సిద్దిపేట మున్సిపాలిటీకి అరుదైన గౌరవం
సిద్దిపేట జోన్(మెదక్): తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్న మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీకి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన ఆయా మునిసిపాలిటీల నుంచి క్లీన్ ఛాంపియన్షిప్ అవార్డు కోసం క్లీన్ ఇండియా సంస్థ మూడు మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి సిద్దిపేట మున్సిపాలిటీకి స్థానం దక్కింది. స్వచ్ఛ భారత్ ప్రక్రియలో భాగంగా స్వచ్ఛమైన పట్టణంగా తీర్చి దిద్దినందుకుగాను సిద్దిపేట మున్సిపాలిటీకి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, ప్రముఖ సినీ నటి అమల చేతుల మీదుగా హైదరాబాద్‌లో అవార్డును అందజేశారు.
ఈ అవార్డును ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిధుల చేతుల మీదుగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమాణాచారి అవార్డును స్వీకరించారు. సిద్దిపేట పట్టణంలో రాష్ట్రంలోనే తొలి ప్రక్రియగా తడి, పొడి చెత్త సేకరణ, ప్లాస్టిక్ కవర్ల నిషేధం, హరిత హారంలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ, ‘వావ్’ ప్రక్రియలో భాగంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టిన నేపథ్యంలో మున్సిపాలిటీలకు అవార్డును అందజేశారు.