బడుగు జీవుల బతులకు భరోసా ఏదీ..?
చందుర్తి : తక్కువ ప్రీమియంతో పేద, మధ్య తరగతి మహిళల బతులకు భరోసా కల్పించే జనశ్రీ, ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాలు రెండేళ్లుగా రెన్యూవల్‌కు నోచడంలేదు. మహిళల బంగారు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం చేపట్టిన ఈ పాలసీలపై పాలకులకు పట్టింపులేకుండాపోయింది.
18 గ్రామాలు.. 788 మహిళా సంఘాలు
మండలంలోని 18 గ్రామాల్లో 788 మహిళా సంఘాలు పనిచేస్తున్నాయి. ఇందులో 9,562 మంది సభ్యులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆమ్ ఆద్మీ బీమా యోజనలో 1,379 మంది, జనశ్రీ బీమా(ఎస్సీ, ఎస్టీ)లో 967 మంది, సాధారణ పథకంలో 1600మంది పాలసీదారులుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అభయహస్తంలో 5,029 మంది ఉన్నారు. పాలసీ విధానాలపై నేటికీ స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఐకేపీలో గందరగోళం నెలకొంది. ఫలితంగా రెండేళ్లుగా రెన్యూవల్‌కు నోచడంలేదు.
ఇవీ ప్రయోజనాలు
-
– జనశ్రీబీమా కోసం మహిళా సంఘంలోని సభ్యురాలు ఏడాదికి రూ.165 చెల్లించాలి
-
– సభ్యురాలితోపాటు ఆమెభర్తకు బీమా వర్తిస్తుంది
-
– సభ్యురాలు సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.70వేలు చెల్లిసారు.
-
– ఆమ్ ఆద్మీ బీమా కోసం సభ్యురాలు రూ.15 చెలిస్తే సరిపోతుంది
-
– అయితే, సభ్యురాలు సర్వీసు చార్జీగా రూ.15 చెల్లిస్తే మహిళా సమాఖ్య ద్వారా రూ.360 ప్రీమియంగా ప్రభుత్వం చెల్లిస్తుంది.
-
– సభ్యురాలితోపాటు ఆమె భర్తకు బీమా వర్తిస్తుంది
-
– సభ్యురాలు సహజ మరణానికి రూ.30వేలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.70వేలు అందుతాయి.
అభయహస్తానికీ గ్రహణం..
స్వశక్తి సంఘాల్లోని 5,029మంది సభ్యులు అభయహస్తంలో సభ్యులుగా చేరారు. వీరిలో 249మందికి పింఛన్ అందుతోంది. రెన్యూవల్ కాకపోవడంతో తొమ్మిది నెలలుగా పింఛన్ అందడంలేదు. అంతే కాకుండా మిగితా 4,780మంది సభ్యులకు ఏటా రూ.365 ప్రీమియాన్ని సభ్యులే చెల్లిస్తున్నారు.
అధికారులు సమాధానమిస్తలేరు – వజ్రవ్వ, మండల సమాఖ్య అధ్యక్షురాలు
బీమా పాలసీలను ఎందుకు రెన్యూవల్ చేయడం లేదని అధికారులను అడిగితే సమాధానమే చెప్పడం లేదు. అనుకోకుండా మా కుటుంబాలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తరు. పాలసీ రెన్యూవల్ చేయకపోవడంతో మండల సమాఖ్య సభ్యులు డబ్బులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి.
ఆదేశాల కోసం నిరీక్షణ – రజిత, ఏపీఎం, ఐకేపీ
జనశ్రీ, ఆమ్ ఆద్మీ యోజన పథకాల రెవన్యూవల్‌ను రెండేళ్లుగా నిలిపివేశాం. అభయహస్తం పింఛన్ తొమ్మిది నెలలుగా విడుదల కావడంలేదు. బీమా పాలసీల పునరుద్ధరణపై ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. బీమా పథకాల పునరుద్ధరణపై త్వరలోనే సానుకూల ఆదేశాలు వస్తాయని ఆశిస్తున్నాం.