పాలన మస్తుగుందని కొందరు.. ఇంకొంచెం మెరుగుపడాలని ఇంకొందరు.. ఇప్పటికే చేపట్టిన పథకాలు మేలు చేస్తున్నాయని కొంతమంది.. సరిపోవడం లేదని ఇంకొంత మంది.. అభివృద్ధి ఆగొద్దంటే మళ్లీ టీఆర్‌ఎస్ సర్కారే రావాలని కొందరు.. కొత్త సర్కారుకు అవకాశం ఇవ్వాలని మరికొందరు.. ఇలా భిన్నాభిప్రాయాలు.. మనసులోని మాటలు.. మనోగతాలు.. ఎన్నికల వేళ ‘సాక్షి’ జనం నాడి పట్టే ప్రయత్నం చేసింది. అందుకు నాగ్‌పూర్ – బెంగళూరు (44వ నంబర్ జాతీయ రహదారి) హైవేను ఎంచుకుంది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ వద్ద ప్రారంభమయ్యే ఈ రోడ్డు సుమారు 570 కిలోమీటర్ల మేర కొనసాగి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ వద్ద ముగుస్తుంది. 6 జిల్లాల మీదుగా సాగే ఈ రహదారి జీవన వైవిధ్యానికి ప్రతీక. అటువంటి రహదారిపై ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జనం మనోగతం ఏమిటి? ఏం ఆలోచిస్తున్నారు? ఏ పార్టీపై ఎవరు ఎటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారు?.. రెండ్రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈ రహదారి వెంబడి ఉన్న పల్లె, పట్నం వాసులను ‘సాక్షి’ పలకరించింది. రహదారి పొడవునా ‘రోడ్డు షో’ నిర్వహించి ఎవరెలా స్పందించారో? ఎవరేమన్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
మొత్తం 15 రూట్లుగా విభజించుకుని ‘సాక్షి’ బృందం ఒక్కో రూట్లో 40–50 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ఒక్కో రూట్లో ఎదురుపడిన వారితో పాటు, రోడ్డు పక్క వ్యాపారాలు చేసుకునే వారిని, రోడ్డు పక్కనున్న గ్రామాల వారిని బృందంలోని సభ్యులు పలకరించారు. ‘ఎన్నికలెలా జరుగుతున్నాయి?, ఏ పార్టీ గెలుస్తుంది?, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?, కేసీఆర్ పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి?, సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించింది. రైతులు, కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, యువత.. తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.
ఆ మాదిరి పనిజేయాలె..
టీఆర్‌ఎస్ సర్కారు పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తానని ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. గతంలో రాజశేఖర్‌రెడ్డి పేదల కోసం అనేక మంచి పనులు చేసిండు. అప్పటి మాదిరి పనిచేసేటోళ్లే అధికారంలోకి రావాలె.
– మణెమ్మ, చిరు వ్యాపారి, తూప్రాన్
ఎవరికో రైతు‘బంధువులు’?
రైతుల నుంచి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సానుకూలతే వ్యక్తమైంది. అత్యధిక మంది రైతులు రైతుబంధు, బీమా పథకాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాలు అందకపోవడంపై మాత్రం కొందరి మాటల్లో అసంతృప్తి వ్యక్తమైంది. కేసీఆర్‌కు మరో అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం పలువురు రైతుల నుంచి వ్యక్తమైంది. ‘24 గంటల కరెంట్ కంటే రైతుకు ఏం కావాలె? పెట్టుబడి డబ్బులిస్తుండు. ప్రస్తుతం ఆయన పథకాలతో మేమంతా సంతోషంగానే ఉన్నాం’ అని సోన్ ప్రాంతానికి చెందిన రైతు శ్రీనివాస్ చెప్పాడు. రామాయంపేట నుంచి చేగుంటకు పనిపై వెళ్తున్న బాలయ్య అనే రైతును పలకరిస్తే.. ‘కేసీఆర్ ఏం తక్కువ చేయలే.. మళ్లీ ఆయనొస్తారు’ అన్నారు. ముఖ్యంగా రైతుబంధు, బీమా పథకాలతో రైతులకు మేలు జరిగిందని పలువురు రైతులు చెప్పారు. ‘రైతుబంధు ఆలోచన దేశంలో ఎవరికైనా వచ్చిందా? ఇది కేసీఆర్ ఘనతే’ అని మానవపాడుకు చెందిన రైతులు మద్దిలేటి, మోహన్ అన్నారు. అయితే, కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ ప్రభావం కూడా కొన్ని ప్రాంతాల్లో రైతులపై పని చేస్తున్నట్టు కనిపించింది. ‘కేసీఆర్ రుణమాఫీ చేసినా.. బ్యాంకోళ్లు చాలా ఇబ్బందులు పెట్టారు. కాంగ్రెస్ కూడా రూ.2 లక్షల మాఫీ అంటోంది కదా.. చూద్దాం’ అని అన్నారు నేరడిగొండకు చెందిన రైతు జాట్ మున్‌సింగ్. ‘కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే తెలంగాణ రూపురేఖలే మారిపోతాయి. అందుకైనా కేసీఆర్‌కు ఒక అవకాశం ఇవ్వాలి’ అని మేడ్చల్‌కు చెందిన స్టేషనరీ దుకాణదారు సంజీవరావు అన్నారు. పెబ్బేరు, అలంపూర్ ప్రాంతాల్లో సాగునీటి కరువు తీరిపోయిందనే అభిప్రాయం అక్కడి రైతుల నుంచి వ్యక్తమైంది. పిప్పర్‌వాడిలో రైతు కుటుంబానికి చెందిన గృహిణి స్వప్న మాత్రం.. ‘కేసీఆర్ మల్ల సీఎం అవుతడు’ అంటూనే, ‘ఎకరానికి రూ.4 వేలు మోతుబరి రైతులకు ఇవ్వడం ఎందుక’ని ప్రశ్నించింది.
‘ఆసరా’నిచ్చేవి అవేనా!
టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై జైనథ్ నుంచి అలంపూర్ వరకు పలువురు సంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి పెద్దసంఖ్యలో వృద్ధులు, వితంతు మహిళలు ‘మళ్లీ కేసీఆర్ రావాలం’టూ అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా చంద్రాయన్‌పల్లికి చెందిన సంకటి గంగాధర్‌ను ఇదే విషయమై ప్రశ్నిస్తే.. ‘పేదల దేవుడు’ అంటూ కృతజ్ఞత వెలిబుచ్చారు. ఇంకా పలుచోట్ల వృద్ధుల నుంచీ అదే స్పందన వ్యక్తమైంది. కాంగ్రెస్ కూడా పెన్షన్ మొత్తాలను పెంచనున్నట్టు చెబుతున్నా.. అత్యధిక మంది ఇప్పుడు సంతృప్తిగానే ఉన్నామని చెప్పడం విశేషం. ‘కేసీఆర్ కొడుకు లెక్క ఆదుకుంటుండు’ అని కానాపూర్ (మహబూబ్‌నగర్ జిల్లా)కు చెందిన రాములుతో సహా పలువురు వృద్ధులు చెప్పారు. ‘కల్యాణలక్ష్మి డబ్బులు రాబట్టె నా బిడ్డ పెళ్లి ఖర్చులకు వెతుకులాట తప్పింది’ అంటూ ఆనందంగా చెప్పింది జడ్చర్ల ఇబ్రహీంపల్లెకు చెందిన జయమ్మ. ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, ప్రభుత్వం మారితే అవన్నీ ఆగిపోతాయని, కాబట్టి టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలనే అభిప్రాయం కూడా పలువురి నుంచి వ్యక్తమైంది. మహారాష్ట్ర సరిహద్దులోని పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద హైవే పక్కనే తోపుడుబండి నడుపుకుంటున్న మహేందర్‌ను ఇదే విషయమై పలకరిస్తే.. ‘పనులైతే మంచిగ జరుగుతున్నయ్.. నేనైతే టీఆర్‌ఎస్సే గెలుస్తదనుకుంటున్న..’ అంటూ కుండబద్దలు కొట్టాడు. ‘డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేకపోయారనే అసంతృప్తి ఉన్నా.. ఇప్పటికీ ప్రజలు కేసీఆర్‌ను నమ్ముతున్నారు’ అని నార్సింగికి చెందిన రవి చెప్పాడు.
మళ్లీ ఆయనే రావాలి..
టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరు, కేసీఆర్ పనితీరుపై అడిగిన ప్రతి పది మందిలో ఏడుగురు ‘బాగుంద’నే సమాధానమిచ్చారు. వీరిలో అత్యధిక మంది సంక్షేమ పథకాలు బాగున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘కొత్త ప్రభుత్వం.. పనులన్నీ మధ్యలో ఉన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం మారితే ప్రజలకే నష్టం’ అని కోమట్‌పల్లికి చెందిన రైతు మెట్టు యాదగిరి అభిప్రాయపడ్డాడు. అయితే టీఆర్‌ఎస్‌కు గెలుపు అంత సులువు కాదని, తీవ్ర పోటీ ఎదుర్కొంటోందని గజ్వేల్ నియోజకవర్గం ఇస్లాంపురకు చెందిన శ్రీధర్ అనే యువకుడు అన్నాడు. ‘పోటీ తీవ్రంగానే ఉంది. అయితే, కొద్దిపాటి తేడాతో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుంది’ అని చేగుంట మండలం పోతన్‌పల్లికి చెందిన డ్రైవర్ దొంతి స్వామి చెప్పాడు. ‘నీళ్లు, పింఛన్లు ఇచ్చారు. కానీ ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇళ్లేవి? మేనిఫెస్టో హామీలను బట్టి చూస్తే కాంగ్రెస్‌కూ చాన్సుంది’ అని రామాయంపేట మండలం అక్కన్నపేటకు చెందిన సాయిబాబా అనే యువకుడు అన్నాడు. అయితే, అత్యధిక మంది టీఆర్‌ఎస్ – కూటమి పక్షాల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, ఎవరికీ గెలుపు నల్లేరుపై నడక కాదని అన్నారు.
ఉద్యోగులు, యువకుల మిశ్రమ స్పందన
‘ఎవరికి ఏం అవసరమో గుర్తించి.. అన్నీ సమకూరుస్తున్నారు. ఇంకెవరొచ్చినా అంతకంటే ఏం చేయగలరు?’ అని మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఉద్యోగి కె.సాయిలు ప్రశ్నించారు. ఓయూ క్యాంపస్‌లో ఉండే మహిద్ అలీది కూడా ఇదే అభిప్రాయం. అయితే, ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యం, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నత్తనడకన నడుస్తుందనే అభిప్రాయం కూడా పలువురు విద్యార్థుల నుంచి వ్యక్తమైంది. ‘లక్ష ఉద్యోగాల హామీతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. ఈ నాలుగున్నరేళ్లలో కనీసం ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయో కూడా చెప్పలేకపోయింది’ అని షాద్‌నగర్‌కు చెందిన నిరుద్యోగి శ్రీకాంత్‌రెడ్డి నిష్టూరమాడితే.. ‘వచ్చే ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నాం’ అని మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ రవి చెప్పాడు. ‘ఉద్యోగాలు భర్తీ చేయని మాట వాస్తవమే. కానీ, కూటమిలో ఎవరు ముఖ్యమంత్రో తెలియదు. వారిలో ఎవరొచ్చినా అథోగతే. కాబట్టి కేసీఆర్ సర్కారు రావాలి. కానీ, ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేయాలి’ అని గద్వాలకు చెందిన కాంట్రాక్టర్ అతిక్ రహమాన్ అభిప్రాయపడ్డారు.
వీటి సంగతేమిటి?
కొన్ని అంశాలపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎవరెలా స్పందించారంటే...
- భూ రికార్డుల ప్రక్షాళనలో పలు తప్పులు దొర్లాయి. వీటిని సరిచేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు.
- దళితులకు మూడెకరాలు పంపిణీ చేయలేదు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించలేదు.
- ఇంటింటికీ నల్లా పథకం అన్ని ప్రాంతాల్లోనూ అమలు కావడం లేదు.
- కేసీఆర్, ప్రభుత్వ పనితీరు బాగున్నా.. స్థానిక ఎమ్మెల్యేల వ్యవహారశైలి బాలేదనే అసంతృప్తి
- ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తీరు బాగాలేదు. యువతకు ఉపాధి కల్పన అంతంతే..
ఎవరు గెలుస్తరో..
ప్రభుత్వ పనితీరు బాగుంది. మా నియోజకవర్గంలో పోటీ తీవ్రంగా ఉంది. ఎవరు గెలుస్తరో చెప్పలేం. కేసీఆర్ పథకాలు భేష్.
– గంగాధర్, ఉద్యోగి, నార్సింగి
తుమ్మిళ్లతో మేలు
టీఆర్‌ఎస్ అభివృద్ధి పథకాలు బాగున్నాయి. తుమ్మిళ్ల లిఫ్టుకు నీరు వదలడం రైతుల అదృష్టం. గతంలో ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ చేసి చూపారు.
– రాముడు, నారాయణపురం
విద్యుత్ కోతల్లేవ్..
గతంలో విద్యుత్ కోతలుండేవి. ప్రసు ్తతం 24 గంటలు కరెంటు ఇస్తున్నరు. కోతలు లేవు. కొన్ని హామీల అమలులో మాత్రం ప్రభుత్వం విఫలం..
– వెంకటేష్‌గౌడ్, కొత్తూరు
సన్నబియ్యం మిన్న
విద్యార్థుల కోసం పలు సంక్షేమ పథకాలు తెచ్చారు. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని
కోరుకుంటున్నా..
– వంశీ, నిజామాబాద్
కొన్నింట విఫలం
కొన్ని పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైంది. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు భేష్. అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యేల పనితీరు నిరాశే..
– శ్రీధర్, కొడిచర్ల
యువతకు నిరాశే..
నాలుగున్నరేళ్లలో యువతకు చేసిందేంటి? ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ పని తీరు బాగా లేదు. ఎన్నికల్లో ప్రత్యామ్నాయం కోసం యువత చూస్తోంది.
– జ్యోతి,జక్రాన్‌పల్లి
రైతుబంధు భేష్
సీఎం కేసీఆర్ బాగానే పని చేశారు. అందరు ఆయనే రావాలంటున్నరు. ఆసరా పింఛన్లు, రైతు బంధు పథకం బాగున్నయి.
– బి.రామకృష్ణ, జల్లాపురం, గద్వాల
పింఛన్ మంచిగుంది..
రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.వెయ్యి చేసిండు. నాకు ఖర్చులకు నా కొడుకు గుడ డబ్బులిస్తలేడు. అసొంటిది నెలనెలా కేసీఆర్ వెయ్యి రూపాలు పింఛనిస్తుండు. కొడుకు మల్లొస్తే పింఛను పెంచుతడట. కేసీఆర్ మంచోడు. నా కొడుకసొంటోడు. గీ సర్కారు మల్ల రావాలె..
– చంద్ర, వృద్ధురాలు, కుప్టి, ఆదిలాబాద్ జిల్లా
ప్రస్తుత పాలన పర్వాలేదు
టీఆర్‌ఎస్ పాలన పర్వాలేదు. ఇతర పార్టీలతో పోల్చితే బాగుంది. గతంలో చేయని పనులను చేపట్టారు. తిరిగి టీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలోకి రావాలి. కేసీఆర్ ఉంటేనే అన్ని పథకాలు అమలవుతయి.
–షేక్ అస్రాత్, మేడ్చల్, ఉద్యోగి
పేదలను పట్టించుకోలేదు
పేదల కోసం పని చేసే వారికే ప్రజలు పట్టం కడతారు. పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలులో పక్షపాతం చూపించారు. పేదలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీని ఆదరించాలో ఇంకా నిర్ణయించుకోలేదు.
– భారతి, కూరగాయల వ్యాపారి, తూప్రాన్
గిట్టుబాటు ధర కావాలె
రైతుబంధు పథకం కింద డబ్బులిచ్చుడు కరెక్ట్ కాదు. పంటకు గిట్టుబాటు ధర ఇయ్యాలె. డబ్బులిస్తే రైతులు సోమరిపోతులవుతరు. పోనీ ఇస్తున్నారనుకున్నా.. కౌలు రైతులకు పైసలిస్తలేరు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు మంచిగనే ఉన్నయని అనిపిస్తోంది.
– రామకృష్ణ, మన్నూర్, ఆదిలాబాద్ జిల్లా
మైనార్టీ రిజర్వేషన్లు ఏవి?
మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో అమలు చేయలేదు. మాటమీద నిలబడలేదు. ఈ హామీ ఇచ్చే వారినే మైనార్టీలు ఆదరిస్తారు.
– ఆయాజ్, హైదరాబాద్, నిరుద్యోగి
పేదలు బాగుపడుతరు...
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు చేపట్టిన పథకాలతో ఎంతో మందికి లాభం చేకూరింది.
– రమేష్, హోటల్ నిర్వాహకుడు మహబూబ్‌నగర్
...:: సాక్షి, నెట్‌వర్క్
Comments
Please login to add a commentAdd a comment