
2018నాటికి ‘భగీరథ’కు 41.31 టీఎంసీలు
► 2033కి 50.6 టీఎంసీలు, 2048కి 60.75 టీఎంసీలు
► రాష్ట్ర తాగునీటి అవసరాలపై లెక్కలేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల నుంచి రాష్ట్ర తాగునీటి అవసరాలకు భవిష్యత్తులో ఏ మేర నీటి అవసరాలు ఉంటాయన్న అంశంపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. రాష్ట్ర తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథకు 2018 నాటికి 41.31 టీఎంసీలు, 2048 నాటికి 60.75 టీఎంసీల అవసరం ఉంటుందని లెక్కకట్టింది. నిజానికి మిషన్ భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్లలోని 26 సెగ్మెంట్లకు నీటిని అందించేందుకు ప్రాజెక్టుల నుంచి మొత్తంగా 39.19 టీఎంసీల నీటిని వాడుకోవాలని మొదట నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రతి ప్రాజెక్టులో కనీసం 10 శాతం నీటిని తాగునీటి అవసరాల కోసం వాటర్ గ్రిడ్‌కు కేటాయించింది. కృష్ణా బేసిన్‌లో 19.59 టీఎంసీలు, గోదావరి 19.67 టీఎంసీలు కేటాయించగా.. ప్రస్తుతం దాన్ని సవరించింది.
కృష్ణాలో 18.20 టీఎంసీలు, గోదావరిలో 23.11 టీఎంసీల నీటిని తీసుకోవాలని తాజాగా నిర్ణయించింది. 2018నాటికి మొత్తంగా 41.31 టీఎంసీలను వినియోగించాలని నిర్ణయించింది. ఇక 2033 నాటికి రాష్ట్ర నీటి అవసరాలు కృష్ణాలో 21.49, గోదావరిలో 29.11 టీఎంసీ కలిపి మొత్తంగా 50.6 టీఎంసీలకు పెరుగుతాయని లెక్కలేసింది. 2048లో కృష్ణాలో 24.98, గోదావరిలో 35.77 టీఎంసీలు కలిపి మొత్తంగా 60.75 టీఎంసీలు అవసరం ఉంటుందని అంచనా వేసింది. ఈ అవసరాలకు తగ్గట్లు నీటిని తీసుకునేలా సహకరించాలంటూ రెండ్రోజుల కిందట గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) నీటి పారుదల శాఖను కోరింది. నీటిపారుదల శాఖ అందుకు సమ్మతం తెలుపుతూ మెమో జారీ చేసింది.