bheema scheems
-
అమరావతి పంట బీమాకు దివంగత నేత పేరు
సాక్షి, అమరావతి: అమరావతి పంటల భీమాకు వైఎస్సార్ ఉచిత పంట బీమా పథకంగా పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల కోసం మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలకు గాను పంటల భీమాకు ఆయన పేరు పెడుతున్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... 2019-20 సంవత్సరంలో రబీ సీజన్ 2020 ఖరీఫ్ పంటకు కూడా అమలయ్యేలా ఈ పంట బీమా వర్తించేలా ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. అంతేగాక ఏపీ జనరల్ ఇన్సూరెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా కూడా రాష్ట్రంలో ఉచిత పంట బీమా కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా 27 చోట్ల సమీకృత అక్వా ల్యాబబ్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఆర్ఐడీఎఫ్ నిధులు 12. 47 కోట్ల రూపాయలతో ఈ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. -
రూ.99కే దోమల నుంచి రక్షణ పాలసీ
న్యూఢిల్లీ: దోమల కారణంగా మలేరియా నుంచి డెంగీ వరకు పలు ప్రమాదకరమైన వ్యాధుల ముప్పు పొంచి ఉన్న పరిస్థితుల్లో... దోమల కారణంగా వ్యాపించే ఏడు రకాల వ్యాధులకు ఏడాదికి కేవలం రూ.99కే బీమా పాలసీని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు తీసుకొచ్చింది. ఎయిర్టెల్ పేమెంట్స్ రెమిటెన్స్ కస్టమర్లకే ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది. ఈ పాలసీ కింద డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్, కాలా అజార్, లింఫాటిక్ ఫైలేరియాసిస్, జికా వైరస్‌లకు రక్షణ లభిస్తుంది. -
ఆపద్బంధు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: బాధిత కుటుంబాలకు ఆపన్నహస్తం అందించే ‘ఆపద్బంధు’పథకాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు వర్తించే ఈ పథకం గతేడాది నవంబర్ ఒకటో తేదీతో ముగిసింది. అయితే, తాజాగా ఈ పథకాన్ని ఈ ఏడాది నవంబర్ ఒకటి వరకు పొడిగిస్తూ సోమవారం విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. 17 కేటగిరీల కింద ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబీకులు ఈ పథకానికి అర్హులు. ఆపద్బంధు కింద రూ.50 వేల సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అల్లర్లు, శాంతిభద్రతల విఘాతంలో ప్రాణాలొదిలినా, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినా, పడవ ప్రమాదంలో కొట్టుకుపోయినా, వరదలు, తుపాను, ఉప్పెన, నీట మునిగినా, వంతెన/భవనాలు కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయినా.. వారికి ఆపద్బంధు వర్తించనుంది. అలాగే, అగ్ని ప్రమాదం, విద్యుదాఘాతం, భూ కంపాలు, తీవ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారు కూడా అర్హులే. అత్యాచార వేధింపులకు గురైన ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలను కూడా ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకోనున్నారు. కల్లు గీత కార్మికులకు కూడా ఆపద్బంధు సాయం అందనుంది. అయితే, ఎక్సైజ్ శాఖ ఇన్సూరెన్స్ కవర్ కాకుంటేనే.. దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే, కుక్కకాటు/రెబీస్ బారిన పడి 12 నెలల్లోపు మృతి చెందినవారికీ ఆపద్భందు వర్తించనుంది. పాము కాటు, వన్య మృగాల దాడిలో చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలితే ఈ పథకం కింద ఆర్థిక చేయూత లభించనుంది. వడదెబ్బ, ఇతర ప్రమాదాల్లో మృత్యువాత పడ్డవారికి కూడా ఆపద్బంధు రానుంది. ఈ తొమ్మిది కేటగిరీలకు వర్తించదు.. ఆత్మహత్యకు పాల్పడినా, మద్యం సేవించి మరణించినా ఆపద్బంధు వర్తించదు. అలాగే, సుఖ వ్యాధులు, మానసిక రోగంతో మరణించినా, చట్టాన్ని ఉల్లంఘిస్తూ చనిపోయినవారు అనర్హులే. యుద్ధం, అణు విస్పోటనం, గర్భవతులు, ప్రసవ సమయంలో చనిపోయినవారి కుటుంబాలకు కూడా ప్రయోజనం లభించదు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సాయుధ బలగాలకు ఈ పథకం వర్తించదు. -
మంచిగనే జేసిండ్రు..మస్తుగ జెయ్యాలె!
పాలన మస్తుగుందని కొందరు.. ఇంకొంచెం మెరుగుపడాలని ఇంకొందరు.. ఇప్పటికే చేపట్టిన పథకాలు మేలు చేస్తున్నాయని కొంతమంది.. సరిపోవడం లేదని ఇంకొంత మంది.. అభివృద్ధి ఆగొద్దంటే మళ్లీ టీఆర్ఎస్ సర్కారే రావాలని కొందరు.. కొత్త సర్కారుకు అవకాశం ఇవ్వాలని మరికొందరు.. ఇలా భిన్నాభిప్రాయాలు.. మనసులోని మాటలు.. మనోగతాలు.. ఎన్నికల వేళ ‘సాక్షి’ జనం నాడి పట్టే ప్రయత్నం చేసింది. అందుకు నాగ్‌పూర్ – బెంగళూరు (44వ నంబర్ జాతీయ రహదారి) హైవేను ఎంచుకుంది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ వద్ద ప్రారంభమయ్యే ఈ రోడ్డు సుమారు 570 కిలోమీటర్ల మేర కొనసాగి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ వద్ద ముగుస్తుంది. 6 జిల్లాల మీదుగా సాగే ఈ రహదారి జీవన వైవిధ్యానికి ప్రతీక. అటువంటి రహదారిపై ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జనం మనోగతం ఏమిటి? ఏం ఆలోచిస్తున్నారు? ఏ పార్టీపై ఎవరు ఎటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారు?.. రెండ్రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈ రహదారి వెంబడి ఉన్న పల్లె, పట్నం వాసులను ‘సాక్షి’ పలకరించింది. రహదారి పొడవునా ‘రోడ్డు షో’ నిర్వహించి ఎవరెలా స్పందించారో? ఎవరేమన్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. మొత్తం 15 రూట్లుగా విభజించుకుని ‘సాక్షి’ బృందం ఒక్కో రూట్లో 40–50 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ఒక్కో రూట్లో ఎదురుపడిన వారితో పాటు, రోడ్డు పక్క వ్యాపారాలు చేసుకునే వారిని, రోడ్డు పక్కనున్న గ్రామాల వారిని బృందంలోని సభ్యులు పలకరించారు. ‘ఎన్నికలెలా జరుగుతున్నాయి?, ఏ పార్టీ గెలుస్తుంది?, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?, కేసీఆర్ పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి?, సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించింది. రైతులు, కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, యువత.. తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆ మాదిరి పనిజేయాలె.. టీఆర్ఎస్ సర్కారు పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. గతంలో రాజశేఖర్‌రెడ్డి పేదల కోసం అనేక మంచి పనులు చేసిండు. అప్పటి మాదిరి పనిచేసేటోళ్లే అధికారంలోకి రావాలె. – మణెమ్మ, చిరు వ్యాపారి, తూప్రాన్ ఎవరికో రైతు‘బంధువులు’? రైతుల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై సానుకూలతే వ్యక్తమైంది. అత్యధిక మంది రైతులు రైతుబంధు, బీమా పథకాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాలు అందకపోవడంపై మాత్రం కొందరి మాటల్లో అసంతృప్తి వ్యక్తమైంది. కేసీఆర్‌కు మరో అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం పలువురు రైతుల నుంచి వ్యక్తమైంది. ‘24 గంటల కరెంట్ కంటే రైతుకు ఏం కావాలె? పెట్టుబడి డబ్బులిస్తుండు. ప్రస్తుతం ఆయన పథకాలతో మేమంతా సంతోషంగానే ఉన్నాం’ అని సోన్ ప్రాంతానికి చెందిన రైతు శ్రీనివాస్ చెప్పాడు. రామాయంపేట నుంచి చేగుంటకు పనిపై వెళ్తున్న బాలయ్య అనే రైతును పలకరిస్తే.. ‘కేసీఆర్ ఏం తక్కువ చేయలే.. మళ్లీ ఆయనొస్తారు’ అన్నారు. ముఖ్యంగా రైతుబంధు, బీమా పథకాలతో రైతులకు మేలు జరిగిందని పలువురు రైతులు చెప్పారు. ‘రైతుబంధు ఆలోచన దేశంలో ఎవరికైనా వచ్చిందా? ఇది కేసీఆర్ ఘనతే’ అని మానవపాడుకు చెందిన రైతులు మద్దిలేటి, మోహన్ అన్నారు. అయితే, కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ ప్రభావం కూడా కొన్ని ప్రాంతాల్లో రైతులపై పని చేస్తున్నట్టు కనిపించింది. ‘కేసీఆర్ రుణమాఫీ చేసినా.. బ్యాంకోళ్లు చాలా ఇబ్బందులు పెట్టారు. కాంగ్రెస్ కూడా రూ.2 లక్షల మాఫీ అంటోంది కదా.. చూద్దాం’ అని అన్నారు నేరడిగొండకు చెందిన రైతు జాట్ మున్సింగ్. ‘కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే తెలంగాణ రూపురేఖలే మారిపోతాయి. అందుకైనా కేసీఆర్‌కు ఒక అవకాశం ఇవ్వాలి’ అని మేడ్చల్‌కు చెందిన స్టేషనరీ దుకాణదారు సంజీవరావు అన్నారు. పెబ్బేరు, అలంపూర్ ప్రాంతాల్లో సాగునీటి కరువు తీరిపోయిందనే అభిప్రాయం అక్కడి రైతుల నుంచి వ్యక్తమైంది. పిప్పర్వాడిలో రైతు కుటుంబానికి చెందిన గృహిణి స్వప్న మాత్రం.. ‘కేసీఆర్ మల్ల సీఎం అవుతడు’ అంటూనే, ‘ఎకరానికి రూ.4 వేలు మోతుబరి రైతులకు ఇవ్వడం ఎందుక’ని ప్రశ్నించింది. ‘ఆసరా’నిచ్చేవి అవేనా! టీఆర్ఎస్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై జైనథ్ నుంచి అలంపూర్ వరకు పలువురు సంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి పెద్దసంఖ్యలో వృద్ధులు, వితంతు మహిళలు ‘మళ్లీ కేసీఆర్ రావాలం’టూ అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా చంద్రాయన్‌పల్లికి చెందిన సంకటి గంగాధర్‌ను ఇదే విషయమై ప్రశ్నిస్తే.. ‘పేదల దేవుడు’ అంటూ కృతజ్ఞత వెలిబుచ్చారు. ఇంకా పలుచోట్ల వృద్ధుల నుంచీ అదే స్పందన వ్యక్తమైంది. కాంగ్రెస్ కూడా పెన్షన్ మొత్తాలను పెంచనున్నట్టు చెబుతున్నా.. అత్యధిక మంది ఇప్పుడు సంతృప్తిగానే ఉన్నామని చెప్పడం విశేషం. ‘కేసీఆర్ కొడుకు లెక్క ఆదుకుంటుండు’ అని కానాపూర్ (మహబూబ్‌నగర్ జిల్లా)కు చెందిన రాములుతో సహా పలువురు వృద్ధులు చెప్పారు. ‘కల్యాణలక్ష్మి డబ్బులు రాబట్టె నా బిడ్డ పెళ్లి ఖర్చులకు వెతుకులాట తప్పింది’ అంటూ ఆనందంగా చెప్పింది జడ్చర్ల ఇబ్రహీంపల్లెకు చెందిన జయమ్మ. ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, ప్రభుత్వం మారితే అవన్నీ ఆగిపోతాయని, కాబట్టి టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలనే అభిప్రాయం కూడా పలువురి నుంచి వ్యక్తమైంది. మహారాష్ట్ర సరిహద్దులోని పిప్పర్వాడ టోల్‌ప్లాజా వద్ద హైవే పక్కనే తోపుడుబండి నడుపుకుంటున్న మహేందర్‌ను ఇదే విషయమై పలకరిస్తే.. ‘పనులైతే మంచిగ జరుగుతున్నయ్.. నేనైతే టీఆర్ఎస్సే గెలుస్తదనుకుంటున్న..’ అంటూ కుండబద్దలు కొట్టాడు. ‘డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేకపోయారనే అసంతృప్తి ఉన్నా.. ఇప్పటికీ ప్రజలు కేసీఆర్‌ను నమ్ముతున్నారు’ అని నార్సింగికి చెందిన రవి చెప్పాడు. మళ్లీ ఆయనే రావాలి.. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, కేసీఆర్ పనితీరుపై అడిగిన ప్రతి పది మందిలో ఏడుగురు ‘బాగుంద’నే సమాధానమిచ్చారు. వీరిలో అత్యధిక మంది సంక్షేమ పథకాలు బాగున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘కొత్త ప్రభుత్వం.. పనులన్నీ మధ్యలో ఉన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం మారితే ప్రజలకే నష్టం’ అని కోమట్‌పల్లికి చెందిన రైతు మెట్టు యాదగిరి అభిప్రాయపడ్డాడు. అయితే టీఆర్ఎస్కు గెలుపు అంత సులువు కాదని, తీవ్ర పోటీ ఎదుర్కొంటోందని గజ్వేల్ నియోజకవర్గం ఇస్లాంపురకు చెందిన శ్రీధర్ అనే యువకుడు అన్నాడు. ‘పోటీ తీవ్రంగానే ఉంది. అయితే, కొద్దిపాటి తేడాతో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది’ అని చేగుంట మండలం పోతన్పల్లికి చెందిన డ్రైవర్ దొంతి స్వామి చెప్పాడు. ‘నీళ్లు, పింఛన్లు ఇచ్చారు. కానీ ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇళ్లేవి? మేనిఫెస్టో హామీలను బట్టి చూస్తే కాంగ్రెస్‌కూ చాన్సుంది’ అని రామాయంపేట మండలం అక్కన్నపేటకు చెందిన సాయిబాబా అనే యువకుడు అన్నాడు. అయితే, అత్యధిక మంది టీఆర్ఎస్ – కూటమి పక్షాల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, ఎవరికీ గెలుపు నల్లేరుపై నడక కాదని అన్నారు. ఉద్యోగులు, యువకుల మిశ్రమ స్పందన ‘ఎవరికి ఏం అవసరమో గుర్తించి.. అన్నీ సమకూరుస్తున్నారు. ఇంకెవరొచ్చినా అంతకంటే ఏం చేయగలరు?’ అని మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఉద్యోగి కె.సాయిలు ప్రశ్నించారు. ఓయూ క్యాంపస్‌లో ఉండే మహిద్ అలీది కూడా ఇదే అభిప్రాయం. అయితే, ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యం, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నత్తనడకన నడుస్తుందనే అభిప్రాయం కూడా పలువురు విద్యార్థుల నుంచి వ్యక్తమైంది. ‘లక్ష ఉద్యోగాల హామీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఈ నాలుగున్నరేళ్లలో కనీసం ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయో కూడా చెప్పలేకపోయింది’ అని షాద్‌నగర్‌కు చెందిన నిరుద్యోగి శ్రీకాంత్‌రెడ్డి నిష్టూరమాడితే.. ‘వచ్చే ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నాం’ అని మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ రవి చెప్పాడు. ‘ఉద్యోగాలు భర్తీ చేయని మాట వాస్తవమే. కానీ, కూటమిలో ఎవరు ముఖ్యమంత్రో తెలియదు. వారిలో ఎవరొచ్చినా అథోగతే. కాబట్టి కేసీఆర్ సర్కారు రావాలి. కానీ, ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేయాలి’ అని గద్వాలకు చెందిన కాంట్రాక్టర్ అతిక్ రహమాన్ అభిప్రాయపడ్డారు. వీటి సంగతేమిటి? కొన్ని అంశాలపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎవరెలా స్పందించారంటే... - భూ రికార్డుల ప్రక్షాళనలో పలు తప్పులు దొర్లాయి. వీటిని సరిచేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. - దళితులకు మూడెకరాలు పంపిణీ చేయలేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదు. - ఇంటింటికీ నల్లా పథకం అన్ని ప్రాంతాల్లోనూ అమలు కావడం లేదు. - కేసీఆర్, ప్రభుత్వ పనితీరు బాగున్నా.. స్థానిక ఎమ్మెల్యేల వ్యవహారశైలి బాలేదనే అసంతృప్తి - ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తీరు బాగాలేదు. యువతకు ఉపాధి కల్పన అంతంతే.. ఎవరు గెలుస్తరో.. ప్రభుత్వ పనితీరు బాగుంది. మా నియోజకవర్గంలో పోటీ తీవ్రంగా ఉంది. ఎవరు గెలుస్తరో చెప్పలేం. కేసీఆర్ పథకాలు భేష్. – గంగాధర్, ఉద్యోగి, నార్సింగి తుమ్మిళ్లతో మేలు టీఆర్ఎస్ అభివృద్ధి పథకాలు బాగున్నాయి. తుమ్మిళ్ల లిఫ్టుకు నీరు వదలడం రైతుల అదృష్టం. గతంలో ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ చేసి చూపారు. – రాముడు, నారాయణపురం విద్యుత్ కోతల్లేవ్.. గతంలో విద్యుత్ కోతలుండేవి. ప్రసు ్తతం 24 గంటలు కరెంటు ఇస్తున్నరు. కోతలు లేవు. కొన్ని హామీల అమలులో మాత్రం ప్రభుత్వం విఫలం.. – వెంకటేష్‌గౌడ్, కొత్తూరు సన్నబియ్యం మిన్న విద్యార్థుల కోసం పలు సంక్షేమ పథకాలు తెచ్చారు. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నా.. – వంశీ, నిజామాబాద్ కొన్నింట విఫలం కొన్ని పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైంది. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు భేష్. అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యేల పనితీరు నిరాశే.. – శ్రీధర్, కొడిచర్ల యువతకు నిరాశే.. నాలుగున్నరేళ్లలో యువతకు చేసిందేంటి? ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ పని తీరు బాగా లేదు. ఎన్నికల్లో ప్రత్యామ్నాయం కోసం యువత చూస్తోంది. – జ్యోతి,జక్రాన్‌పల్లి రైతుబంధు భేష్ సీఎం కేసీఆర్ బాగానే పని చేశారు. అందరు ఆయనే రావాలంటున్నరు. ఆసరా పింఛన్లు, రైతు బంధు పథకం బాగున్నయి. – బి.రామకృష్ణ, జల్లాపురం, గద్వాల పింఛన్ మంచిగుంది.. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.వెయ్యి చేసిండు. నాకు ఖర్చులకు నా కొడుకు గుడ డబ్బులిస్తలేడు. అసొంటిది నెలనెలా కేసీఆర్ వెయ్యి రూపాలు పింఛనిస్తుండు. కొడుకు మల్లొస్తే పింఛను పెంచుతడట. కేసీఆర్ మంచోడు. నా కొడుకసొంటోడు. గీ సర్కారు మల్ల రావాలె.. – చంద్ర, వృద్ధురాలు, కుప్టి, ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత పాలన పర్వాలేదు టీఆర్ఎస్ పాలన పర్వాలేదు. ఇతర పార్టీలతో పోల్చితే బాగుంది. గతంలో చేయని పనులను చేపట్టారు. తిరిగి టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి రావాలి. కేసీఆర్ ఉంటేనే అన్ని పథకాలు అమలవుతయి. –షేక్ అస్రాత్, మేడ్చల్, ఉద్యోగి పేదలను పట్టించుకోలేదు పేదల కోసం పని చేసే వారికే ప్రజలు పట్టం కడతారు. పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలులో పక్షపాతం చూపించారు. పేదలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీని ఆదరించాలో ఇంకా నిర్ణయించుకోలేదు. – భారతి, కూరగాయల వ్యాపారి, తూప్రాన్ గిట్టుబాటు ధర కావాలె రైతుబంధు పథకం కింద డబ్బులిచ్చుడు కరెక్ట్ కాదు. పంటకు గిట్టుబాటు ధర ఇయ్యాలె. డబ్బులిస్తే రైతులు సోమరిపోతులవుతరు. పోనీ ఇస్తున్నారనుకున్నా.. కౌలు రైతులకు పైసలిస్తలేరు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు మంచిగనే ఉన్నయని అనిపిస్తోంది. – రామకృష్ణ, మన్నూర్, ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ రిజర్వేషన్లు ఏవి? మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో అమలు చేయలేదు. మాటమీద నిలబడలేదు. ఈ హామీ ఇచ్చే వారినే మైనార్టీలు ఆదరిస్తారు. – ఆయాజ్, హైదరాబాద్, నిరుద్యోగి పేదలు బాగుపడుతరు... టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు చేపట్టిన పథకాలతో ఎంతో మందికి లాభం చేకూరింది. – రమేష్, హోటల్ నిర్వాహకుడు మహబూబ్‌నగర్ ...:: సాక్షి, నెట్వర్క్ -
వాహన బీమా..భవితకు ధీమా
ఖిలా వరంగల్ : ఏదైనా కొత్త వాహనం కొనాలంటే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఇక ముందు మరింత ఆలోచించాల్సిందే.. బీమా విధానంలో వచ్చిన కొత్త నిబంధనలు సామాన్యులకు కొంత భారంగా పరిణమించాయి. ఎందుకంటే ప్రతి ద్విచక్ర వాహానానికి ఐదేళ్లు, ఇతర వాహనాలకు మూడేళ్లు బీమా తప్పనిసరి చేశారు. ఇది వినియోగదారులకు భారమే అయినా.. భవిష్యత్‌లో వాహనదారులకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని వాహన కంపెనీలు చెబుతున్నాయి. వాస్తవంగా కొత్త వాహనం కొనేముందు దాని ఖరీదు ఎంత.? రిజిస్టేషన్, ట్యాక్స్‌లు, బీమా ప్రీమియం ఎంత అని చాలా మంది వందరకాల ఆలోచనలు చేస్తుంటారు. ఏరకంగా ఆయినా వాహనంపైన రూ.100, రూ.500 తగ్గతుందేమోనని ఆశతో అన్ని రకాలుగా పరిశీలిస్తారు. అయితే ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలు సుప్రీం కోర్టు ఆదేశాలతో వాహన కొనుగోలు దారులకు కోలుకోలేని షాక్ ఇస్తూ కొత్త విధివిధానాలను అమల్లోకి తెచ్చాయి. ఒకేసారి బీమా చేయించాల్సిందే.. వాహనదారుల నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టు గత నెల మోటారు యాక్ట్ ప్రకారం 29వ తేదీన ఇన్సూరెన్స్ విధానాల్లో ఆనేక సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జూలై 20న థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్, కాల పరిమితి పెంచుతూ వాదోపవాదాల అనంతరం నిర్ణయం తీసుకుంది. ఈ నూతన విధానం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. నూతన ఇన్సూరెన్స్ అమలు.. వాహన చోదకులకు భారమైనా కూడా వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది. ఇక నుంచి ఎటువంటి ద్విచక్రవాహనం కొన్నా , ఒకేసారి ఐదేళ్ల కాలానికి బీమా సొమ్ము కట్టాల్సిందే. కారు కొనే వారు కూడా మూడేళ్ల కాలానికి ఒకేసారి బీమా సొమ్ము చెల్లించాల్సి ఉంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో బీమా సొమ్ము చెల్లించడం తలకు మించిన భారం అని వినియోగదారులు వాపోతున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల నడ్డీ విరుగుతుందని చెబుతున్నారు. వాహనాల ధర యధాతథం.. ప్రస్తుతం వాహనాల ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. కానీ వాటిని కొనుగోలు చేసే సమయంలో గతంలో అయితే ఒక ఏడాదికి బీమా చేయిస్తే సరిపోయేది. అయితే ప్రస్తుతం ఆలా కుదరదు. ఇంజన్ సామర్థ్యం ఆధారంగా బీమా బాదుడు ఉంటుంది. ద్విచక్ర వాహనంపై రూ.15వేలు, కారుపై అయితే రూ.20వేల వరకు ఆదనంగా భారం పడనుంది. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి.. వాహనచోదకులకు ప్రమాదం జరిగితే వాహనదారుడికి, వాహనానికి, రక్షణ కల్పించడమే థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ ఉద్దేశం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కారు, ద్విచక్రవాహనానికి తప్పని సరి చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వుల జారీ చేసింది. ఈవిధానం సెప్టెంబర్1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. నిర్లక్ష్య వైఖరి కారణంగానే .. వాహనదారుల్లో చాలా మంది ఒక ఏడాది బీమా ప్రీమియం కట్టిన తర్వాత మరో ఏడాది బీమా చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇంకొంత మంది వాహనం కొన్న తర్వాత బీమా చేయించడం మానేశారు. దీంతో రోడ్డు ప్రమాదాల సమయాల్లో బీమా పరిహారం అందకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నష్ట పరిహారం అందజేసేందుకురోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, బండి చోరీకి గురైనప్పుడు నష్టపోయిన వారికి కచ్చితంగా పరిæహారం అందించాలనే ఉద్దేశంతో సుప్రీం కోర్టు బీమా కంపెనీలకు తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అందుకే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఐదేళ్లు, మూడేళ్లు బీమాను తప్పని సరి చేసింది. దీని ద్వారా ప్రతి ఒక్క వాహనదారుడు ఇన్సూరెన్స్ కవరేజ్ పొందే వెసులుబాటు కల్పించింది. ఐదేళ్లకు ఒకేసారి అంటే చాలా కష్టం వాహనం కొనుగోలు చేసే సమయంలో ఐదేళ్లకు బీమా చేయాలంటే చాలా కష్టం. అసలే మధ్య తరగతి కుటుంబాలు.. ఎన్నో అవస్థలు పడి బండి కొంటాం.. ఒక ఏడాది ఇన్సూరెన్స్ అంటే ఏదో కింద మీదా పడి చెల్లిస్తాం. అటువంటిది ఐదేళ్లకు ఒకేసారి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఇబ్బందే. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి తగు నిర్ణయం తీసుకోవాలి. – గాదె స్వరూప్‌రెడ్డి, వాహనదారుడు ఇది చాలా మంచి నిర్ణయం ప్రస్తుతం వాహనాలు కొంటున్న వారు ఒక ఏడాదికే ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. అయితే సుప్రీం కోర్టు ఐదేళ్లు, మూడేళ్లు ఇన్సూరెన్స్ తప్పని సరి చేయడంతో వాహనదారులకు భద్రత ఉంటుంది. ఇది చాలా మంచి నిర్ణయం. ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అవసరం ఉంది . – బొలుగొడ్డు శ్రీనివాస్, వాహనదారుడు -
అంగన్వాడీలకు ధీమా..
అరకొర వేతనంతో అవస్థలు పడుతున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఇదో తీయని కబురు. కేంద్ర ప్రభుత్వ కరుణతో ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే బీమా సౌకర్యం లభించనుంది. వారిపైనే ఆధారపడిన కుటుంబానికి ఇదో ఆసరా కానుంది. జిల్లాలోని 6,458మందికి లబ్ధి చేకూరే ఈ పథకానికి సంబంధించి ఇంకా విధివిధనాలు వెలువడాల్సి ఉంది. రామభద్రపురం(బొబ్బిలి) : సమగ్ర శిశు అభివృద్ధిలో శాఖలో గర్బిణులు, శిశువుల అభివృధ్ధికి పాటు పడుతున్న అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులపై కేంద్ర ప్రభుత్వం కరుణ చూపింది. ఆ కేంద్రాల్లో సేవలందిస్తున్న కార్యకర్తలు, ఆయాలకు కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా వర్తింపజేయనుంది. ఉద్యోగ నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలిపేందుకు ధీమా కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ఉన్నతాధికారుల ద్వారా అంగన్వాడీల సమగ్ర సమాచారం పంపించినట్టు అధికార సమాచారం. జిల్లాలో 6,458 మందికి లబ్ధి.. జిల్లాలోని మైదాన ప్రాంతాల్లోని 12 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా, ఐటీడీఏ పరిధిలో 5 ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 2,987 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 742 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన జీవిత బీమా పథకంతో జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలుగా పనిచేస్తున్న 6,458 మందికి లబ్ధి చేకూరనుంది. వీరంతా గతంలో తక్కువ వేతనాలతో పనిచేశారు. ఇటీవలే ప్రభుత్వం వేతనాలు పెంచడంతో ప్రస్తుతం కార్యకర్తలకు రూ.10,500, ఆయాలకు రూ.6వేల వేత నం అందనుంది. విధుల్లో ప్రాణాలు కోల్పోయినప్పుడు వారి కుటుంబ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పించింది. ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజనా(పీఎంజేబీవై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనా(పీఎంఎస్బీవై)తో పాటు ప్రత్యేకంగా అంగన్వాడీ కార్యకర్తలకోసం బీమా పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పధకాలకు అవసరమయ్యే ప్రీమియంను కేంద్రం, ఎల్ఐసీ సంయుక్తంగా భరించనున్నాయి. 2017 జూన్ 1నాటికి 18–50 ఏళ్ల లోపు ఆయాలు, కార్యకర్తలకు పీఎంజేబీవై కింద రూ.2లక్షల విలువైన జీవిత బీమా, 51–59 ఏళ్ల వారికి పీఎంఎస్బీవై కింద రూ.2 లక్షల ప్రమాద బీమా అందిస్తోంది. 18 నుంచి 49 ఏళ్ల లోపు అంగన్వాడీలకు జీవిత బీమా పరిధిలోకి వస్తున్నారు గాని 50–59 ఏళ్ల లోపు అంగన్వాడీలు జీవితబీమా పరిధిలోకి రాకపోవడంతో వీరికోసం ప్రత్యేకంగా ఈ బీమా అమలు చేస్తోంది. ఈ పధకం కింద రూ.80 వేల జీవిత బీమా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బీమా కల్పించడం హర్షణీయం.. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు బీమా సౌకర్యం కల్పిం చడం హర్షణీయం. ఎప్పటి నుంచో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న మా కుటుం బాలకు ఎలాంటి భరోసా లేదు. రెండు లక్షల బీమాతో ఎంతో ప్రయోజనం చేకూరనుంది. – గేదెల రాధమ్మ, అంగన్వాడీ కార్యకర్త, రామభద్రపురం బీమాతో ఎంతో ప్రయోజనం... కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు అమలు చేస్తున్న బీమా సౌకర్యం ఎంతో ప్రయోజనకరంగా ఉం టుంది. ప్రభుత్వం మరణిం చిన కార్యకర్తల కుటుం బాల కు ఏవిధమైన సౌకర్యాలు కల్పించడం లేదు. కాబట్టి ఈ బీమా వారి కుటుంబానికి ఉపయోగపడుతుంది. – జి.యర్రయ్యమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్, రామభద్రపురం -
రైతు బీమాకు వయసెందుకు అడ్డు?
ఆయన పేరు లక్ష్మయ్య. మేడ్చల్ జిల్లాలోని ఓ గ్రామంలో రైతు. మూడెకరాల భూమి ఆయన పేరున ఉంది. ఇటీవలే ఆయనకు 61 ఏళ్లు నిండాయి. తనకు రైతు బీమా కావాలని వ్యవసాయాధికారుల వద్దకు వెళితే, నిబంధనల ప్రకారం వయసు ఎక్కువ ఉండటంతో అధికారులు కుదరదని చెప్పారు. సూర్యాపేట జిల్లాకు చెందిన వెంకటరెడ్డి వయసు 63 ఏళ్లు. ఆయనకు ఐదెకరాల సాగు భూమి ఉంది. రైతు బీమా తీసుకుందామంటే వయసు మీరిందంటూ అధికారులు చెప్పడంపై ఆయన మండిపడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబీమా పథకంలో వయసు నిబంధనపై రైతులు మండిపడుతున్నారు. ఈ పథకానికి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులే అర్హులన్న నిబంధన వారికి గుదిబండగా మారింది. రాష్ట్రంలో 59 ఏళ్లు నిండిన దాదాపు 11 లక్షల మంది ఈ పథకానికి అనర్హులుగా తేలినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ‘శారీరక శ్రమ చేసే రైతులు ఆరోగ్యంగానే ఉంటారు. 60 ఏళ్ల లోపు వారికి అనారోగ్య సమస్యలు పెద్దగా ఉండవు. ఆ తర్వాతే సమస్యలు మొదలవుతాయి.. మరణాలు సంభవిస్తాయి. కాబట్టి 59 ఏళ్ల వరకున్న వారికే బీమా అన్న నిబంధన ఉండటంతో చాలామంది అవకాశం కోల్పోతున్నారు. రైతు బీమాతో ఇక ఎవరికి లాభం’అని ఓ వ్యవసాయ నిపుణుడు వ్యాఖ్యానించారు. బీమాకు 70 ఏళ్ల వరకు వయసు పరిమితిని ప్రభుత్వం తొలుత పరిశీలించింది. అయితే 59 ఏళ్లకు మించిన వారికి బీమా ప్రీమియం అధికంగా ఉండటంతో సర్కారు వెనక్కు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. రూ. 5 లక్షల పరిహారం ఇటీవల చేపట్టిన భూప్రక్షాళన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులున్నారు. వారిలో ఇప్పటివరకు 48 లక్షల మంది వరకు పెట్టుబడి చెక్కులు తీసుకున్నారు. ఆయా రైతులందరికీ జీవిత బీమా చేర్పించాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తే, ఏదైనా కారణంతో రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఎల్ఐసీ నుంచి రూ.5 లక్షల పరిహారం అందుతుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రైతులందరినీ కలిసే పనిలో వ్యవసాయ శాఖ వర్గాలు నిమగ్నమయ్యాయి. గతనెల రోజులుగా పాలసీలో రైతులను చేర్పించడం, నామినీ పత్రాలు స్వీకరించే కార్యక్రమం జరుగుతోంది. అవగాహన కల్పించడంలో వైఫల్యం.. బీమా గురించి రైతులకు సున్నితంగా వివరించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. బీమా కంపెనీల ప్రతినిధులు బీమా పాలసీలను చాలా సున్నితంగా వివరిస్తారు. అప్పుడు ఎవరూ అంతగా ఫీల్ అవ్వరు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా రైతు బీమా వివరించే సందర్భంలో నేరుగా ‘చచ్చిపోతే డబ్బులొస్తాయి’అనడంతో అక్కడక్కడ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ‘చనిపోతే డబ్బులిస్తారా? అంటే మా కుటుంబ పెద్ద చనిపోవాలని కోరుకుంటున్నారా?’అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో రైతుబీమా కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు వ్యవసాయ ఉన్నతాధికారి ఒకరు హైదరాబాద్ నుంచి వెళ్లారు. అక్కడ ఓ రైతు కుటుంబాన్ని కలిశారు. రైతు బీమాలో చేరాలని కోరారు. ‘గతంలో ఇలాగే జీవిత బీమాలో చేరాక మా కుటుంబంలో ఒకరు చనిపోయారు. కాబట్టి ఇప్పుడు రైతు బీమా తీసుకోలేం’అంటూ ఆ కుటుంబం తిరస్కరించింది. ఇలా దాదాపు 2 లక్షల మంది రైతుల ఈ పాలసీని తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు. బీమా పాలసీలను వివరించే పద్ధతి సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. ప్రభుత్వం వచ్చే నెల 15 నుంచి రైతులకు బీమా పత్రాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. మూడో వంతు వరకు అనర్హులు ఉండటంతో రైతుల్లో వ్యతిరేకత వస్తుందంటున్నారు. కాగా, గ్రామాల్లో కౌలు రైతులు, ఇతర భూమి లేని వారికి కూడా బీమా కల్పించే అంశాన్ని పరిశీలించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ నివేదిక సమర్పించింది. -
బడుగు జీవుల బతులకు భరోసా ఏదీ..?
చందుర్తి : తక్కువ ప్రీమియంతో పేద, మధ్య తరగతి మహిళల బతులకు భరోసా కల్పించే జనశ్రీ, ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాలు రెండేళ్లుగా రెన్యూవల్‌కు నోచడంలేదు. మహిళల బంగారు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం చేపట్టిన ఈ పాలసీలపై పాలకులకు పట్టింపులేకుండాపోయింది. 18 గ్రామాలు.. 788 మహిళా సంఘాలు మండలంలోని 18 గ్రామాల్లో 788 మహిళా సంఘాలు పనిచేస్తున్నాయి. ఇందులో 9,562 మంది సభ్యులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆమ్ ఆద్మీ బీమా యోజనలో 1,379 మంది, జనశ్రీ బీమా(ఎస్సీ, ఎస్టీ)లో 967 మంది, సాధారణ పథకంలో 1600మంది పాలసీదారులుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అభయహస్తంలో 5,029 మంది ఉన్నారు. పాలసీ విధానాలపై నేటికీ స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఐకేపీలో గందరగోళం నెలకొంది. ఫలితంగా రెండేళ్లుగా రెన్యూవల్‌కు నోచడంలేదు. ఇవీ ప్రయోజనాలు – జనశ్రీబీమా కోసం మహిళా సంఘంలోని సభ్యురాలు ఏడాదికి రూ.165 చెల్లించాలి – సభ్యురాలితోపాటు ఆమెభర్తకు బీమా వర్తిస్తుంది – సభ్యురాలు సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.70వేలు చెల్లిసారు. – ఆమ్ ఆద్మీ బీమా కోసం సభ్యురాలు రూ.15 చెలిస్తే సరిపోతుంది – అయితే, సభ్యురాలు సర్వీసు చార్జీగా రూ.15 చెల్లిస్తే మహిళా సమాఖ్య ద్వారా రూ.360 ప్రీమియంగా ప్రభుత్వం చెల్లిస్తుంది. – సభ్యురాలితోపాటు ఆమె భర్తకు బీమా వర్తిస్తుంది – సభ్యురాలు సహజ మరణానికి రూ.30వేలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.70వేలు అందుతాయి. అభయహస్తానికీ గ్రహణం.. స్వశక్తి సంఘాల్లోని 5,029మంది సభ్యులు అభయహస్తంలో సభ్యులుగా చేరారు. వీరిలో 249మందికి పింఛన్ అందుతోంది. రెన్యూవల్ కాకపోవడంతో తొమ్మిది నెలలుగా పింఛన్ అందడంలేదు. అంతే కాకుండా మిగితా 4,780మంది సభ్యులకు ఏటా రూ.365 ప్రీమియాన్ని సభ్యులే చెల్లిస్తున్నారు. అధికారులు సమాధానమిస్తలేరు – వజ్రవ్వ, మండల సమాఖ్య అధ్యక్షురాలు బీమా పాలసీలను ఎందుకు రెన్యూవల్ చేయడం లేదని అధికారులను అడిగితే సమాధానమే చెప్పడం లేదు. అనుకోకుండా మా కుటుంబాలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తరు. పాలసీ రెన్యూవల్ చేయకపోవడంతో మండల సమాఖ్య సభ్యులు డబ్బులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఆదేశాల కోసం నిరీక్షణ – రజిత, ఏపీఎం, ఐకేపీ జనశ్రీ, ఆమ్ ఆద్మీ యోజన పథకాల రెవన్యూవల్ను రెండేళ్లుగా నిలిపివేశాం. అభయహస్తం పింఛన్ తొమ్మిది నెలలుగా విడుదల కావడంలేదు. బీమా పాలసీల పునరుద్ధరణపై ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. బీమా పథకాల పునరుద్ధరణపై త్వరలోనే సానుకూల ఆదేశాలు వస్తాయని ఆశిస్తున్నాం.