అసైన్డ్‌ భూముల్లో | Telangana Govt decision to mobilize lands with Assignee approval | Sakshi
Sakshi News home page

అసైన్డ్‌ భూముల్లో

Published Fri, May 13 2022 12:50 AM | Last Updated on Fri, May 13 2022 2:55 PM

Telangana Govt decision to mobilize lands with Assignee approval - Sakshi

► నగరాలు, పట్టణ శివార్లలోని అసైన్డ్‌ భూములు చాలావరకు పడావుగా ఉన్నాయి. నీటి వనరులు తగ్గిపోవడం, చుట్టుపక్కల పొలాలు రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌లో ప్లాట్లుగా మారిపోవడంతో నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. వాటిల్లో లబ్ధిదారులు వ్యవసాయం చేయలేని స్థితి, ఆ భూములను అమ్ముకోలేని పరిస్థితి ఉంది. 
► ఇలా పడావు పడిన అసైన్డ్‌ భూములను గుర్తించిన ప్రభుత్వం వాటిని ల్యాండ్‌ పూలింగ్‌ కింద తీసుకోవాలనుకుంటోంది. అయితే అసైన్డ్‌ భూములను లబ్ధిదారులు నేరుగా అమ్ముకునేందుకు వీల్లేదు. అందుకే అసైనీల ఆమోదంతో ఆ భూముల్లో లే అవుట్‌లను అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది.  
► సమీకరిస్తున్న భూములకు ప్రతిఫలంగా అసైన్డ్‌ భూముల లబ్ధిదారులకు ఒక్కో ఎకరానికి 600–800 చ.గ. చొప్పున అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
► అసైన్డ్‌ భూముల్లోని అభివృద్ధి చేసిన లే అవుట్‌లలో ప్లాట్లను అసైనీలకు కేటాయించడం ద్వారా వాటిని వారు విక్రయించుకునే అవకాశం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దశాబ్దాల కిందట భూములు లేని నిరుపేదలకు ప్రభుత్వం లభ్యత ఆధారంగా ఒకటి నుంచి మూడెకరాల వరకు అసైన్డ్‌ భూములుగా పంపిణీ చేసింది. అయితే ఈ భూములు చాలావరకు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాల కోసం బలవంతంగా అయినా ఈ భూములను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించినా, రైతుల నుంచి వ్యతిరేకత రావడం, బలవంతంగా తీసుకోవడంలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొంత వెనక్కి తగ్గింది.

తాజాగా అసైనీల (ప్రభుత్వం నుంచి అసైన్డ్‌ భూములు పొందినవారు) సమ్మతితోనే ల్యాండ్‌ పూలింగ్‌ జరపాలనే నిర్ణయానికి వచ్చింది. ప్లాట్లు, ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో అసైన్డ్‌ భూములను సమీకరించి, ప్రభుత్వమే లే అవుట్‌లు అభివృద్ధి చేసి సామాన్య ప్రజలకు విక్రయించనుంది. కనీసం 25 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో ఇలాంటి ప్రాజెక్టులను అభివృద్ధి పరచాలని భావిస్తోంది. అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో 800 చదరపు గజాల ప్లాటు విలువ భారీగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  

హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లు కావడంతో ఆదరణ 
ప్రైవేట్‌ లే–అవుట్లలో రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండానే, సరైన రీతిలో అభివృద్ధి చేయకుండానే.. ప్లాట్లుగా విభజించి అమ్ముకుంటున్నారు. ఇలాంటి ప్లాట్లను కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్లతో పాటు ఇంటి నిర్మాణ అనుమతులు పొందడానికి ఇబ్బందులు పడుతున్నారు. రూ.లక్షలు కట్టి ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ఈ ప్లాట్లను తప్పనిసరిగా క్రమబద్ధీకరించుకోవాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో తామే అస్సైన్డ్‌ భూములను క్రమపద్ధతిలో అభివృద్ధి చేయడం వల్ల నగరాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతాయని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ చేసే లే అవుట్‌లు కావడం వల్ల ప్లాట్లకు ఆదరణ బాగా ఉంటుందని, అటు లబ్ధిదారులకు, ప్రభుత్వానికి కూడా ఆదాయం భారీగా సమకూరుతుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.  

ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి 
లే అవుట్లలో రహదారులు, మంచినీటి పైపులైను, ఖాళీ స్థలాలు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్‌ స్థంభాలు, ఈ లేఅవుట్‌లకు అనుసంధానంగా రహదారుల ఏర్పాటు పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే చేపడ్తారు. ఎలాంటి వివాదం లేకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్‌ చేయనుండడంతో కొనుగోలు దారులకు టైటిల్‌ గ్యారెంటీ సైతం లభించనుంది. ప్లాట్లకు డిమాండ్‌ అధికంగా ఉన్న జిల్లాల్లో తొలుతగా ల్యాండ్‌ పూలింగ్‌ చేపట్టేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.  

తొలుత ఈ జిల్లాల్లోనే.. 
తొలుత రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని డిమాండ్‌ ఉన్న పట్టణాల సమీపంలో లే అవుట్‌లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 6,470 ఎకరాల అస్సైన్డ్‌ భూములున్నాయి. హైదరాబాద్‌ శివార్లలోని కుంట్లూరు, మోకిల, తుర్కయాంజాల్, కుమ్మరిగూడ, గుర్రంగూడ, గుండ్లపోచంపల్లి తదితర ప్రాంతాల్లో ఈ లే అవుట్‌ల అభివృద్ధికి సిద్ధమైంది. ఉప్పల్‌ భగాయత్‌లో సేకరించిన ప్రైవేట్‌ భూముల యజమానులకు ఒక ఎకరానికి 1,000 నుంచి 1,200 చదరపు గజాల చొప్పున ప్లాట్లను హెచ్‌ఎండీఏ కేటాయించింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement