సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటి వాటాను వచ్చే జూన్ వాటర్ ఇయర్ నుంచి అమలు చేయాలని పట్టుబట్టేందుకు తెలంగాణ సిద్ధమైంది. వాటాల విషయమై ఇప్పటికే కృష్ణా, గోదావరి బోర్డులు చేతులెత్తేయడం, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యేవరకు పాత విధానమే అమల్లో ఉంటుందని కేంద్రం సంకేతాలు పంపిన నేపథ్యంలో దీనిపై కేంద్రం వద్ద తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది.
బచావత్ అవార్డు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీరు కేటాయించారు. అయితే పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా కేటాయింపులు కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇదే బచావత్ అవార్డులో పేర్కొ న్న మేరకు, పోలవరానికి అధికారిక అనుమతులు రాగానే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని, ఈ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, అలాగే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో మరో 45 టీఎంసీల వాటా ఇవ్వాల ని తెలంగాణ అంటోంది.
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలకు 35 టీఎంసీలు దక్కుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టంగా ఉండటంతో కర్ణాటక తన వాటా మేరకు 21 టీఎంసీల వినియోగం మొదలుపెట్టింది. అయితే తెలంగాణకు దక్కే వాటాల అంశం మాత్రం పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలను పేర్కొంటూ ఈ వాటర్ ఇయర్‌లో తెలంగాణకు 45 టీఎంసీల మేర కోటా పెంచాలని పట్టుబట్టనుంది. ఇవే అంశాలతో ప్రభుత్వ సీఎస్ ఎస్‌కే జోషి ఒకట్రెండు రోజుల్లో కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది. వాటర్ ఇయర్ ఆరంభానికి కేవలం 40 రోజుల గడువే ఉన్న నేపథ్యంలో ముందు నుంచే ఈ అంశంపై కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని కృత నిశ్చయంతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment