కులవృత్తుల ప్రతినిధులను సన్మానిస్తున్న మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ తదితరులు
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమ వారం రవీంద్రభారతిలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులవృత్తుల డీఎన్‌ఏ ఒక్కటేనని పేర్కొన్నారు.
గత పాలకులు కులవృత్తులను విస్మరించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కుల సంఘాలు ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవడానికి స్థలంతో పాటు రూ.5 కోట్ల నిధులను కేటాయించినట్లు శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. మత్స్యకారుల చేపల పెంపకం కోసం రూ.185 కోట్ల నిధులను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం పలు రంగాల్లో రాణిస్తున్న ముదిరాజ్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాజేందర్, యువజన విభాగం అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జగన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment