దేశం దృష్టిని ఆకర్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘మిషన్ భగీరథ’ తొలి ఫలాన్ని మెదక్ జిల్లా గజ్వేల్ అందుకోబోతోంది. రూ.1055 కోట్లతో చేపట్టిన ఈ పథకం గజ్వేల్‌లో తుది దశకు చేరుకోగా...దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోనూ కొద్ది నెలల్లోనే పూర్తి చేయడానికి యంత్రాంగం కృషి చేస్తోంది.
ఆగస్టు 7న ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని గజ్వేల్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు సాగుతున్నాయి. గజ్వేల్ దాహార్తి తీరుస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినం కానుకగా 2015 జూన్ 2న గజ్వేల్ వాటర్‌గ్రిడ్‌కు(గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలు) రూ.1055 కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలను తరలించే పైప్‌లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేసి ఈ ప్రాంతానికి అందించాలన్నది లక్ష్యంగా ఉంది.
ఇందులో భాగంగా కొండపాకలోని హెచ్‌ఎండబ్ల్యూఎస్(హైద్రాబాద్ మెట్రో వాటర్ వర్క్)ప్రాంగణం నుంచి, ప్రజ్ఞాపూర్ వద్ద పైప్‌లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేస్తున్నారు. ప్రజ్ఞాపూర్ నుంచి పైప్‌లైన్‌ను ట్యాపింగ్ చేసి ఆ నీటిని ఎత్తైన ప్రదేశంలో ఉన్న గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలోని సంప్‌హౌస్‌కు తరలించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గజ్వేల్ నియోజకవర్గంలోని 244 గ్రామాలు, గజ్వేల్ నగర పంచాయతీతో కలుపుకుని మరో 65 గ్రామాలకు సరఫరా చేస్తున్నారు.
- 14 మండలాలు.. 3 మున్సిపాలిటీలు
గోదావరి జలాలను గజ్వేల్‌తో పాటు దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని 14 మండలాల్లోగల 590 హాబిటేషన్లకు, మరో 3 మున్సిపాలిటీలకు నీటిని అందిస్తున్నారు. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో 793.76 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్ల నిర్మాణం జరిగింది. 67, 275 నల్లా కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యంగా ఉండగా ఇప్పటి వరకు 60,724 కనెక్షన్లను ఇవ్వగలిగారు. ప్రస్తుతం 106 గ్రామాల్లో న్యితం నల్లాల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 213 గ్రామాలకుగానూ 63,517 నల్లా కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 7,450 కనెక్షన్లు ఇచ్చారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 134 గ్రామాల్లో 42,168 నల్లా కనెక్షన్లకుగానూ ఇప్పటి వరకు 2,623 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో పనులు పూర్తి కావడానికి మరో నాలుగు నెలలు పట్టే అవకాశముంది.
దేశం దృష్టిని ఆకర్షించిన పథకం...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. పథకం తీరును పరిశీలించేందుకు ఎంతో మంది ప్రముఖులు గజ్వేల్‌కు వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో రెండ్రోజుల క్రితం గజ్వేల్‌లో పథకం తీరును ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరించి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించడం...ఆయన సానుకూలంగా స్పందించటం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి ఆగస్టు 7న ఇక్కడ పర్యటించి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది.