గోదావరి జలాలపైనే రాష్ట్ర భవిష్యత్తు
సెప్టెంబర్ నాటికి రాయలసీమకు ‘పట్టిసీమ’ నీళ్లు
కుప్పం పర్యటనలో చంద్రబాబు
చిత్తూరు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్తు గోదావరి జలాలపైనే ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన ‘చంద్రన్న సంక్షేమబాట’ సభలో సీఎం ప్రసంగించారు. ఏటా 3వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని కరువు ప్రాంతాలకు అందించేందుకే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని చెప్పారు. సెప్టెంబర్ నాటికి రాయలసీమకు పట్టిసీమ నీటిని తరలిస్తామన్నారు. హంద్రీ-నీవాకోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నామని, ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని తరలిస్తామని ఆయన చెప్పారు. కుప్పంకు వచ్చే ఏడాది మార్చిలోపు, ఆ తరువాత చిత్తూరుకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సోమశిల, స్వర్ణముఖి ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాలకు నీటిని మళ్లిస్తామన్నారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదుల్ని అనుసంధానం చేయనున్నట్లు సీఎం చెప్పారు.
అవినీతికి తావులేకుండా చేస్తా..
డ్వాక్రా మహిళలకు జనరిక్ మందుల షాపులు ఇస్తున్నట్టు సీఎం తెలిపారు. అలాగే పొట్టేళ్ల పెంపకం, మీ-కోడి కార్యక్రమాలు కూడా వారికే ఇస్తున్నామని పేర్కొన్నారు. వచ్చేఏడాది మార్చి 15లోపు రాష్ట్రంలో ఇంటింటికీ 15 ఎంబీపీఎస్ సామర్ధ్యం కలిగిన ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రెవెన్యూశాఖతోపాటు అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేసి అవినీతికి తావులేకుండా చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
దళితుని ఇంట సీఎం భోజనం
కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మంగళవారం అనిమిగానిపల్లిలో దళితుడు వుునికృష్ణ కుటుంబంతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం వూట్లాడుతూ రూ.ఐదువేల కోట్లతో ఎస్సీలకు అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.