సాక్షి, అమరావతి: సముద్రం పాలయ్యే గోదావరి వరద జలాలను దుర్భిక్ష ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన పోలవరం – బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) అనుసంధానం పనులను నాలుగేళ్లలో పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీనికి నిధుల సేకరణ, పర్యవేక్షణకు ప్రత్యేక సంస్థ (స్పెషల్ పర్పస్ వెహికల్)ను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ(ఆసియా అభివృద్ది బ్యాంకు), జైకా (జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ), ఎఫ్‌ఎఫ్‌సీ (పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్), నాబార్డు (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) తదితరాల నుంచి ఎస్పీవీ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు సమీకరించాలని నిర్ణయించారు. ఈ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించకుండా గోదావరి జలాలను దుర్భిక్ష ప్రాంతాలకు తరలించేందుకు మాత్రమే వెచ్చించనున్నారు. పనుల పర్యవేక్షణ బాధ్యత కూడా ఎస్పీవీకే అప్పగించనున్నారు. మార్చి లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అనుసంధానం పనులను శరవేగంగా పూర్తి చేయడం ద్వారా రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి..
ధవళేశ్వరం నుంచి ఏటా సగటున 3,000 టీఎంసీల గోదావరి జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని కృష్ణా బేసిన్‌లోని దుర్భిక్ష ప్రాంతాలకు మళ్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వ్యాప్కోస్‌కు అప్పగించారు. వ్యాప్కోస్ నివేదికపై ఈనెల 20న సమీక్షించిన సీఎం జగన్ తక్కువ వ్యయంతో గోదావరి వరద జలాలను గరిష్టంగా తరలించడంపై అధ్యయనం చేసి అంచనాలు (ఎస్టిమేట్లు) తయారు చేయాలని ఆదేశించారు. జలవనరుల శాఖ ద్వారా అంచనాలు ప్రభుత్వానికి చేరాక పరిశీలించి పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతి మంజూరు చేయనున్నారు. అనంతరం పనులను ప్యాకేజీలుగా విభజించి జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ‘ఈ–ఆక్షన్’ (రివర్స్ టెండరింగ్) ద్వారా తక్కువ ధరకు పనులు చేసేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. ఈ ప్రక్రియను మూడు నెలలలోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment