లోఓల్టేజీ నివారణకు బిగించిన సింగల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ లైన్ కోసం పోళ్లు బిగిస్తున్న సిబ్బంది
సాక్షి, ఊర్కొండ: గ్రామీణ ప్రాంతాల పేదల ఇళ్లలో వెలుగు నింపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న అన్ని కులాల నిరుపేదలకు రూ.125లకే విద్యుత్ మీటరు కనెక్షన్ ఇస్తున్నారు. రూ.125 కూడా దరఖాస్తు చేసుకునేందుకు అయ్యే ఖర్చు మాత్రమే. ఈ పథకాన్ని మార్చి 31వరకు పొడిగించినట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. లబ్ధిదారులు ఆధార్‌కార్డు జిరాక్స్, రెండు ఫొటోలు, ఫోన్ నంబర్‌తో సంబంధిత విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. విచారణ అనంతరం విద్యుత్ మీటర్‌తో పాటు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. అనంతరం సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు విచారణ జరిపి విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసి సర్వీస్ వైరు, మీటర్, స్విచ్ బోర్డు, ఎల్‌ఈడీ బల్బు, ఎర్తింగ్ తదితర కనెక్షన్లు ఉచితంగా ఇస్తారు.
సింగిల్ ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ల బిగింపు
గ్రామాల్లో విద్యుత్ లో–ఓల్టేజీ లేకుండా ఇప్పటికే కొత్త మీటర్లు ఏర్పాటు చేస్తున్న వీధుల్లో ట్రాన్స్‌కో అధికారులు సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు సమకూరుస్తున్నారు. దీన్‌దయాళ్ పథకం కింద విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు కొన్ని గ్రామాల్లో లో–ఓల్టేజీ సమస్యను అధిగమించేందుకు ఈ ట్రాన్స్‌ఫార్మర్లు ఉపయోగపడనున్నాయి.
ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జీవన్‌జ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది. వారికి ఉచితంగానే కనెక్షన్ ఇచ్చి ప్రతినెలా వారి బిల్లులో రూ.5 అదనంగా వసూలు చేస్తారు. ఇలా రూ.125 అయ్యేవరకు ఉంటుంది. 100 యూనిట్లు వాడుకునేందుకు ప్రభుత్వం వారికి సబ్సిడీ కల్పిస్తుందని, గతంలో విద్యుత్ కనెక్షన్ తీసుకున్న వారు ఎస్సీ, ఎస్టీలు అయితే కుల ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే వారిని 100 యూనిట్ల సబ్సిడీలో చేర్చే అవకాశం ఉంటుంది. ఇతర కులాలకు చెందిన నిరుపేదలకు కూడా రూ.125లకే మీటర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సద్వినియోగం చేసుకోవాలి
కరెంట్ మీటర్ లేని నిరుపేదలంతా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మండలంలో ఇప్పటికే 1000 మీటర్ల దాకా బిగించాం. మీటర్లు బిగించిన చోట లోఓల్టేజీ రాకుండా సింగిల్, త్రీ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం. దాదాపు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిలో వెలుగులు నింపాం. ఇంకా కావాల్సిన వారు దరఖాస్తు చేసుకుంటే తక్షణమే మీటర్లు ఏర్పాటు చేస్తాం.
– రవి, ఏఈ, ఊర్కొండ
Comments
Please login to add a commentAdd a comment