- కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల నిర్ణయం
- నదీజలాల వివాదాలపై అవగాహనకు వచ్చేందుకే...
- ప్రాజెక్టులు తమ పరిధిలోకొస్తే అజమాయిషీ ఎలా అనే దానిపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై అవగాహనకు వచ్చేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు నిర్ణయించాయి. మరో 3, 4 రోజుల్లో వర్షాకాలం మొదలుకానుండటం, ఈ ఏడాది ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తెచ్చుకునే కసరత్తులు మొదలు కావడం, కేంద్రం నోటిఫై చేస్తే ప్రాజెక్టుల నిర్వహణను తామే చేపట్టాల్సి ఉండటంతో ముందుగా ప్రాజెక్టుల పర్యటనకు వెళ్లాలని బోర్డులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జూన్ 4 నుంచి రెండ్రోజులపాటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేపట్టనున్న పర్యటనకు ముందు లేదా ఆ తర్వాత ప్రాజెక్టుల పరిధిలో పర్యటించేలా ప్రణాళిక రచించుకున్నట్లు సమాచారం. కృష్ణా ప్రాజెక్టుల పరిధిలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పరిధిలో నీటి వినియోగం, విడుదల, ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య తీవ్ర విభేదాలు నెలకొనడం తెలిసిందే.
ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చుకోవాలని కృష్ణా బోర్డుపై ఏపీ ఒత్తిడి తెస్తుంటే తెలంగాణ దాన్ని తిరస్కరిస్తోంది. అయితే ఏపీ వాదనకే మొగ్గు చూపిన బోర్డు వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకునేలా కసరత్తు చేస్తోంది. అదే జరిగితే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, భీమా, ఏఎమ్మార్పీ వద్ద మెజరింగ్ పాయింట్లూ బోర్డు నియంత్రణలోకి వెళ్తాయి. ఇందుకోసం ముందుగా సాగర్, శ్రీశైలం, జూరాల డ్యామ్‌ల ఏడాది నిర్వహణ ఖర్చు వివరాలతోపాటు హెడ్ రెగ్యులేటర్‌లు, పంప్‌హౌస్‌లు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, గేట్ల నిర్వహణ, విద్యుత్, జనరేటర్లు, డీజిల్, లిఫ్ట్‌ల వంటి వివరాలన్నింటిపై బోర్డు అంచనాకు రావాల్సి ఉంటుంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చీఫ్ ఇంజనీర్ హోదాలో బోర్డుల చైర్మన్లు లేదా బోర్డు సభ్య కార్యదర్శులకు ఎక్కడైనా పర్యటించే వెసులుబాటు ఉంటుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
4వ తేదీ తర్వాతే బోర్డుల పర్యటనలు!
జూన్ 4 నుంచి రాష్ట్రంలో రెండ్రోజులపాటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటించి కృష్ణా, గోదావరి నదుల పరిధిలోని ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యయనం చేయనుంది. కమిటీ పర్యటనకు ముందే ప్రాజెక్టుల పరిధిలో పర్యటించాలని కృష్ణా బోర్డు మొదట నిర్ణయించింది. అయితే కృష్ణా బోర్డు చైర్మన్ నాథన్ మంగళవారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కమిటీ పర్యటన ముగిశాకే ప్రాజెక్టులను సందర్శించాలని బోర్డు సభ్యులు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు గోదావరి బోర్డు చైర్మన్ రామ్‌శరాణ్ జూన్ రెండో వారంలో ప్రాజెక్టులను సందర్శించి నీటి లభ్యతపై అవగాహనకు రావాలని నిర్ణయించారు.
ప్రాజెక్టులు చుట్టొద్దాం
Published Tue, May 31 2016 12:36 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
Advertisement
Advertisement