
సాక్షి, ఖైరతాబాద్ : ముదిరాజ్‌ల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని మంత్రి ఈటల పేర్కొన్నారు. మనకెందుకులే అనుకునే స్థాయి నుంచి ఏ అవకాశాన్నీ వదులుకోకూడదనే స్థాయికి ముదిరాజ్‌లు ఎదిగా రన్నారు. ముదిరాజ్‌ల అభ్యున్నతికి కృషి చేసిన కోర్వి కృష్ణస్వామి 126వ జయంతి సందర్భంగా శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిర్వహిం చారు. ఈ సభకు హాజరైన మంత్రి ఈటల మాట్లాడుతూ.. ఉద్యమ బాధ్యతలు నిర్వహిస్తూనే ముదిరాజ్‌ల కోసం కృషి చేశానని తెలిపారు. జాతి సమస్యలు పరిష్కరించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని కలవగా.. ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ముదిరాజ్‌ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ‘నాకు పాలిచ్చి పెంచిన తల్లి ముదిరాజ్. వారికి అన్ని వేళలా అండగా ఉంటాను’అని ఆయన హామీ ఇచ్చారన్నారు. అన్నట్లుగానే ముదిరాజ్‌ల అభ్యు న్నతి కోసం చేప పిల్లల పంపిణీ, భవనాల ఏర్పాట్లు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ఈటల ఉద్యమ నేతగా, సీఎం కేసీఆర్‌కు కుడిభుజంగా ఎదిగారన్నారు. రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, ఎంపీ బండప్రకాశ్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో పర్యటించి ముదిరాజ్‌ల అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు.