సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 215 టీఎంసీల గోదావరి జలాలను తరలించి రూ.19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి, 18.82 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ జరపాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 98,570 ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేశారు. మొత్తం రూ.1,27,872.28 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటివరకు రూ.93,872.07 కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) ద్వారా సమీకరించిన రూ.61,665.20 కోట్ల రుణాలతోపాటు రూ. 32,206.87 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు అందులో ఉన్నాయి.
కాళేశ్వరం కింద 18,64,970 ఎకరాల మిగులు ఆయకట్టును 2028–29 నాటికి అభివృద్ధి చేసేందుకు గత ప్రభు త్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించనుంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టుపూర్వోత్తరాలపై మంత్రుల బృందానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇవ్వనున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎందుకు అర్ధంతరంగా విరమించుకున్నారు? ఆ ప్రాజెక్టుకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మించాల్సి వచి్చంది? వ్యయం, ప్రతిపాదిత ఆయకట్టు, నిధుల సమీకరణ, విద్యుత్ అవసరాల విషయంలో రెండు ప్రాజెక్టుల మధ్య తేడాలేంటి? మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో తలెత్తిన లోపాలు, సమస్యలేంటి? వాటికి పరిష్కార మార్గాలేంటి? అన్న అంశాలతో నీటిపారుదల శాఖ పీపీటీని సిద్ధం చేసింది.
వడ్డీ రూపంలో రూ.16,201.94 కోట్లు
ఇప్పటివరకు తీసుకున్న రుణంలో అసలు రూ.4,696.33 కోట్లు మాత్రమే చెల్లించగా, గత ఐదేళ్లలో వడ్డీలు రూ.16,201.94 కోట్లు చెల్లించారు. అసలు, వడ్డీ కలిపి రూ.21,157.87 కోట్లు చెల్లించా రు. కాళేశ్వరం కార్పొరేషన్‌లో భాగమైనపాలమూరు–రంగారెడ్డికి రూ.10 వేల కోట్ల రుణం మంజూరు కాగా.. పవర్‌ఫైనాన్స్ కార్పొరేషన్‌రూ.7,721.51 కోట్లు విడుదల చేసింది. ఇంకో రూ.2,278.49 కోట్లు మంజూరు చేయాల్సి ఉంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు గత మూడేళ్లలో రూ.1,522.8 కోట్ల వడ్డీ చెల్లించగా, అసలు చెల్లింపులు ఇంకా మొదలుకాలేదు.
17.08 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ
దిగువ మానేరు జలాశయం కింద ఎస్సారెస్పీ స్టేజ్–1కి సంబంధించిన పాత ఆయకట్టుతోపాటు ఎస్సారెస్పీ స్టేజ్–2, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద పాత ఆయకట్టుకు 2023–24 ఖరీఫ్, రబీ సీజన్లలో కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించారు. దీంతో మొత్తం 17,08,230 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించినట్టు నీటిపారుదల శాఖ మంత్రులకు నివేదించనుంది.
♦ కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా 456 చెరువులను నింపగా, వాటి కింద 39,146 ఎకరాల ఆయకట్టు ఉంది. కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీ–1, 2, నిజాంసాగర్ కాల్వల ద్వారా 2,143 చెరువులకు తరలించగా, వాటి కింద మరో 1,67,050 ఎకరాల ఆయకట్టు ఉంది.
♦ 2020–21 రబీ నుంచి 2023–24 ఖరీఫ్ వరకు కుందెల్లి వాగు, హల్దివాగు, 66 చెక్‌డ్యామ్‌ల కింద ఉన్న మొత్తం 20,576 ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం జలాలను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment