బన్సీలాల్‌పేట్: పీడిత కులాలు తమ భాష, సంస్కృతి మూలాలను మర్చిపోకుండా చైతన్యవంతమైన దిశగా ముందుకు సాగాలని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. మాజీ ఎమ్మెల్సీ, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్వర్యంలో సికింద్రాబాద్ బోయిగూడ ముదిరాజ్ సంఘంలో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ శతాబ్ది ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజ్యాంగ బద్ధంగా దక్కాల్సిన న్యాయమైన హక్కుల కోసం అణగారిన వర్గాలు పోరాడితే ప్రభుత్వాలు దిగొస్తాయన్నారు.
రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తుల హక్కులతో పాటు వారి అభ్యున్నతి, వికాసానికి కాసాని జ్ఞానేశ్వర్ చేస్తున్న కృషి అమోఘమైనదని కొనియాడారు. క్రిష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలను, ఆదర్శాలను ఆచరణలో సాఫ ల్యం చేయడానికి ముదిరాజ్ మహాసభ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొ న్నారు. ముదిరాజ్‌లను బీసీ ‘డి’ నుంచి ‘ఏ’లో చేర్చాలని డిమాండ్ చేశారు.
బీసీ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టుకు నివేదించడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత కోళి సమాజ్ అధ్యక్షుడు, గుజరాత్ ఎమ్మెల్యే కువార్జీ భావాలియా, సుప్రీంకోర్టు న్యాయవాది పాండు, ముదిరాజ్ మహాసభ నాయకులు వెంకటేష్, చెన్నయ్య, ప్రకాష్, సదానంద్, జగదీష్, వీరేష్, సాయి, శారదా, శ్రీనివాస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment