ముందే మేల్కొన్న కృష్ణా బోర్డు!
♦ వర్షాకాలం ప్రారంభానికి ముందే నీటి వివాదాలు చక్కదిద్దే కసరత్తు
♦ ఈ నెల 27న బోర్డు సమావేశం.. ఇరు రాష్ట్రాలకు లేఖలు
♦ నీటి వినియోగ ప్రణాళికలు, ప్రోటోకాల్ సిద్ధం చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీల మధ్య తలెత్తుతున్న వివాదాలకు ఆదిలోనే పరిష్కారం చూపే దిశగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రంగంలోకి దిగింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే నీటి వివాదాలకు పరిష్కారం, నీటి వినియోగ, విడుదల ప్రోటోకాల్‌ను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 27న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు బోర్డు శుక్రవారం లేఖలు రాసింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగానే వచ్చే ఏడాది జూన్ వరకు నీటి ప్రణాళికలు ఉండనున్నాయి.
రెండేళ్లుగా..
కృష్ణా జలాల వినియోగం విషయంలో బచావత్ అవార్డు మేరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందు లో ప్రాజెక్టుల వారీ కేటాయింపులున్నా పలు ప్రాజెక్టులు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో వాటా నీటిని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకుంటామని తెలంగాణ స్పష్టం చేసింది. అలాగే ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నియంత్రణ అంశంపైనా వివాదం నడుస్తోంది. దీనిపై గతేడాది ఏకంగా ఇరు రాష్ట్రాల పోలీసులు తలపడేదాకా వెళ్లింది.
అన్ని అంశాలపై చర్చించనున్న బోర్డు
ఇరు రాష్ట్రాలు గతేడాది కేంద్ర ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో కుదుర్చుకున్న అవగాహన మేరకు... కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాజెక్టుల్లో నీటి విడుదల ప్రోటోకాల్‌ను కూడా బోర్డే పర్యవేక్షిస్తుంది. ఇక ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి, విడుదల చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాజెక్టుల అధికారుల నుంచి నీటి అవసరాలపై ఈ కమిటీకి ప్రతిపాదనలు వెళితే... నీటి లభ్యతను బట్టి విడుద లకు అవసరమైన ఆపరేషన్ ప్రోటోకాల్‌ను కమిటీ సిఫార్సు చేస్తుంది. ఆ సిఫార్సులకు అనుగుణంగా బోర్డు తగిన ఆదేశాలు జారీ చేస్తోంది.
అయితే ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నీటిని వాటి సరిహద్దుల్లో ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు కల్పించారు. దీని ప్రకారమే ప్రస్తుత వినియోగం జరుగుతోంది. కానీ ఈ నీటి వినియోగ లెక్కల విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య తేడాలు ఉండటంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే ఇరు రాష్ట్రాలు ఎప్పటికప్పుడు తమ ప్రాజెక్టుల నీటి అవసరాలను బోర్డుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక గతంలో తయారు చేసుకున్న ముసాయిదా గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈలోగా బోర్డు మరోమారు ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపి ఓ ముసాయిదా ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంది. అందులో భాగంగానే ఈనెల 27న ముందస్తు సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే ఇప్పటివరకు ఉన్న విధానాన్నే కొనసాగిస్తారా, లేక మార్పులు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. దీంతోపాటు తెలంగాణ చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులపై ఏపీ అనేక అభ్యంతరాలు లేవనెత్తుతోంది. వాటిపైనా బోర్డు సమావేశంలో చర్చించే అవకాశముంది.