సాక్షి, హైదరాబాద్: గోదావరి నుంచి 60 టీఎంసీల నదీ జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకానికి అనేక ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. తొలిరెండు దశల్లో అనుకున్న రీతిలో నీళ్లివ్వగలిగినా.. మూడో దశకు మాత్రం అవాంతరాలు వస్తున్నాయి. దీంతో మూడో దశ కింద మరో ఏడాదికి కానీ నీళ్లివ్వలేని పరిస్థితి తలెత్తుతోంది.
దేవాదుల ప్రాజెక్టు ద్వారా 6.21 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం మూడు దశలుగా విభజించి పనులు మొదలు పెట్టింది. రెండు దశల ద్వారా గతేడాది ఖరీఫ్‌లో గరిష్టంగా 7.93 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 319 చెరువులను నింపారు. రబీలోనూ 3.5 టీఎంసీల నీటిని తరలించి తాగునీటి అవసరాలను తీర్చగలిగారు. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి మరింత నీటిని ఎత్తిపోసి 395 చెరువులను నింపే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు.
అనేక అడ్డంకులు.. పనుల్లో జాప్యం..
దేవాదుల మూడో దశ పనులను 8 ప్యాకేజీలుగా విభజించి.. 2.41 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. తొలుత ప్రతిపాదించిన 25 కిలోమీటర్ల టన్నెల్‌తో రామప్ప దేవాలయానికి ప్రమాదం పొంచి ఉందన్న కారణంతో.. టన్నెల్ ప్రతిపాదన పక్కనపెట్టి పైప్‌లైన్ వ్యవస్థ పనులను ప్రభుత్వం చేపట్టింది. ప్యాకేజీ–3లో భాగంగా రామప్ప నుంచి ధర్మసాగర్‌కు నీటిని తరలించాల్సి ఉంది. దీనికోసం ఆసియాలోనే అత్యంత పొడవైన 54 కి.మీ.ల మేర టన్నెల్ తవ్వాల్సి ఉంది.
ఈ టన్నెల్‌ను సలివాగు చెరువు కింది నుంచి ప్రతిపాదించగా, 2011లో చెరువు కింది టన్నెల్ ప్రాంతం కుంగి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. దీంతో 16.93వ కి.మీ ప్రాంతంలో పనులు రెండేళ్లుగా ఆగిపోయాయి. ఇక్కడ ప్రస్తుతం అధునాతన పద్ధతుల్లో పనులు మొదలు పెట్టినా అవి మరో ఏడాదికి కానీ పూర్తయ్యే పరిస్థితి లేదు. మరోవైపు టన్నెల్ తొలి 7 కి.మీ. అటవీ మార్గంలో వెళ్తోంది.
తవ్వకాలకు అటవీ అనుమతులు వచ్చినా.. ఇక్కడి భూమి పొరలు పూర్తిగా సున్నపురాయి, బొగ్గు నిక్షేపాలతో ఉండటంతో టన్నెల్ నిర్మాణం ముందుకు కదలడం లేదు. పనులు కొనసాగిస్తే టన్నెల్ కూలే ప్రమాదం నేపథ్యంలో ఇతర మార్గాన్వేషణ జరుగుతుండటంతో పనులు ఆలస్యం అవుతున్నాయి. టన్నెల్ 49వ కి.మీ. వద్ద పంప్‌హౌజ్ నిర్మాణం చేయాల్సి ఉండగా ఇక్కడి భూమి పొరలు అనుకూలంగా లేవు. దీంతో పంప్‌హౌజ్ పనులకు మరో ఏడాది ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment