‘చేప’ తెచ్చిన తంటా!
► రెండు గ్రామాల మధ్య వివాదం
► గంగపుత్రులు, ముదిరాజ్‌ల మధ్య వాగ్వాదం
► చేపల వేటను అడ్డుకున్న ముదిరాజ్‌లు
► కలెక్టర్‌ను కలిసిన గంగపుత్రులు
మోపాల్ (నిజామాబాద్ రూరల్): చెరువులో చేపలు పట్టే విషయమై రెండు గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. వేరే గ్రామానికి చెందిన గంగపుత్రులు చేపలు పడుతుండగా, ముదిరాజ్ కులస్తులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు, పోలీసుల జోక్యంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది. నిజామాబాద్ రూరల్ మండలంలోని పాంగ్రా సచివాలయ పరిధిలో ఉన్న మాధవనగర్ చేపల చెరువులో బోర్గాం గ్రామానికి చెందిన గంగపుత్రులు శుక్రవారం చేపల వేట ప్రారంభించారు. అయితే, మా గ్రామ చెరువులో మీరెలా చేపలు పడతారని మాధవనగర్‌కు చెందిన ముదిరాజ్ కులస్తులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడకు చేరుకొని సర్దిచెప్పారు. సమస్య ఉంటే స్టేషన్‌కు వచ్చి సామరస్యంగా మాట్లాడుకోవాలని ఏఎస్సై సీతారాం సూచించారు.మరోవైపు, గంగపుత్రులు కలెక్టర్ యోగితారాణాను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.
1990 నుంచి తాము సదరు చెరువులో చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. చెరువుపై తమకే హక్కుందని, చేపలు పట్టుకొనేందుకు కోర్టు కూడా ఆదేశాలు (ఇంజక్షన్ ఆర్డర్స్) ఇచ్చిందని చెప్పారు. స్పందించిన కలెక్టర్ వెంటనే సమస్య పరిష్కరించాలని మత్స్య శాఖ ఏడీ మహిపాల్, ఆర్డీవో వినోద్‌కుమార్‌లను ఆదేశించారు. దీంతో ఆర్డీవో, ఏడీ, తహసీల్దార్ సుదర్శన్ ఆర్డీవో కార్యాలయంలో బోర్గాం గ్రామానికి చెందిన మత్స్య సహకార సంఘం ప్రతినిధులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువు గంగపుత్రుల పేరు మీదే రిజిస్ట్రేషన్ అయి ఉందని మత్స్య శాఖ ఏడీ అధికారులకు వివరించారు. చెరువులో చేపలు పట్టుకొనేందుకు కోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిందని గంగపుత్రులు ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు. చేపలు వేటాడేందుకు తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, పోలీస్ అధికారులు హైదరాబాద్‌లో సీఎం సమావేశానికి వెళ్లినందున, సమస్యను శనివారం పరిష్కరిస్తామని అధికారులు వారికి సూచించారు.
మాకే హక్కు ఉంది: గంగపుత్రులు
1990 నుంచి తాము అదే చెరువులో చేపలు పట్టుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని బోర్గాం గ్రామానికి చెందిన గంగపుత్రులు విలేకరులకు తెలిపారు. చేపలు పట్టుకొనేందుకు కోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 18 నుంచి 23 వరకు చేపలు పట్టుకొనేందుకు న్యాయస్థానం ఉత్తర్వులు (ఇంజక్షన్ ఆర్డర్స్) జారీ చేసిందని తెలిపారు. అలాగే, చేపల వేటకు అడ్డు తగులుతున్న నలుగురికి నోటీసులు కూడా ఇచ్చిందని మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు పసుల చిన్న నర్సయ్య, కార్యదర్శి తోపారం గంగాధర్, నారాయణ తదితరులు తెలిపారు.
చేప పిల్లలు మేమే వేశాం: ముదిరాజ్‌లు
మా గ్రామంలోని చెరువుపై మాకే హక్కు ఉంటుంది. మా గ్రామస్తులు ఈ చెరువు స్థలాన్ని గతంలో కుంట కోసం విరాళంగా ఇచ్చారు. రూ.లక్ష విలువైన చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులో వదిలిపెట్టాం. అలాగే, చెరువులో మొలిచిన పిచ్చి మొక్కలను మేమే తొలగించాం. చేపలు పట్టుకునే హక్కు మాకే కల్పించి న్యాయం చేయాలి. దీనిపై కలెక్టర్‌ను కూడా ఫిర్యాదు చేశాం.