మా అవసరాలను తీర్చాకే.. కావేరికి గోదావరిని తరలించండి | AP Govt Clears That To Central Govt On Godavari-Penna-Kaveri | Sakshi
Sakshi News home page

మా అవసరాలను తీర్చాకే.. కావేరికి గోదావరిని తరలించండి

Published Tue, Dec 8 2020 5:05 AM | Last Updated on Tue, Dec 8 2020 5:05 AM

AP Govt Clears That To Central Govt On Godavari-Penna-Kaveri - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర అవసరాలు పూర్తిగా తీర్చాకనే గోదావరి జలాలను కావేరి(గ్రాండ్‌ ఆనకట్ట) నదికి మళ్లించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం.. గోదావరిలో మిగులు జలాలపై సంపూర్ణ హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీదేనని గుర్తు చేసింది. గోదావరిలో 75 శాతం నీటిలభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలే ఉండవని, అలాంటప్పుడు ఏ నీటిని కావేరికి మళ్లిస్తారని ప్రశ్నించింది. నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్‌)లో ఎగువ రాష్ట్రాలకున్న కేటాయింపుల నుంచి కొంత వాటాను తీసుకుని.. వాటితో గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానం చేపట్టాలని ప్రతిపాదించింది.

ఈ అనుసంధానంలో ఇచ్చంపల్లి, జానంపేటతోపాటు పోలవరం నుంచి తరలించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి రతన్‌లాల్‌ కటారియా అధ్యక్షతన సోమవారం జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌బ్ల్యూడీఏ) సర్వసభ్య సమావేశం వర్చువల్‌ విధానంలో జరిగింది. గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానంపై వాటి బేసిన్‌ల పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కేరళ జలవనరుల శాఖ అధికారులతో కేంద్రమంత్రి ఈ సందర్భంగా సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.  
 
మా అవసరాలు తీర్చాకనే.. 
గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ మూడు ప్రతిపాదనలు చేసింది. అవి.. 1.ఇచ్చంపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్‌(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరీ(గ్రాండ్‌ ఆనకట్ట), 2.అకినేపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్‌(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్‌ ఆనకట్ట) 3.జానంపేట(గోదావరి)–నాగార్జునసాగర్‌(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్‌ ఆనకట్ట). గోదావరి నుంచి మొత్తం 247 టీఎంసీలను మళ్లించాలని ప్రతిపాదించింది. ఇందులో ఇచ్చంపల్లి, అకినేపల్లిల నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలివ్వాలని ప్రతిపాదించింది. ఇక జానంపేట నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలివ్వాలంది. అయితే ఏపీలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతం నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నాయని, అందువల్ల మా రాష్ట్ర అవసరాలు తీర్చాకనే ఇతర ప్రాంతాలకు గోదావరి జలాల్ని మళ్లించాలని ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు.

బచావత్‌ ట్రిబ్యునల్‌ అంచనాల ప్రకారం 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరిలో మిగులు జలాలు లేనేలేవన్నారు. లేని మిగులు జలాలను కావేరికి ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నీటి లభ్యతపై స్పష్టమైన లెక్కలు తేల్చాలని సూచించారు. ప్రస్తుతం సముద్రంలో కలుస్తున్న జలాల్లో అధిక భాగం ఎగువ రాష్ట్రాలకున్న కేటాయింపుల్లో వినియోగించుకోనివేనన్నారు. ఈ నేపథ్యంలో ఎగువ రాష్ట్రాలకున్న కేటాయింపుల్లో నుంచి కొంత వాటాను తీసుకుని.. వాటితో గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానాన్ని చేపట్టాలన్నారు. కాగా, పోలవరం ఎగువ నుంచి గోదావరి–కృష్ణా–బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌–పెన్నా–కావేరి అనుసంధానం ప్రతిపాదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నారాయణరెడ్డి సూచించారు. దీనివల్ల నదీ పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించవచ్చునన్నారు. ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ అధికారులను కేంద్రమంత్రి ఆదేశించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement