ఇక ఉత్తరాంధ్రలో గోదారి 'గలగల' | Plan to divert above 63 TMCs of Godavari waters through Uttarandhra Sujala Sravanthi | Sakshi
Sakshi News home page

ఇక ఉత్తరాంధ్రలో గోదారి 'గలగల'

Published Tue, Nov 3 2020 4:13 AM | Last Updated on Tue, Nov 3 2020 4:13 AM

Plan to divert above 63 TMCs of Godavari waters through Uttarandhra Sujala Sravanthi - Sakshi

సాక్షి, అమరావతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పటికే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం.. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను తరలించి.. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చడం ద్వారా ఆ ప్రాంత సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించింది. పోలవరం ఎడమ కాలువ 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి రోజుకు ఎనిమిదివేల క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 63.20 టీఎంసీల నీటిని తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు చేపట్టింది. తొలిదశలో రూ.2,022 కోట్లతో పనులు ప్రారంభించిన ప్రభుత్వం రెండోదశలో రూ.6,265 కోట్లతో రెండు ప్యాకేజీల కింద పనులకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీకి రంగం సిద్ధం చేసింది. అనంతరం దశలవారీగా భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి, గాదిగెడ్డ రిజర్వాయర్లను పూర్తిచేయాలని నిర్ణయించింది. మొత్తం రూ.15,448 కోట్ల వ్యయమయ్యే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టడానికి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ) ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ, జాతీయ ఆర్థికసంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి.. ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయడానికి ప్రణాళిక రచించింది. 

మహానేత వైఎస్‌ మానసపుత్రిక 
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున మూడువేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వాటిలో పోలవరం ఎడమ కాలువ నుంచి 63.20 టీఎంసీలను తరలించడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ పథకానికి 2009 జనవరి 2న గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారు. కానీ.. అంతలోనే మహానేత హఠాన్మరణంతో ఈ పథకం మరుగునపడింది. 

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ఇదీ.. 
► పోలవరం ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి 500 మీటర్ల లింకు కాలువ ద్వారా 1,300 క్యూసెక్కుల నీటిని తరలించి.. జామద్దులగూడెం, పెదపూడిల వద్ద రెండుదశల్లో ఎత్తిపోసి 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్‌కు తరలిస్తారు. 
► ఎడమ కాలువ 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి 23 కిలోమీటర్ల లింక్‌ కాలువ ద్వారా 6,700 క్యూసెక్కులు తరలిస్తారు. 
► పాపాయపాలెం వద్ద ఎత్తిపోసి.. 106 కిలోమీటర్ల పొడవున తవ్వే లిఫ్ట్‌ కాలువ ద్వారా గాదిగెడ్డ రిజర్వాయర్‌కు సరఫరా చేస్తారు.  
► లిఫ్ట్‌ కాలువ 102 కిలోమీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసి కోటగండ్రేడు బ్రాంచ్‌ కాలువ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు తరలిస్తారు. 
► లిఫ్ట్‌ కెనాల్‌ 14 కిలోమీటర్ల వద్ద భూదేవి లిఫ్ట్‌ ద్వారా నీటిని ఎత్తిపోసి 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే భూదేవి రిజర్వాయర్, 48.50 కిలోమీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసి 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీరనారాయణపురం రిజర్వాయర్, 73 కిలోమీటర్ల వద్ద తాడిపూడి లిఫ్ట్‌ ద్వారా తరలించి 3.80 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే తాడిపూడి రిజర్వాయర్‌ నింపుతారు. 
► తొలిదశలో 1.30 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి కాంట్రాక్టర్లకు అప్పగించిన లింక్‌ కెనాల్, జామద్దులగూడెం, పెదపూడి ఎత్తిపోతలు, పెదపూడి రిజర్వాయర్‌ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ జలవనరులశాఖకు దిశానిర్దేశం చేశారు. 
► రెండోదశలో శ్రీకాకుళం జిల్లా వరకు నీటిని తరలించేలా 23 కి.మీ.ల లింక్‌ కెనాల్, 106 కి.మీ.ల లిఫ్ట్‌ కెనాల్, 60 కి.మీ.ల కోటగండ్రేడు బ్రాంచ్‌ కెనాల్‌ పనులు చేపట్టడానికి రూ.6,265 కోట్లు అవసరం. ఇందులో భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ పనులకు రూ.2,344 కోట్లను వెచి్చంచాల్సి ఉంటుంది. రూ.3,921 కోట్లతో లింక్‌ కెనాల్, లిఫ్ట్‌ కెనాల్, బ్రాంచ్‌ కెనాల్‌ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. 
► రెండోదశలో తొలి ప్యాకేజీకి రూ.2,539 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.1,382 కోట్లతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేస్తారు. ఈ పనులకు సమాంతరంగా భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి రిజర్వాయర్లు నిరి్మంచడంతోపాటు గాదిగెడ్డ రిజర్వాయర్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రచార బిల్లులు కూడా చెల్లించని టీడీపీ సర్కార్‌ 
2019 ఎన్నికలకు ముందు ఓట్లకోసం టీడీపీ సర్కార్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలిదశను చేపడుతున్నట్లు ప్రకటించి 2018 నవంబర్‌ 15న శంకుస్థాపన చేసింది. ఆరోజున రూ.1,94,00,404 వెచ్చించి పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలతో ప్రచారం చేసుకుంది. కానీ తట్ట మట్టి కూడా ఎత్తలేదు. ప్రచార ప్రకటనల బిల్లులూ చెల్లించలేదు. ఆ బిల్లులను ఫిబ్రవరి 7న ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement