
భగీరథ యత్నం..!
కోటి ఎకరాల ఆయకట్టు లక్ష్యం.. లక్ష కోట్ల ఖర్చు
ఐదేళ్లలో ప్రాజెక్టుల పూర్తి.. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు
నూతన జల విధానంతో సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం
దసరా తర్వాత ప్రజలు, పార్టీల ముందుకు..
కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్ర హక్కుగా కలిగిన నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవడం.. సుమారు రూ.లక్ష కోట్ల ఖర్చుతో కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించడం.. నియోజకవర్గానికి లక్ష ఎకరాల భూమికి సాగుయోగ్యత కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర జల విధానం ముస్తాబైంది. ఐదేళ్లలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసేలా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రభుత్వం.. రాష్ట్ర పరీవాహకంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటిచుక్కను ఆయకట్టుకు మళ్లించడం, అవసరాలకు తగినట్లుగా నిల్వ, వినియోగం చేసుకునేలా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.
వరద ఉండే కొద్దిరోజుల్లోనే గరిష్ట స్థాయిలో నీటిని ఒడిసిపట్టుకునేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యంలో... కొత్త రాష్ట్రానికి జల విధానం అవసరమేమిటి, తక్షణం ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు, రీ ఇంజనీరింగ్ ఎందుకు అవసరమవుతోంది, కొత్త, పాత ప్రాజెక్టుల పూర్తికి విధించుకున్న లక్ష్యాలు, బడ్జెట్, సమస్యలపై అటు ప్రజలకు, ఇటు పార్టీలకు స్పష్టతనిచ్చేలా నివేదిక సిద్ధం చేసింది. ఈ జల విధానంలో పొందుపరిచిన విషయాలను ‘సాక్షి’ సేకరించింది.
జల విధానం ఎందుకంటే?
రాష్ట్రంలో గోదావరి పరీవాహకం 69 శాతం, కృష్ణా పరీవాహకం 68.5 శాతం ఉన్నా... ఉమ్మడి ఏపీలో ఇక్కడి ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది. తెలంగాణ బేసిన్‌ల నుంచి నీటిని కోస్తాంధ్రకు బదలాయించి అక్కడ రెండు పంటలకు నీళ్లిచ్చారు, తెలంగాణలో ఒక పంటకే నీరిచ్చా రు. 50 ఏళ్లలో చెరువుల కింద సాగు తగ్గింది. ప్రాజెక్టుల కిందా సాగు పెరగలేదు. ఫలితంగా భూగర్భ జలాల వినియోగం పెరిగి.. నీటి మట్టాలు గణనీయంగా తగ్గాయి. ఈ దృష్ట్యా గోదావరి, కృష్ణా నదుల్లోని 1,296 టీఎంసీల నికర, మిగులు జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు నూతన జల విధానాన్ని రూపొందించుకుంది. అసమాన నీటి పంపిణీ సమస్యను పరిష్కారించి.. తగిన ప్రణాళిక, నిర్వహణతో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడమే ఈ విధాన ఆశయం.
ఖర్చు తగ్గించేందుకే
ఇప్పటికే నిర్మాణంలోని ప్రాజెక్టులను పూర్తి చేసి, కొత్తవాటిని నిర్మిం చి.. మొత్తంగా 1.12 కోట్ల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వ్యయం తగ్గించడం, ఎత్తిపోతల ఖర్చు తగ్గించడం, సాగు, ఇతర అవసరాలకు ఎక్కువ రోజులు నీటిని అందుబాటులో ఉంచడం, గ్రావిటీ ద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీరందించడం, ముంపు తక్కువగా ఉండేలా చూడటానికి రీ ఇంజనీరింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇక భూగర్భ జలమట్టం పెంపునకు ఆధునిక సాంకేతిక పద్ధతులను తీసుకురావాలని, భూగర్భ జలాల పెంపునకు సంప్రదాయ పద్ధతులను ప్రోత్సహించడం, పూర్తయిన ప్రాజెక్టుల్లో నీటి వినియోగాన్ని గరిష్ట స్థాయికి పెంచడం, వివిధ బేసిన్‌ల మధ్య నీటిని బదిలీ చేసి సమతుల్యత సాధించడం ప్రభుత్వ ప్రాధాన్యంగా చేపట్టిన అంశాలు.
నాలుగు ప్రాజెక్టులు కీలకం
దేవాదుల, ప్రాణహిత-చేవెళ్ల, శ్రీరాంసాగర్ వరద కాలువ, ఇందిరా, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం పనులు చేపట్టినా ఇప్పటి వరకు లక్ష్యాలను చేరుకోలేదు. కంతనపల్లికి 50 టీఎంసీల మేర కేటాయింపులున్నా ఇంతవరకు నీటి వినియోగం జరగలేదు. ఈ ప్రాజెక్టు ద్వారా వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో 7.5 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. వరంగల్ జిల్లా ఏటూరునాగారం వద్ద నిర్మించదలిచిన 22.5 టీఎంసీల బ్యారేజీ నిర్మాణమే పూర్తి చేయలేదు. నిర్దేశిత 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలంటే రెండు మూడు రిజర్వాయర్‌లు అవసరం. వాటిని ఎక్కడ చేపట్టాలన్నది తేలలేదు.
గోదావరిపై దేవాదుల ప్రాజెక్టు ద్వారా 38.182 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. 6.21 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే నిర్ణీత నీటి కేటాయింపులకు, ఆయకట్టు లక్ష్యానికి పొంతన కుదరకపోవడం తో నీటి కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచారు. అయినా ఈ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిపై గందరగోళం కొనసాగుతోంది. ఎందుకం టే దేవాదుల ఆయకట్టు మధ్యలో కొంత ఎస్సారెస్పీ వరద కాల్వ ఆయకట్టు ఉంది. తర్వాత మళ్లీ దేవాదుల ఆయకట్టు ఉంది.
కొన్ని చోట్ల 2 ప్రాజెక్టులకు ఒకే ఆయకట్టు ఉంది. 160 టీఎంసీలు వినియోగించుకునే ప్రాణహిత-చేవెళ్ల బ్యారేజీని తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర వ్యతిరేకించడంతో మేటిగడ్డకు మార్చారు. ఈ ప్రాజెక్టుకు ఏకంగా 16 రిజర్వాయర్లను 124 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు కసరత్తు పూర్తయింది. దుమ్ముగూడెం ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా మారడంతో కొత్తగా రోళ్లపాడు, బయ్యారం వద్ద బ్యారేజీలను నిర్మించి, ఖమ్మం జిల్లా అంతా ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
గోదావరిలో కోలాటం.. కృష్ణాలో జంజాటం
గోదావరిలో రాష్ట్రానికి పుష్కలంగా నీటి కేటాయింపులున్నా... ప్రాజెక్టులు పూర్తికాక నీటిని వినియోగించుకోలేక పోతున్నాం. మరోవైపు కృష్ణాలో కేటాయింపులు లేక నీటి కోసం పోరాడుతున్నాం. 1956కు ముందటి హైదరాబాద్ రాష్ట్రానికి కృష్ణా బేసిన్‌లో 542.79 టీఎంసీల మేర కేటాయింపులు ఉండేవి. అందులో 175 టీఎంసీల మేర గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలున్నా ఉమ్మడి ఏపీలో అలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఆ తర్వాత బచావ త్ ట్రిబ్యునల్ నీ టి కేటాయింపుల్లో ఎక్కువగా ఏపీకే లబ్ధి చేకూరింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు ప్రస్తు తం 299 టీఎంసీల మేర కేటాయింపులున్నాయి.
ఇందులో ఒక్క జూరాలకు మినహా కరువుపీడిత ప్రాంతాలకు, ఫ్లోరైడ్ ప్రాంతాలకు నీటి కేటాయింపులు లేవు. బచావత్ ప్రకారం ఆర్డీఎస్ కెనాల్‌కు 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉన్నా... ఏపీ, కర్ణాటకల తీరుతో అందడం లేదు. ప్రస్తుతం నీటిని తిరిగి కేటాయించాలంటూ కోర్టులు, ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతోంది. ఇక గోదావరిలో లభ్యత జలాలు పుష్కలంగా ఉన్నా... ఎగువ రాష్ట్రాల తీరుతో దిగువకు నీరు రావడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర కట్టిన అనధికార ప్రాజెక్టులతో శ్రీరాంసాగర్‌కు నీరు చేరడం లేదు. సింగూరు జలాలను పూర్తిగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకే మళ్లిస్తుండటంతో దిగువన నిజాంసాగర్‌కు నీటి విడుదల జరగడం లేదు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరాలతో జాప్యం జరుగుతోంది. నదుల అనుసంధానం పేరిట గోదావరి మిగులు జలాలను కృష్ణాకు తరలించాలని కేంద్రం భావిస్తోంది. కానీ నిజానికి గోదావరిలో ఎలాంటి మిగులు జలాలు లేవు.
చేయాల్సింది మరెంతో..
భారీ, మధ్యతరహా సహా ప్రధాన ప్రాజెక్టులన్నింటినీ రూ.1.30 లక్షల కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు రూ.41వేల కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.87 వేల కోట్ల వ్యయం చేయాల్సి ఉంది. ఇప్పటివరకు సుమారు 60 లక్షల ఎకరాల మేర నీరివ్వాల్సి ఉండగా.. 6.87లక్షల ఎకరాల మేర మాత్రమే ఇచ్చారు. ఇక చిన్న నీటి వనరుల కింద 20 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉన్నా... సాగులో ఉన్నది కేవలం 10 లక్షల ఎకరాలే. ఇక్కడా పూర్తిస్థాయిలో ఆయకట్టును వృద్ధి చేయాల్సి ఉంది. ఇక ప్రాజెక్టులకు అదనంగా బ్యారేజీలు నిర్మిస్తే మరింత ఆయకట్టు పెరుగుతుంది. మొత్తంగా కోటి ఎకరాల కొత్త ఆయకట్టు ఉంటుంది. మరోవైపు కొత్తగా పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు రెండు మూడేళ్లలోనే నీరివ్వాలని సంకల్పించారు. అనుకున్న సమయానికి పూర్తి చేయాలంటే ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది.
భారీగా విద్యుత్ వ్యయం..
రాష్ట్రంలో చేపడుతున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాలు భారీగా ఉండనున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవాటితోపాటు కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు కలిపి దాదాపు 10 వేల మెగావాట్ల విద్యుత్ అవసరంకాగా.. దీనికోసం ఏటా రూ.10వేల కోట్ల మేర ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి. 15 ఎత్తిపోతల పథకాలతో 370 టీఎంసీల నీటిని వినియోగించి.. 40.21లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 1.34లక్షల ఎకరాల పాత ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే 5,903 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఇవి పూర్తయి విద్యుత్ వాడుకుంటే.. యూనిట్‌కు రూ.5.37 చొప్పున లెక్కించినా ఏటా రూ.7,640 కోట్ల మేర ఖర్చవుతుంది. ఇక ప్రాణహిత, పాలమూరు ఎత్తిపోతలకు కలిపి మరో 5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం. వీటికి మరో రూ.3వేల కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యుత్ ధర పెరిగితే ఖర్చు మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎత్తిపోతలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తోంది.
‘లక్ష’ సాగు 61 నియోజకవర్గాల్లోనే..
రాష్ట్రంలో 2.76 కోట్ల ఎకరాల భూమి ఉండగా.. సాగుకు అనువైన భూమి 1.67 కోట్ల ఎకరాలు. ప్రస్తుతం 46.99 లక్షల ఎకరాలు సాగులో ఉంది. హైదరాబాద్ మినహా 9 జిల్లాలోని 104 నియోజకవర్గాల్లో 61 నియోజకవర్గాల్లోనే లక్ష ఎకరాలకు పైగా సాగులో ఉంది. 75 వేల ఎకరాలకు పైగా సాగుభూమి ఉన్నవి 11 నియోజకవర్గాలు, 50 వేల ఎకరాలకు పైగా ఉన్నవి 12 ఉన్నాయి. 20 నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాల కంటే తక్కువగా సాగులో ఉంది. అన్ని నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల సాగు జరిగేలా నూతన జల విధానం రూపొందింది.
భూసేకరణే గుదిబండ
నిర్మాణంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో రిజర్వాయర్, డ్యామ్‌లు, కాలువల పనులు ముగిసినప్పటికీ ఇతర శాఖల పరిధిలో తేల్చుకోవాల్సిన అంశాలు, భూసేకరణ పూర్తికాకపోవడం వంటివి ఆయకట్టుకు నీరివ్వలేని పరిస్థితికి కారణమవుతున్నాయి. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులు, ప్రధాన ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో భూసేకరణ అవసరమైన ప్రాజెక్టులు 36 వరకు ఉండగా... వాటిలో ఇప్పటివరకు 7 ప్రాజెక్టులకు మాత్రమే భూసేకరణ పూర్తిచేయగలిగారు. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి సేకరణ పెండింగ్‌లోనే ఉంది. మొత్తంగా 36 ప్రాజెక్టులను కలిపి 3,09,132 ఎకరాల మేర భూమి కావాలని గుర్తించగా.. ఇప్పటిదాకా 2,14,551 ఎకరాలు సేకరించారు. మరో 94,580 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కొత్తగా ఇచ్చిన జీవో 123తో సేకరణ మొదలుపెట్టినా ఆశించిన సమయంలోగా పూర్తిచేయడం కష్టమే.
చిన్ననీటి వనరులపైనా దృష్టి
రాష్ట్రంలో చిన్ననీటి వనరులకు కృష్ణా, గోదావరి నదుల నుంచి 262 (కృష్ణాలో 97, గోదావరిలో 165) టీఎంసీలను పూర్తిస్థాయిలో సద్వినియోగ పరుచుకొని చెరువుల కింద ప్రతి ఎకరాన్ని తడపడమే లక్ష్యంగా ప్రభుత్వం మిషన్ కాకతీయను రూపొందించుకుంది. గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసేలా ముందుకు వెళ్లేలనేది ప్రభుత్వ ప్రణాళికలో భాగం. సమగ్ర సర్వే ద్వారా గుర్తించిన 46,531 చిన్న నీటివనరుల కింద మొత్తంగా 20.09 లక్షల ఎకరాల ఆయకట్టును రూ.20 వేల కోట్లతో వృద్ధిలోకి తేవాలని.. ఏడాదికి 20శాతం చెరువుల (సుమారు 9వేలు) చొప్పున పునరుద్ధంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగా తొలి ఏడాది రూ. 2వేల కోట్లతో 9,651 చెరువుల పనులను చేపట్టింది. ఇందులో 8 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. ఇక చెరువుల కబ్జాలకు పాల్పడినా, చెరువులను దెబ్బతీసే చర్యలకు పాల్పడినా కనీసం ఏడాది జైలు శిక్ష పడేలా ముసాయిదా చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది.
నదుల అనుసంధానం..
దక్షిణాదిలోని మహానది-గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. గోదావరిలో 530 టీఎంసీల మిగులు జలాలున్నాయని చెబుతూ రాష్ట్ర పరిధిలో ఇచ్చంపల్లి (గోదావరి)-నాగార్జునసాగర్(కృష్ణా), ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు... అటునుంచి పెన్నా, కావేరీలకు తరలించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే ఇక్కడ లభ్యంగా ఉన్న 980 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని, ఎప్పుడో 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో అదనపు జలాలున్నాయనేది సరికాదని తెలంగాణ వాదిస్తోంది. గోదావరిపై కొత్తగా చేపడుతున్న ప్రాణహిత-చేవెళ్ల(160 టీఎంసీలు), ఎల్లంపల్లి (60టీఎంసీలు), దేవాదుల (38 టీఎంసీలు), కంతనపల్లి (50టీఎంసీలు) సహా ఇతర ప్రాజెక్టుల నీటి అవసరాలను వివరిస్తూ దీన్ని అడ్డుకునే యత్నం చేస్తోంది.
- సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి
లక్ష్యాలపై వరల్డ్‌బ్యాంకుకు నివేదిక
రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపడుతున్న సాగునీటి ప్రా జెక్టులకు ఒక్కో ఆర్థిక సంవత్సరంలో ఎన్ని నిధులు అవసరమనే వివరాలను ప్రభుత్వం వరల్డ్‌బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో తెలిపింది. ప్రాధాన్యతా క్రమంలో ఏయే ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తిచేసేదీ, వాటికి అవసరమై న నిధులు, వాటిని ఏరీతిన ఖర్చు చేయనున్నన్న అంశాలను పేర్కొంది. ఈ నివేదిక మేరకు... రాష్ట్రంలోని ప్రాజెక్టుల పూర్తికి రూ.1.03 లక్షల కోట్లు అవసరం. ప్రస్తుత ప్రభుత్వ ఐదేళ్ల గడువు ముగిసేనాటికి (అంటే 2018-19 ఆర్థిక సంవత్సరానికి) సుమారు రూ.55,931కోట్లు అవసరం. మిగతా రూ.47,120 కోట్లు తర్వాతి మూడేళ్లలో వెచ్చించాల్సి ఉంటుంది. వరల్డ్ బ్యాంకుకు చెప్పినట్లే ప్రభుత్వం ప్రాజెక్టులపై ఏటా రూ.25 వేలకోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది. అంటే వచ్చే మూడేళ్లలోనే రూ.75వేల కోట్ల మేర కేటాయించే అవకాశముంది. వీటికి తోడు కేంద్రం నుంచి వచ్చే ఏఐబీపీ, ట్రిపుల్‌ఆర్ నిధులు, వివిధ బ్యాంకులు అందించే రుణాల లక్ష్యాలను ప్రభుత్వం జల విధానంలో వివరించనుంది.