న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై)కింద అదనంగా 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,650 కోట్లు కేటాయించింది. దీంతోపాటు, ఈ కోర్ట్స్’ ప్రాజెక్టు మూడో దశకు అనుమతి మంజూరుచేసింది. ఇందుకు గాను రూ.7,210 కోట్లు వెచి్చంచాలని తీర్మానించింది. ఇటీవల ముగిసిన జీ20ని విజయవంతం చేసి, భారత్ ప్రతిష్టను ఇనుమడింప జేసిన ప్రధాని మోదీని ఈ సమావేశం అభినందించింది. ఈ వివరాలను భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
కొత్తగా జారీ అయ్యే 75 లక్షల ఉజ్వల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను 2023–24 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు అందజేస్తామని తెలిపారు. వీటితో కలిపి ఉజ్వల లబి్ధదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుకుంటుందన్నారు. దిగువ కోర్టుల్లో రికార్డుల డిజిటైజేషన్, క్లౌడ్ స్టోరేజీ, వర్చువల్ కోర్టుల ఏర్పాటు తదితరాల కోసం నాలుగేళ్లపాటు అమలయ్యే ఈకోర్ట్స్ ప్రాజెక్టు ఫేజ్–3కి రూ.7,210 కోట్లు కేటాయించేందుకు కూడా కేబినెట్ అంగీకరించిందని ఠాకూర్ చెప్పారు. ఇందులో భాగంగా 3,108 కోట్ల డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలోకి మారుతాయని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment