దసరాకు ముందే కాళేశ్వరం ఎత్తిపోతలు! | Kalesvaram Lift Irrigation starts before dasara | Sakshi
Sakshi News home page

దసరాకు ముందే కాళేశ్వరం ఎత్తిపోతలు!

Published Sun, Sep 2 2018 1:32 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

Kalesvaram Lift Irrigation starts before dasara - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు వరప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం పథకం నుంచి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దసరా కంటే ముందే అధికారికంగా కాళేశ్వరం పంపులను ఆరంభించడం ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలను మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–6 పంప్‌హౌజ్‌లోని రెండు మోటార్ల ద్వారా గోదావరి నీటిని ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి మేడారం రిజర్వాయర్‌కు ఈ నెలాఖరుకల్లా తరలించాలని.. దసరా నాటికి ప్యాకేజీ–7 టన్నెల్‌ వ్యవస్థ, ప్యాకేజీ–8లో ఇప్పటికే సిద్ధమైన మరో రెండు మోటార్ల ద్వారా మేడారం నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించినట్లుగా ప్రభుత్వంలోని అత్యున్నత వర్గాల ద్వారా తెలిసింది.

సిద్ధమైన పంపులు, మోటార్లు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌజ్‌ పనులు వేగంగా సాగుతున్నా వర్షాలతో కొంత ఆటంకం కలుగుతోంది. గేట్లు, మోటార్లు అమర్చే ప్రక్రియ మొదలైనా అవి పూర్తయ్యేందుకు నవంబర్, డిసెంబర్‌ వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఎగువ పనులు పూర్తి కాకున్నా ఎల్లంపల్లిలో చేరిన నీటిని దాని దిగువనున్న 3 ప్యాకేజీల ద్వారా మిడ్‌మానేరుకు తరలించేలా పనులు జరుగుతున్నాయి.

ఎల్లంపల్లి 20 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి చేరుకోవడం, స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటంతో ఈ నెలలోనే నీటిని ప్యాకే జీ–6 ద్వారా మేడారం రిజర్వాయర్‌కు తరలించేలా ప్రాజెక్టు అధికారులు చర్యలు చేప ట్టారు. ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికే రెండు సిద్ధమయ్యాయి. ఇందులో ఒక మోటార్‌కు శుక్రవారం డ్రై రన్‌ నిర్వహించగా అది విజయవంతమైంది.

ఈనెల 5న రెండో మోటార్‌ డ్రై రన్‌ నిర్వహించనున్నారు. ఒక్కో మోటార్‌కు 3,200 క్యూసెక్కుల(రోజుకు) నీటిని తరలించే సామర్థ్యం ఉండగా గరిష్టంగా ఒక టీఎంసీ నీటిని తరలించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో పంపు డ్రైరన్‌ పూర్తి కాగానే ఈనెల 25 నాటికి ఎల్లంపల్లి నుంచి 0.78 టీఎంసీ సామర్థ్యం ఉన్న మేడారం రిజర్వాయర్‌కు నీటిని తరలించాలన్నది ప్రస్తుత లక్ష్యంగా నిర్ణయించారు.

అక్టోబర్‌ రెండో వారం వరకు..
ఇక ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇందులో అత్యంత క్లిష్టమైన పనులు ఇటీవలే పూర్తయ్యాయి. 5 మీటర్ల మేర హెడింగ్, బెంచింగ్‌ పనులు చేయడంతోపాటు, 8 కిలోమీటర్ల టన్నెల్‌ లైనింగ్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఎడమ వైపు సొరంగంలో పని జరిగినంత వరకు లైనింగ్‌ పూర్తిచేసి అక్కడి నుంచి కుడి సొరంగంలోకి నీటిని మళ్లించడం, దీనికి తగ్గట్లుగా కుడి సొరంగ మార్గంలో లైనింగ్‌ పూర్తి చేస్తే ఒక టీఎంసీ నీటినైనా మళ్లించడానికి ఏర్పాట్లు చేశారు.

ఈ పనులు పూర్తయ్యేందుకు అక్టోబర్‌ రెండో వారం వరకు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటార్‌ పంపులు 2 సిద్ధమయ్యాయి. ఇంకో మోటార్‌ను మరో 15 రోజుల్లో సిద్ధం చేయనున్నారు. దీని పరిధిలో ఉన్న గ్రావిటీ కెనాల్‌ పూర్తయితే మిడ్‌ మానేరుకు నీరు తరలించవచ్చు. దసరాకు ముందే ప్యాకేజీ–7 పూర్తి చేసి నీటిని మిడ్‌మానేరు తేవాలని నిర్ణయించారు. మిడ్‌మానేరుకు నీటి తరలించి.. అక్కడ కనీస మట్టాలకు నీరు చేరిన వెంటనే దిగువ ప్యాకేజీల ద్వారా మల్లన్నసాగర్‌ కాల్వలకు నీటిని తరలించే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీనికి అనుగుణంగా  నీటిపారుదల మంత్రి హరీశ్‌ పనులను పరుగులు పెట్టిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement