సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్, కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప, ఏపీ మంత్రి అనిల్ కుమార్
సాక్షి, అమరావతి: సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను ఒడిసి పట్టి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గోదావరి–కృష్ణా (బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్)– పెన్నా నదుల అనుసంధానానికి నిధులివ్వాలంటూ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చేసిన వి/æ్ఞప్తిపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పంపితే పరిశీలించి నిధులిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులతో జల్ శక్తి అభియాన్, సాగు, తాగునీటి ప్రాజెక్టులు, స్వచ్ఛ భారత్ తదితర పథకాలపై గజేంద్రసింగ్ షెకావత్ సమావేశం నిర్వహించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ కృష్ణారెడ్డి తదితరులు దీనికి హాజరయ్యారు.
మూడు రాష్ట్రాలకు ప్రయోజనం
గోదావరి నుంచి ఏటా సగటున 2,500 టీఎంసీలకుపైగా సముద్రంలో కలుస్తున్నాయని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. నీటి లభ్యత నానాటికీ తగ్గుతుండటం, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానాన్ని చేపట్టాలని నిర్ణయించిందని చెప్పారు. డీపీఆర్ రూపకల్పన బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించామన్నారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానం వల్ల తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు ప్రయోజనం చేకూరుతుందని, ఈ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.
వాటర్ గ్రిడ్‌కు సహకారం..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ రోజూ పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు నీటిని అందచేసే వాటర్ గ్రిడ్ పథకానికి నిధులివ్వాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ కోరారు. అయితే 55 లీటర్ల నీటి సరఫరాకు అయ్యే వ్యయాన్ని మాత్రమే కేంద్రం ఇస్తుందని, అంతకంటే ఎక్కువ పరిమాణంలో నీటిని అందించడానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో శుద్ధి చేసి ఇళ్లకు సరఫరా చేయాలని వ్యయం తగ్గుతుందని సూచించారు. వాటర్ గ్రిడ్‌కు అవసరమైతే విదేశీ ఆరి్థక సంస్థల ద్వారా రుణం అందించేందుకు సహకరిస్తామని చెప్పారు.
త్వరలో మిగతా నిధులు..
పోలవరానికి మిగతా రూ.3,222.75 కోట్లను కూడా రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి టి.రాజేశ్వరిని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఆదిత్యనాథ్ దాస్ కోరారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖకు పంపామని, త్వరలోనే నిధులు విడుదలయ్యేలా చూస్తామని టి.రాజేశ్వరి పేర్కొన్నారు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి రూ.రెండు వేల కోట్ల బిల్లులను మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment