సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న జాతీయ ఆహార భద్రతా పథకం నిర్వహణ భారం రాష్ట్ర ప్రభుత్వంపై భారీగానే పడనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం తొలగించిన కార్డులను మినహాయించి, మిగిలిన లబ్ధిదారులకు ఆహార భద్రత పథకాన్ని అమలు చేస్తే ఏటా ఏకంగా రూ.960 కోట్ల మేర భారం పడే అవకాశాలున్నట్లు సర్కారు అంచనా వేస్తోంది. కేంద్ర మార్గదర్శకాల మేరకు 75 శాతం గ్రామీణ, 50 శాతం పట్టణ ప్రాంతాల్లోని బీపీఎల్ కుటుంబాలకు ఆహార భద్రతా పథకాన్ని వర్తింపజేయాల్సి ఉంది.
ఈ లెక్కన ఆహార భద్రత పథకానికి 1.91 కోట్ల మంది అర్హులుగా తేల్చిన కేంద్రం.. అందుకు 13.36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటుందని లెక్కకట్టింది. అదనంగా ఉన్న కుటుంబాలకు అయ్యే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని సూచించింది. తాజా అంచనా మేరకు ఆహార భద్రత పథకం కింద రాష్ట్రంలో సుమారు 2.71 కోట్ల మంది అర్హులుగా ఉంటారని సర్కారు తేల్చింది. కేంద్రం కిందకు వచ్చేవారిని మినహాయిస్తే రాష్ట్రం సుమారు 80 లక్షల మంది భారాన్ని మోయాల్సి వస్తుంది. వీరికి ప్రతినెలా 4 కేజీల బియ్యాన్ని అందించాలంటే బహిరంగ మార్కెట్లో కిలో బియాన్ని రూ.25 వరకు కొని లబ్ధిదారులకు కిలో రూపాయికే అందించాల్సి ఉంటుంది.
ఈ లెక్కన ఒక్కో లభ్ధిదారునిపై రూ.100 చొప్పున మొత్తం 80 వేల మందిపై ఏటా రూ.960 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రంలో ఆహార భద్రత పథకం అమలుకు మొత్తం 18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉండగా, కేంద్రం తన వాటాగా 13 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇస్తుంది. మిగతా 5 లక్షల మెట్రిక్ టన్నుల భారాన్ని రాష్ట్రం మోయాల్సిందే. దీనిపై మరోమారు కేంద్రాన్ని సంప్రదించి పథకం అదనపు భారాన్ని తగ్గించాలని కోరే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఆహార భద్రత భారం రూ.960 కోట్లు!
Published Mon, Sep 1 2014 2:44 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement