సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది వానాకాలానికల్లా సుమారు లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామన్న హామీ నీరుగారినట్లే కనబడుతోంది. పూర్తికాని భూసేకరణ, నిధుల లేమి, కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ అన్నీ కలిసి ఆశలకు గండికొడుతున్నాయి. గోదావరి నీటిని ఎత్తిపోసేలా మూడు పంప్‌హౌస్‌లు సిద్ధం చేసినా, ఆయకట్టుకు నీరిచ్చే సత్తుపల్లి ట్రంక్ పనులు మాత్రం ముందుకు కదలడం లేదు.
మూడు పంప్‌హౌస్‌లు సిద్ధమైనా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.74 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా సీతారామను చేపట్టారు. మూడున్నరేళ్ల కింద మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని చేపట్టారు. రెండు పంప్‌హౌస్‌ల్లో ఆరు మోటార్లను గతేడాదే పూర్తి చేయగా, మూడో పంప్‌హౌస్‌లో 7 మోటార్ల బిగింపు ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయింది. చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలి ఉండగా.. విద్యుత్ సరఫరా చేస్తే నీటిని ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ మూడు పంప్‌హౌస్‌ల పరిధిలో 114 కిలోమీటర్ల ప్రధాన కాల్వ ఉన్నా ఆయకట్టు మాత్రం లేదు.
ఈ ప్రధాన కాల్వ పనులకు సంబంధించే రూ.450 కోట్ల మేర బిల్లులు ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక ప్రాజెక్టులో భాగంగా మూడో పంప్‌హౌస్ దిగువన 116 కిలోమీటర్ల పొడవునా సత్తుపల్లి ట్రంక్ కెనాల్ తవ్వాల్సి ఉంది. దీనిద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరందించడంతో పాటు మరో 22 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని నిర్ణయించారు. ఈ వానాకాలానికే సుమారు లక్ష ఎకరాలకు నీరివ్వాలని ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ ఇంజనీర్లను ఆదేశించారు. అయితే ఇది జరిగి ఆరు నెలలు గడిచినా ఇంతవరకు భూసేకరణకు గానీ, జరిగిన పనులకు గానీ ఒక్క రూపాయి చెల్లించలేదు.
ముందుకు సాగని పనులు
కెనాల్ తవ్వేందుకు 1,650 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 500 ఎకరాలు సేకరించారు. ఇందుకోసం రూ.40 కోట్లు చెల్లించారు. మరో 214 ఎకరాలకు సంబంధించి ప్రభు త్వం నిర్ణయించిన ధరకంటే అధిక ధర పరిహారంగా చెల్లించాలని రైతులు కోర్టుకు వెళ్లడంతో సేకరణ ఆగిపోయింది. ఇక మిగతా భూమిలో కొంతమేర అవార్డు చేసినా, ప్రభుత్వం చెల్లించా ల్సిన రూ.60 కోట్ల విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో కాల్వ పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు సేకరించిన భూమి, అటవీ శాఖ నుంచి బదలాయించిన 1,202 ఎకరాల భూమి పరిధిలోనే ప్రస్తుతం కాల్వ తవ్వకం జరుగుతోంది.
వచ్చే ఏడాది జూన్ నాటికే..!
116 కిలోమీటర్ల కెనాల్ తవ్వకానికి 2.20 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టిపని చేయాల్సి ఉండగా, ఇంతవరకు 52 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే జరిగింది. సుమారు 25 కిలోమీటర్ల మేర కెనాల్ తవ్వకం పూర్తయినా, మిగతా పనుల పూర్తికి భూసేకరణ జరగకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. దీనికి తోడు తవ్విన పనులకు సంబంధిం చిన రూ.45 కోట్ల బిల్లులు ప్రభుత్వం ఆరు నెలలుగా పెండింగ్‌లో పెట్టింది. ఈ నిధుల విడుదలపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు.
ప్రధాన కాల్వ పరిధిలో పనిచేస్తున్న ఏజెన్సీలే ఇక్కడా పనిచేస్తుండగా.. నిధుల విడుదల లేకపోవడంతో సంస్థలు పనివేగాన్ని తగ్గించుకుంటున్నాయి. యంత్రాలను ఇతర ప్రాజెక్టుల పనులకు తరలిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఇతర ప్రాధాన్యత శాఖలకు నిధుల వెచ్చింపు ఎక్కువగా చేస్తుండటంతో వచ్చే ఏడాది జూన్ నాటికే ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment