
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ త్వరలో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. అయితే ఇంతలోనే అధిష్టానం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని వివిధ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. వికసిత్ ఢిల్లీ, ఆయుష్మాన్ భారత్ లాంటి కేంద్ర పథకాల అమలుకు, మురుగునీటి పారుదల, నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి అన్ని శాఖలను కోరారు.
ఏదైనా ప్రాజెక్టు లేదా పథకాన్ని మంత్రి మండలికి సమర్పించాలనుకుంటే ముందుగా ఆ శాఖ ముసాయిదా క్యాబినెట్ నోట్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇదేవిధంగా ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఆయుష్మాన్ భారత్ పథకం అమలుపై క్యాబినెట్ నోట్ తయారు చేయాలని ఆరోగ్య శాఖను బీజేపీ అధిష్టానం కోరింది. బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రారంభించే పథకాలు లేదా ప్రాజెక్టుల కోసం క్యాబినెట్ ముసాయిదా నోట్‌లను సిద్ధం చేయాలని బీజేపీ అన్ని విభాగాల అధిపతులను ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, కొత్త ప్రభుత్వానికి అందజేస్తుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
గత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో అమలు చేయని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయడానికి క్యాబినెట్ నోట్ సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖను బీజేపీ కోరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని బీజేపీ అగ్ర నేతలు హామీనిచ్చారు. దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో మురుగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలను ప్రధాన కార్యదర్శి కోరారు.
ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్
Comments
Please login to add a commentAdd a comment