హైదరాబాద్: ముదిరాజ్‌ల ఆత్మగౌరవం దెబ్బతీసేవిధంగా సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ముదిరాజ్‌ల ఆత్మగౌరవసభలో ఈటల మాట్లాడుతూ జనాభానిష్పత్తి ప్రకారం ముదిరాజ్ లు 11 శాతం ఉన్నారని, పదకొండుమందికి ఎమ్మె ల్యేలుగా అవకాశం దక్కాలని, ఇరవై ఏళ్ల నుంచి ఇద్దరు లేక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు.
తెలంగాణలో బీసీలు 52 శాతం ఉంటే... 9 మంత్రి పదవులు రావాలని, కానీ మూడు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఒకశాతం జనాభా లేని జాతి నుంచి సీఎంతో పాటు నలుగురుæ మంత్రులు ఉన్నారన్నా రు. మేము ఈ రాష్ట్రానికి ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం ఇస్తున్నామని, కానీ మీరు చేపపిల్లల పేరిట రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని, చేపపిల్లలు కాదు నేరుగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో బీసీలు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.
ముదిరాజ్‌ల ఆత్మగౌరవ సభను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని, మీటింగ్‌కు వెళితే ప్రభుత్వ పథకాలు రావని బెదిరించారని ఈటల ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అన్నింటిని ఎదుర్కొని ఆత్మగౌరవసభకు భారీగా తరలివచ్చారన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితం అందరికీ తెలుసని తాను ప్రజల మనిషినని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా, గుండాలు చంపుతామని బెదిరించినా వెనక్కి తగ్గలేదని, రాష్ట్రంలో అన్ని కులాల సమస్యలపై గొంతెత్తి పోరాడానని గుర్తు చేశారు.
ముదిరాజ్‌లను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని తాను ఎమ్మెల్యే అయిన మొదటిరోజు నుంచే కొట్లాడుతున్నానని, వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 జడ్చర్ల సభలో ముదిరాజ్‌లను బీసీడి నుంచి బీసీ ఏలోకి మారుస్తా అని చెప్పారని, అదే సభలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ప్రకటించారన్నారు. అయితే బీసీ ఏ రిజర్వేషన్ ఒక్క సంవత్సరం మాత్రమే అమలైందని, మైనారిటీ వారు ఏడుగురు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, సుప్రీంకోర్టుకు వెళ్లి వారు గెలిచారని, మనకు ఎవరు లేక పట్టించుకోవడం లేదని చెప్పారు.
మేం వేరే రాష్ట్రం నుంచి వచ్చామా : నీలం మధు
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ఏ పార్టీ అయినా మా ముదిరాజ్‌లను గుండెల్లో పెట్టుకొని ఎవరు ఎన్ని సీట్లు కేటాయిస్తారో, వారితోనే పొత్తు పెట్టుకొని వారితోనే ఉంటామని ముది రాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలంమధు చెప్పారు. ఆరోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడామో.. అదే ఆత్మగౌరవం ముదిరాజ్ జాతికి దక్కేలా పోరాడతామన్నా రు. బీసీల్లో 60 లక్షల మంది ఉన్న ముదిరా జ్‌లకు రాజకీయ గుర్తింపు లేదా..?మేము వేరే రాష్ట్రం నుంచి వచ్చామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
ముదిరాజ్‌లందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ సభతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దద్దరిల్లింది. ఈటల రాజేందర్ ప్రసంగిస్తుండగా సభకు హాజరైన పలువురు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట శంకర్, పులుమేడ రాజు, చొప్పారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment