులో వదిలిపెట్టాం. అలాగే, చెరువులో మొలిచిన పిచ్చి మొక్కలను మేమే తొలగించాం. చేపలు పట్టుకునే హక్కు మాకే కల్పించి న్యాయం చేయాలి. దీనిపై కలెక్టర్‌ను కూడా ఫిర్యాదు చేశాం. -
చేపలు పట్టే హక్కు కల్పించండి
► సింగసముద్రం, జక్కులచెరువుల్లో అవకాశం కల్పించడి ► రాచర్లబొప్పాపూర్ ముదిరాజ్‌ల డిమాండ్ ► కలెక్టరేట్ ఎదుట ఆందోళన సిరిసిల్ల : సింగసముద్రం, జ క్కుల చెరువుల్లో చేపలు పట్టే హక్కులు కల్పించాలనే డిమాం డ్తో ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ముదిరాజ్ లు సోమవారం కలెక్టరేట్ ఎ దుట ధర్నా చేశారు. బొప్పాపూర్‌లో 250 కుటుంబాలు ఉన్నాయని, తమకు ఎలాంటి అడవు లు అందుబాటులో లేవన్నారు. దీంతో ఉపాధి లభించక దిక్కు లు చూస్తున్నామని ఆవేదన చెందారు. వ్యవసాయ భూము లు లేక కూలీ పనులు చేసుకుం టున్నామని తెలిపారు. కులవృత్తి సరిగా లేక మరికొం దరు వలస పోతున్నారని చెప్పారు. జక్కుల చెరువు, సింగసముద్రంలో చేపలు పట్టేందుకు హక్కులు కల్పిస్తే జీవనోపాధికి అవకాశం ఉంటుందని వారు వివరించారు. ఈమేరకు కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు రెడ్డబోయిన గోపి, నర్సయ్య, మల్లేశం, శ్రీనివాస్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ముదిరాజ్‌లను బీసీ–ఎలో చేర్చొద్దు
► గంగపుత్రులకు అన్యాయం చేయవద్దు ► గంభీరావుపేటలో ర్యాలీ గంభీరావుపేట : ముదిరాజ్ కులస్తులను బీసీ–ఎ జాబి తాలో చేర్చి తమకు అన్యాయం చేయవద్దని గంగపుత్ర సంఘం నాయకులు డిమాండ్ చేశా రు. ఈమేరకు సోమవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీచౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్ఐ కార్తీక్‌కు వినతిపత్రం ఇచ్చా రు. గంగపుత్రుల మనోభావాలను దెబ్బతీసే లా వ్యవహరించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. చేపల వృత్తి ముదిరాజ్‌లదని, గంగపుత్రులకు అన్యాయం చేసేలా సీఎం కేసీఆర్ ప్రకటించ డం విడ్డూరంగా ఉందన్నారు. సర్కారు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు కూర దేవేందర్, మండల అధ్యక్షుడు కరువారి శంకర్, నాయకులు దామోదర్, కాత మల్లేశం, శ్రీధర్, శ్రీనివాస్, ధర్మపురి, శ్రీకాంత్, దేవేందర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముదిరాజ్‌లను బీసీ–ఎ జాబితాలో చేర్చవద్దు
గంగపుత్రుల డిమాండ్ ► కలెక్టరేట్ ముట్టడి ► అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనపై తీవ్రనిరసన సిరిసిల్ల : ముదిరాజ్ సామాజికవర్గాన్ని బీసీ–ఎ జాబితాలో చేర్చుతున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేయడం సరికాదని గంగపుత్రులు అన్నారు. సీఎం ప్రకటనను నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీప్రదర్శన నిర్వహించారు. తర్వాత కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముదిరాజ్‌లను బీసీ–ఎ గ్రూపులో చేర్చవద్దని డిమాండ్ చేశారు. చెరువుల్లో చేపలు పట్టే వృత్తిలో ఉన్న నిజమైన మత్స్యకారులకు అన్యాయం చేయొద్దని, సీఎం ప్రకటనను వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా బీసీ–ఎ జాబితాలోని 53 ఉప కులాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్లం చేశారు. అణగారిన కులాలు అధికంగా ఉన్న బీసీ–ఎ జాబితాకు 7శాతం రిజర్వేషన్ సరిపోదన్నారు. వీరి మధ్య ఇప్పటికీ ఆర్థిక అసమానతలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్ ను 14శాతానికి పెంచి ముదిరాజ్‌లను బీసీ–ఎ గ్రూపులో చేర్చితే తమకు అభ్యంతరం లేదని అన్నారు. అనంతరామన్ కమిషన్ కులాలు, వృత్తుల విషయంలో ఇదే స్పష్టత ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ తన ప్రకటనపై పునరాలోచించాలని గంగపుత్రులు డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టర్ డి.కృష్ణభాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు కూర దేవేందర్, ప్రధాన కార్యదర్శి ఖాత మల్లేశం, నాయకులు నర్సయ్య, రవి, మహేశ్, తోకల తిరుమల్, పారిపెల్లి శ్రీనివాస్, వెంగల శ్రీనివాస్, పరశురాములు, కె.శ్రీధర్, మునీందర్, సాయాబు, ప్రశాంత్, హన్మయ్య, దేవరాజు, రాజయ్య, శ్రీనాథ్, ఎల్లయ్య, శంకర్, శివప్రసాద్, సాయికుమార్, సతీశ్ పాల్గొన్నారు. -
ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి
► డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తా ► రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలో ముదిరాజ్‌ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ముదిరాజ్‌లు నిర్వహించిన చలో హైదరాబాద్ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి చేర్చడానికి తన వంతుగా సీఏం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముదిరాజ్‌లు ఎంతో కృషి చేశారని, రాష్ట్రంలోని 86 ముదిరాజ్‌లు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. బీసీల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బీసీ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకు ముందు పార్క్‌లో ఉన్న ముదిరాజ్‌ల ఆరాధ్యదైవం భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లోకా భూమారెడ్డి, ముదిరాజ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్, జిల్లా నాయకులు శ్రీనివాస్, శంకర్, మల్లేష్, రమేష్, శివ్వయ్య, తదితరులు పాల్గొన్నారు. -
18న నిజాం గ్రౌండ్స్‌లో ముదిరాజ్‌ల సభ
సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ముదిరాజ్ కులస్తులను బీసీ ‘డి’ గ్రూపు నుంచి ‘ఏ’ గ్రూపులోకి వెంటనే మార్చి ముదిరాజ్‌లను ఆదుకోవాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పొల్కం లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అపరిష్కృతంగా ఉన్న ముదిరాజ్ కులస్తుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 18న నిజాం కళాశాల గ్రౌండ్సలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం నారాయణగూడలోని ముదిరాజ్ మహాసభ కార్యాలయంలో బహిరంగ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మహాసభ ప్రధాన కార్యదర్శి పసుల విజయ్‌కుమార్, పి.వెంకటేశ్, కృష్ణంరాజు, నర్సింహులుతో కలసి ఆయన ఆవిష్కరించారు. -
ముదిరాజ్‌లను బీసీ‘ఏ’లో చేర్చాలి
యాదగిరిగుట్ట : రాజకీయంగా వెనుకబడుతున్న ముదిరాజ్ కులస్తులను బీసీ‘ఏ’లో చేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.జగన్మోహన్, జిల్లా అధ్యక్షుడు కొల్ల సైదులు ప్రభుత్వాన్ని కోరారు. యాదగిరిగుట్టలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆ సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీసీ‘డీ’ నుంచి బీసీ‘ఏ’ గ్రూప్‌లోకి మార్చితే ముదిరాజ్‌లకు అనేక రంగాల్లో అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ఆర్డినెస్ ద్వారా బీసీ డీ నుంచి బీసీ ఏ కు మార్చాలని, రూ.వేయి కోట్లతో ప్రత్యేక ఆర్థిక సంస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాలో 14శాతం ఉన్న ముదిరాజ్‌లకు టీఆర్ఎస్ ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. ప్రభుత్వం అన్ని కుల సంఘ భవన నిర్మాణాలకు రూ.కోట్లలో నిధులు ప్రకటించి ముదిరాజ్‌లను మాత్రం విస్మరించిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐక్యవేదిక కన్వీనర్ గుండాల మదన్‌కుమార్, ముదిరాజ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నర్సింహ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బోళ్ల సుజాత, సంఘం నాయకులు శాగంటి ఉమాపతి, ఆకవరం కృష్ణ, భాషబోయిన రాజేష్, యాట నాగరాజు, పిట్టల బాలరాజు, ఎర్రబోయిన జహంగీర్, మంద రాజు, ఇట్టబోయిన గోపాల్, కూర శేఖర్, శ్రీను తదితరులున్నారు. -
ట్రాన్స్‌కో డీఈకి ఘన సన్మానం
సూర్యాపేటటౌన్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ అవార్డు తీసుకున్న ట్రాన్స్ కో డీఈ ఎ.శ్రీనివాసులును సూర్యాపేట పట్టణ ముదిరాజ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా డీఈ శ్రీనివాసులు మాట్లాడుతూ 25ఏళ్ల నుంచి డిపార్ట్మెంట్లో చేసిన కృషి ఫలితమే తనకు ఈ అవార్డు లభించిందన్నారు. అలాగే సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పరబోయిన స్వామి ముదిరాజ్, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశలు హాజరై మాట్లాడారు. పతాని నర్సయ్య అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెలుగు సంతోషి, నారబోయిన విజయ్, నక్క రవి, నక్క రాంభానేష్, సారగండ్ల రాములు, అర్వపల్లి లింగయ్య, మాణిక్యమ్మ, వెలుగు వెంకన్న, చందనబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య
పెద్ద అంబర్‌పేట: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్‌లో ఓ కౌలు రైతు అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మదరమోని మల్లేశ్ ముదిరాజ్ (48)కు ఒక ఎకరం పొలం ఉంది. మరో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అయితే, సాగు, కుమార్తె వివాహం కోసం ఇప్పటి వరకు రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడు. కుమార్తె వివాహం అయిన ఏడాదికే అల్లుడు మృతి చెందాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అప్పుల విషయమై మనస్తాపం చెందిన మల్లేశ్ శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. పురుగుల మందు తాగినట్టు కుమార్తెకు చెప్పడంతో హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు.