
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: బాధిత కుటుంబాలకు ఆపన్నహస్తం అందించే ‘ఆపద్బంధు’పథకాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు వర్తించే ఈ పథకం గతేడాది నవంబర్ ఒకటో తేదీతో ముగిసింది. అయితే, తాజాగా ఈ పథకాన్ని ఈ ఏడాది నవంబర్ ఒకటి వరకు పొడిగిస్తూ సోమవారం విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. 17 కేటగిరీల కింద ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబీకులు ఈ పథకానికి అర్హులు. ఆపద్బంధు కింద రూ.50 వేల సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అల్లర్లు, శాంతిభద్రతల విఘాతంలో ప్రాణాలొదిలినా, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినా, పడవ ప్రమాదంలో కొట్టుకుపోయినా, వరదలు, తుపాను, ఉప్పెన, నీట మునిగినా, వంతెన/భవనాలు కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయినా.. వారికి ఆపద్బంధు వర్తించనుంది.
అలాగే, అగ్ని ప్రమాదం, విద్యుదాఘాతం, భూ కంపాలు, తీవ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారు కూడా అర్హులే. అత్యాచార వేధింపులకు గురైన ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలను కూడా ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకోనున్నారు. కల్లు గీత కార్మికులకు కూడా ఆపద్బంధు సాయం అందనుంది. అయితే, ఎక్సైజ్ శాఖ ఇన్సూరెన్స్ కవర్ కాకుంటేనే.. దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే, కుక్కకాటు/రెబీస్ బారిన పడి 12 నెలల్లోపు మృతి చెందినవారికీ ఆపద్భందు వర్తించనుంది. పాము కాటు, వన్య మృగాల దాడిలో చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలితే ఈ పథకం కింద ఆర్థిక చేయూత లభించనుంది. వడదెబ్బ, ఇతర ప్రమాదాల్లో మృత్యువాత పడ్డవారికి కూడా ఆపద్బంధు రానుంది.
ఈ తొమ్మిది కేటగిరీలకు వర్తించదు..
ఆత్మహత్యకు పాల్పడినా, మద్యం సేవించి మరణించినా ఆపద్బంధు వర్తించదు. అలాగే, సుఖ వ్యాధులు, మానసిక రోగంతో మరణించినా, చట్టాన్ని ఉల్లంఘిస్తూ చనిపోయినవారు అనర్హులే. యుద్ధం, అణు విస్పోటనం, గర్భవతులు, ప్రసవ సమయంలో చనిపోయినవారి కుటుంబాలకు కూడా ప్రయోజనం లభించదు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సాయుధ బలగాలకు ఈ పథకం వర్తించదు.