భూములు రీ అసైన్‌? | Assigned lands allocated to BPL families | Sakshi
Sakshi News home page

భూములు రీ అసైన్‌?

Published Sun, Nov 5 2017 1:39 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

Assigned lands allocated to BPL families - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూములు పేదల అధీనంలో ఉంటే వాటిని వారికే తిరిగి అసైన్‌ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కబ్జాలో లేని, విక్రయించేసుకున్న వారికి చేసిన అసైన్‌మెంట్లను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వాస్తవానికి అసైన్డ్‌ భూముల క్రయవిక్రయాలు చట్టపరంగా నేరం. ఆ లావాదేవీలు కూడా చెల్లవు. అయినా ఆ అసైన్డ్‌ భూములను దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్‌) ఉన్న కుటుంబాలు కొనుగోలు చేసి, వినియోగించుకుంటున్నట్లయితే వారికే తిరిగి అసైన్‌ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా అసైన్డ్‌ భూముల సమస్యకు పరిష్కారం చూపాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు త్వరలోనే నిర్ణయం వెలువరించనుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

ఆరు లక్షల ఎకరాలు అన్యాక్రాంతం..
రాష్ట్రంలో పేదలకు భూముల అసైన్‌మెంట్‌ ప్రక్రియ చాలా ఏళ్లుగా జరుగుతోంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు తెలంగాణవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల వరకు పేదలకు అసైన్‌ చేసినట్లు అంచనా. కానీ ఈ భూమిలో 30 శాతానికిపైగా అన్యాక్రాంతమైంది. భూమి పొందిన పేదలే ఇతరులకు అమ్ముకున్నారు. వీటిలో చాలా వరకు పేదలే కొనుగోలు చేశారు. అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూముల్లో బీపీఎల్‌ కేటగిరీలో ఉన్న పేదలు కొన్నవే 60 శాతానికి పైగానే ఉంటాయని.. మిగతావి వివిధ సంస్థలు, బడాబాబుల చేతిలోకి వెళ్లాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే దాదాపు 3 లక్షల ఎకరాల మేర అసైన్డ్‌ భూమి చేతులు మారినా పేదల ఆధీనంలోనే ఉన్నట్లయింది.

ప్రక్షాళనలో వెలుగులోకి..
చాలా కాలంగా అసైన్డ్‌ భూముల అన్యాక్రాంతంపై చర్చలు జరుగుతున్నా.. తాజాగా భూరికార్డుల ప్రక్షాళనలో లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రక్షాళనలో దాదాపు 40వేలకు పైగా సర్వే నంబర్ల పరిధిలోని 1.25 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్‌ భూమి ఇతరుల చేతుల్లో ఉన్నట్లుగా తేలింది. ప్రక్షాళన కార్యక్రమం పూర్తయ్యే సరికి ఇది ఐదారు లక్షల ఎకరాల దాకా చేరుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో భూబదలాయింపు నిరోధక చట్టం (పీవోటీ)–1977 ప్రకారం ఈ భూములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిని ముందే ఊహించిన ప్రభుత్వం రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మొదలైనప్పుడే తగిన మార్గదర్శకాలు జారీ చేసింది. అసైన్డ్‌ భూముల్లో ఇతరులు కబ్జాలో ఉంటే వారి సామాజిక, ఆర్థిక వివరాలను కూడా సేకరించి నమోదు చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు వివరాల సేకరణ కూడా జరుగుతోంది. ఈ సమాచారం ఆధారంగా.. బీపీఎల్‌ పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలు కనుక అసైన్డ్‌ భూముల కబ్జాలో ఉంటే వారి పేరిట మళ్లీ అసైన్‌ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్, రెవెన్యూ ఉన్నతాధికారులు ఇప్పటికే అంతర్గత సమావేశాల్లో రెవెన్యూ యంత్రాంగానికి సంకేతాలు ఇస్తున్నారు. ఈ అంశంపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అధ్యక్షతన 10 మంది మంత్రులతో కేబినెట్‌ సబ్‌కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ త్వరలో రెవెన్యూ ఉన్నతాధికారులతో చర్చిస్తుందని, అనంతరం ప్రభుత్వం అసైన్డ్‌ భూములపై నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తుందని సమాచారం.

మూడు లక్షల ఎకరాలు రీ అసైన్‌!
అన్యాక్రాంతమై పేదల చేతుల్లో ఉన్న సుమారు 3 లక్షల ఎకరాల భూమిని రీ అసైన్‌ చేసే అవకాశముందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే కచ్చితంగా కబ్జాలో ఉండి, సాగుచేస్తున్న వారికే రీఅసైన్‌ చేయనున్నారు. చాలాచోట్ల అసైన్డ్‌ భూముల పట్టాలున్నా.. భూమి లేని పరిస్థితి ఉంది. కొందరు లబ్ధిదారులకు ఫలానా చోట 2 ఎకరాలు అసైన్‌ చేసినట్టు రికార్డులు ఉన్నా.. ఆ సర్వే నంబర్‌లో తగినంత భూమి లేదు. ఇలాంటి కేసుల విషయంలో అసైన్‌మెంట్‌ను రద్దు చేయాలని, కబ్జాలో ఉండి సాగు చేస్తున్న వాటిని మాత్రమే అసైన్డ్‌ భూమిగా గుర్తించాలని నిర్ణయించారు. దీనివల్ల నష్టపోయే లబ్ధిదారులకు మరో రూపంలో లబ్ధి చేకూర్చాలని యోచిస్తున్నారు.

బడా బాబులకు లీజు..!
కొన్ని ప్రాంతాల్లోని అసైన్డ్‌ భూములు పలు బడా సంస్థలు, వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. అసైనీలకు ఎంతోకొంత ముట్టజెప్పి ఆయా సంస్థలు, వ్యక్తులు అసైన్డ్‌ భూములను తీసుకున్నారు. ఈ భూముల విషయంగానూ ప్రభుత్వం స్పష్టతతోనే ఉన్నట్టు సమాచారం. బీపీఎల్‌ పరిధిలోనికి రాని వ్యక్తుల చేతుల్లో అసైన్డ్‌ భూమి ఉంటే... ఆ భూమి వివరాలను నేరుగా తెలంగాణ రాష్ట్ర భూనిర్వహణ సంస్థ (టీఎస్‌ఎల్‌ఎంఏ)కు పంపాలని నిర్ణయించారు. టీఎస్‌ఎల్‌ఎంఏ సమావేశంలో నిర్ణయించిన మేర సదరు భూమిని లీజుకు ఇవ్వడం,  లేదా భారీగా రుసుము కట్టించుకుని రెగ్యులరైజ్‌ చేయడం వంటివి చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే అసైన్డ్‌ భూమిని రెగ్యులరైజ్‌ చేసేందుకు పీవోటీ చట్టం అంగీకరించదు. ఈ నేపథ్యంలో పీవోటీ చట్టానికి పకడ్బందీ సవరణలు చేయడం ద్వారా రెగ్యులరైజ్‌ చేయవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. లేదంటే సదరు భూమిని లీజుకు ఇవ్వవచ్చని పేర్కొంటున్నారు. మొత్తంగా కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ తర్వాత పూర్తి స్పష్టత రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement