జర్నలిస్టుల హత్యలు పెరిగిపోతున్నాయి | Murders of journalists is increasing | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల హత్యలు పెరిగిపోతున్నాయి

Published Wed, Jan 3 2018 3:47 AM | Last Updated on Wed, Jan 3 2018 3:47 AM

Murders of journalists is increasing - Sakshi

ప్రింట్‌ మీడియా విభాగంలో తృతీయ బహుమతి అందుకుంటున్న ‘సాక్షి’ పెద్దపల్లి ఆర్‌సీ ఇన్‌చార్జి కట్ట నరేంద్రచారి. చిత్రంలో మంత్రులు తుమ్మల, హరీశ్, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ ∙ ఎలక్ట్రానిక్‌ మీడియా విభాగంలో ప్రథమ బహుమతితో ‘సాక్షి’ టీవీ అసోసియేట్‌ ఔట్‌పుట్‌ ఎడిటర్‌ యాజులు

హైదరాబాద్‌: జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయిందని రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత, ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ తెలుగు వర్సిటీ ఎన్టీఆర్‌ కళా మందిరంలో ప్రముఖ జర్నలిస్ట్‌ అరుణ్‌సాగర్‌ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రెస్‌ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో సాయినాథ్‌ మాట్లాడారు. అవినీతికి, కుంభకోణాలకు వ్యతిరేకంగా కథనాలు రాసే జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారని.. ఈ హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్ట్రింగర్లు, ఫ్రీలాన్స్‌ జర్నలిస్టులే హత్యకు గురైన వారిలో ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. 1992–2016 మధ్యకాలంలో 50 మంది జర్నలిస్టులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. అనంతరం మీడియా సంక్షోభం గురించి మాట్లాడారు.

విద్య సంస్కారాన్ని, సామాజిక బాధ్యతను నేర్పుతుందని.. ఈ రెండు అంశాలకు అరుణ్‌ సాగర్‌ జీవితం నిలువుటద్దమని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధి వంటి వారన్నారు. పెరిగిపోయిన పోటీతత్వంతో జర్నలిస్టులు ఒత్తిడికి గురై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా వారికి హెల్త్‌కార్డులు ఇచ్చామన్నారు. అరుణ్‌సాగర్‌ మరణం జర్నలిజానికి తీరని లోటని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  

ఉత్తమ జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం 
ఉత్తమ జర్నలిస్టులకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ అవార్డులు ప్రదానం చేశారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్నకు అరుణ్‌ సాగర్‌ సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రథమ బహుమతి ‘సాక్షి’టీవి అసోసియేట్‌ ఔట్‌ పుట్‌ ఎడిటర్‌ యాజులు (ఖాకీలు చింపిన బస్తర్‌)కు, ప్రింట్‌ మీడియాలో తృతీయ బహుమతి ‘సాక్షి’పెద్దపల్లి ఆర్‌సీ ఇన్‌చార్జి కట్ట నరేంద్రచారి (వారికి ఒక రోజు వెలుగులు)కి లభించాయి. అలాగే ఎలక్ట్రానిక్‌ మీడియాలో ద్వితీయ బహుమతి హెచ్‌ఎంటీవీ మహబూబ్‌నగర్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌ నరేంద్రచారి (ఆ నలుగురు పిల్లల కథనం)కు, తృతీయ బహుమతి ఈటీవీ ఆదిలాబాద్‌ విలేకరి మాణికేశ్వర రావు (అరణ్యవాసం)కు లభించాయి.

ప్రింట్‌ మీడియాలో ప్రథమ బహుమతి ‘నమస్తే తెలంగాణ’అంబర్‌పేట్‌ జోన్‌ విలేకరి వర్కాల కిష్టయ్య (మరణము శాపమేనా)కు, ద్వితీయ బహుమతి ‘నవ తెలంగాణ’మహబూబ్‌నగర్‌ విలేకరి శివరామ కృష్ణ (తెలంగాణ ఎడారి బతుకు చిత్రం)కు, మరో తృతీయ బహుమతి ‘ఆంధ్రజ్యోతి’హుజూరాబాద్‌ విలేకరి కోల నాగేశ్వరరావు (గిరిజన కన్నీటి సాగరం)ను వరించాయి. వీరందరినీ హరీశ్‌రావు అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్, నమస్తే తెలంగాణ సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి, టీవీ–5 ప్రతినిధి వసంత్, కవి కె.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement