Niranjan Jyoti
-
పోరాడితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి
బన్సీలాల్‌పేట్: పీడిత కులాలు తమ భాష, సంస్కృతి మూలాలను మర్చిపోకుండా చైతన్యవంతమైన దిశగా ముందుకు సాగాలని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. మాజీ ఎమ్మెల్సీ, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్వర్యంలో సికింద్రాబాద్ బోయిగూడ ముదిరాజ్ సంఘంలో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ శతాబ్ది ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజ్యాంగ బద్ధంగా దక్కాల్సిన న్యాయమైన హక్కుల కోసం అణగారిన వర్గాలు పోరాడితే ప్రభుత్వాలు దిగొస్తాయన్నారు. రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తుల హక్కులతో పాటు వారి అభ్యున్నతి, వికాసానికి కాసాని జ్ఞానేశ్వర్ చేస్తున్న కృషి అమోఘమైనదని కొనియాడారు. క్రిష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలను, ఆదర్శాలను ఆచరణలో సాఫ ల్యం చేయడానికి ముదిరాజ్ మహాసభ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొ న్నారు. ముదిరాజ్‌లను బీసీ ‘డి’ నుంచి ‘ఏ’లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టుకు నివేదించడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత కోళి సమాజ్ అధ్యక్షుడు, గుజరాత్ ఎమ్మెల్యే కువార్జీ భావాలియా, సుప్రీంకోర్టు న్యాయవాది పాండు, ముదిరాజ్ మహాసభ నాయకులు వెంకటేష్, చెన్నయ్య, ప్రకాష్, సదానంద్, జగదీష్, వీరేష్, సాయి, శారదా, శ్రీనివాస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లైవీల్ టెక్నాలజీతో చౌక విద్యుత్
సాక్షి, హైదరాబాద్: కాలుష్యరహితంగా తక్కువ ఖర్చులో విద్యుత్‌ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగొన్న తమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం అందించాలని ఫ్లైవీల్ పవర్ మల్టిప్లికేషన్ ఎండీ భాస్కర శ్రీనివాస్ చాగంటి అన్నారు. ‘రూరల్ ఇన్నోవేటర్స్ స్టార్టప్ కాంక్లేవ్’లో పవర్ సెక్టార్లో జాతీయస్థాయిలో బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డును శనివారం ఎన్ఐఆర్డీలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజలకు చౌకగా, కాలుష్యరహిత విద్యుత్ అందించాలనే ఈ ఆవిష్కరణ కోసం శ్రమించినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా ఉపయోగించని ‘ఫ్లైవీల్ పవర్ జనరేషన్’సాంకేతికతను రెండున్నర దశాబ్దాలపాటు తాను, తన భార్య చాగంటి బాల పరిశోధించి దీనిని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఇలాంటి సాంకేతికత దేశంలో ఎక్కడా లేదనేది కేంద్ర విద్యుత్ శాఖ, నీతి ఆయోగ్, డీఆర్డీవో, రైల్వే తదితర శాఖలు కితాబిచ్చినట్లు తెలిపారు. -
సాధ్వి వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు!
రాజ్యసభలో ప్రధాని ప్రకటన శాంతించని విపక్షం; సాధ్వి రాజీనామాకు డిమాండ్ వరుసగా మూడోరోజూ ఉభయ సభల్లో ప్రతిష్టంభన న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన జ్యోతి అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యల వ్యవహారం వరుసగా మూడో రోజూ పార్లమెంటును కుదిపేసింది. మంత్రి పదవికి ఆమె రాజీనామా చేయడమో లేక మంత్రిమండలి నుంచి ఆమెను తొలగించడమో చేయాల్సిందేనంటూ విపక్షమంతా ఒక్కటై గురువారం ఉభయసభలను స్తంభింపచేసింది. సాధ్వి జ్యోతి క్షమాపణ కోరారంటే దానర్థం ఆమె నేరం చేశానని ఒప్పుకున్నట్లేనని.. అందువల్ల మంత్రిగా కొనసాగే అర్హత ఆమెకు లేదని వాదించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ప్రకటన చేసినప్పటికీ.. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. ఈ అంశంపై స్పందించకుండా గత మూడు రోజులుగా మౌనం పాటించిన ప్రధాని గురువారం ఎట్టకేలకు స్పందించారు. రాజ్యసభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ.. సాధ్వి నిరంజన జ్యోతి చేసిన వ్యాఖ్యలు తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదనీయం కాదని తేల్చి చెప్పారు. ‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగిన రోజే సాధ్వి నిరంజన జ్యోతి చేసిన వ్యాఖ్యల విషయం తెలిసింది. అలాంటి భాష వాడకూడదంటూ ఆ రోజే మా ఎంపీలకు చెప్పాను. ఆమె సభకు కొత్త. ఆమె నేపథ్యం మనకు తెలుసు. ఎన్నికల వేడిలో అలా మాట్లాడారు. అయినా, అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. అవి మాకు ఆమోదనీయం కాదు. అయితే, సాధ్వి జ్యోతి క్షమాపణలు చెప్పారు కాబట్టి.. క్షమాపణలకు అర్థమేంటో తెలిసిన సీనియర్ సభ్యులు దేశ ప్రయోజనాల కోసం సభ సజావుగా సాగేందుకు సహకరించాలి. ఈ క్షమాపణల ద్వారా భాష విషయంలో హద్దులు దాటకూడదని, గౌరవమర్యాదలు పాటించాలని మనందరికి ఒక సందేశం వెళ్లింది’ అని వివరణ ఇచ్చారు. అయినా శాంతించని కాంగ్రెస్, తృణమూల్, ఆప్ తదితర విపక్ష పార్టీల సభ్యులు ఆమెను తొలగించాల్సిందేనంటూ నినాదాలతో సభను హోరెత్తించారు. ప్రధాని నుంచి కొన్ని వివరణలు కావాలన్న విపక్ష సభ్యుల అభ్యర్థనలను డిప్యూటీ చైర్మన్ అనుమతించలేదు. దాంతో వారు వెల్‌లోకి దూసుకెళ్లి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. అప్పటికే నాలుగుసార్లు వాయిదాపడిన సభను డెప్యూటీ చైర్మన్ శుక్రవారానికి వాయిదా వేశారు. లోక్‌సభలోనూ..: సాధ్వి జ్యోతి వ్యాఖ్యలపై ప్రధాని సభలో ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దానికి ప్రధాని నుంచి స్పందన రాకపోవడంతో సభా కార్యక్రమాలను బహిష్కరించాలని మూకుమ్మడిగా నిర్ణయించారు. ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలతో సభను అడ్డుకున్నారు. అధికారపక్ష సభ్యుల నిరసనల మధ్యనే.. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉండటంతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరిని అడ్డుకోవాల్సిన బాధ్యత స్పీకర్‌దేనన్నారు. అనంతరం టీఎంసీ, ఆప్, ఎస్పీ, ముస్లిం లీగ్ సభ్యులతో కలసి పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సాధ్వి జ్యోతి వ్యాఖ్యలను ప్రధాని సమర్ధిస్తున్నారా? ఆయన అభిప్రాయం తెలుసుకోవాలని సభ కోరుకుంటోంది. రెండు రోజులుగా ఈ అంశాన్ని లేవనెత్తడానికి మేం ప్రయత్నిస్తున్నా ప్రధాని నుంచి స్పందన లేదు. మాకు మెజారిటీ ఉంది. మేమేమైనా చేస్తాం అన్నట్లుగా వారి వైఖరి ఉంది’ అని ఖర్గే ధ్వజమెత్తారు. ఎన్నాళ్లీ ప్రతిష్టంభన సాధ్వి వివాదాస్పద వ్యాఖ్యల అంశం గత మూడు రోజులుగా రాజ్యసభను స్తంభింపజేయగా, లోక్‌సభలోనూ ఆ ప్రకంపనలు గట్టిగానే ఉన్నాయి. సాధ్వి జ్యోతి క్షమాపణలు చెప్పారు కనుక ఈ అంశాన్ని వదిలేయాలని, ఆమెను పదవి నుంచి తొలగించబోమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అయితే 30% ఓట్లు మాత్రమే సాధించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తన వ్యాఖ్యలతో మిగతా 70% ప్రజలను ఆమె అవమానించారని, అందువల్ల ఆమెను తొలగించడమే న్యాయమని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. దీంతో పార్లమెంటులో ఈ ప్రతిష్టంభన తొలగేలా కనిపించడం లేదు. -
బీజేపీ ఎంపీపై హత్యాయత్నం
యూపీలో పాతకక్షలతో దాడి ఫతేపూర్ (యూపీ): ఇటీవల లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతిపై నలుగురు వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆదివారం పోలీసులు తెలిపారు. అయితే ఆమె సురక్షితంగా బయటపడ్డారని వారు చెప్పారు. ఆమె ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా దుండగులు ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసు సూపరింటెండెంట్ వినోద్ కుమార్ సింగ్ తెలిపారు. పాతకక్షలతోనే ఈ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. భానూ పటేల్ అనే వ్యక్తి, ముగ్గురు అనుచరులతో కలిసి తనపై కాల్పులు జరిపినట్టు ఎంపీ జ్యోతి తమకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్పీ వివరించారు. ఈ సంఘటనకు సంబంధించి పటేల్‌ను అరెస్టు చేయగా, అతని ముగ్గురు అనుచరులు పరారీలో ఉన్నారు. కాగా, ఎంపీ జ్యోతి మద్దతుదారులకు వ్యతిరేకంగా భానూ పటేల్ ఫిర్యాదు చేశాడని ఎస్పీ తెలిపారు. ఎంపీ మద్దతుదారులు తనపై కూడా కాల్పులు జరిపినట్టు భానూ అందులో పేర్కొన్నాడు. రెండు కేసులపైనా దర్యాప్తు చేస్తామని ఎస్పీ చెప్పారు. ఈ సంఘటనలో ఎంపీ గన్‌మాన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి.