1.72 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్
రాష్ట్రంలో ఉన్న మొత్తం 1.72 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఉత్తరప్రదేశ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 201 తహసీళ్లకు గాను 166 చోట్ల 33/11 కెవి సబ్స్టేషన్ల నిర్మాణం ఈ సంవత్సరం అక్టోబర్నాటికల్లా పూర్తవుతుందని ఆయన చెప్పారు. మిగిలినవి 2015 మార్చికి పూర్తవుతాయి.
రాష్ట్రమంతటికీ కోతలు లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలన్న ప్రణాళిక కోసం 122 ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అంపారా-డి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు, హర్దువాగంజ్, పాంకా విస్తరణ, ఓబ్రా-సి, ఘాతంపూర్, మేజా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను తగిన కాలావధిలోగా పూర్తి చేయాలన్నారు. లోహియా గ్రామాల్లో సోలార్ లైట్ల ఏర్పాటును సీనియర్ అధికారులు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,200 సోలార్ పంపులను ఏర్పాటుచేసేందుకు కూడా నిధులు విడుదల చేశామని అన్నారు.