Godavari-Krishna Basin
-
శరవేగంగా నదుల అనుసంధానం..
-
అనుసంధానంతో సస్యశ్యామలం
సాక్షి, అమరావతి: గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే తమ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను గరిష్ఠంగా ఒడిసి పట్టి, కనిష్ఠ వ్యయంతో తక్కువ సమయంలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి తరలించడంపై సమగ్రంగా అధ్యయనం చేసి.. నెలలోగా నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖాధికారులను ఆయన ఆదేశించారు. పోలవరంతోపాటు వెలిగొండ, వంశధార, తోటపల్లి తదితర ప్రాజెక్టులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. రాయలసీమ కరువు నివారణ కోసం ప్రాజెక్టుల కాలువల విస్తరణతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులను చేపట్టి శరవేగంగా పూర్తిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు. పోలవరం, గండికోట, వెలిగొండ ప్రాజెక్టుల నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ సామర్థ్యాన్ని మరో రెండు టీఎంసీలకు పెంచి, రోజుకు రెండు టీఎంసీల చొప్పున గోదావరి వరద జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించి, అక్కడి నుంచి బొల్లాపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు తరలించి.. అక్కడి నుంచి బీసీఆర్ (బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్)లోకి తరలించే ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శరవేగంగా నదుల అనుసంధానం.. తక్కువ ఖర్చుతో గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం.. అధికంగా జలాల తరలింపు.. శరవేగంగా పనులు పూర్తయ్యే మార్గాలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ విస్తృతంగా చర్చించారు. పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి తరలించే గోదావరి జలాలను.. అక్కడ నుంచి ‘రివర్స్ పంపింగ్’ ద్వారా పులిచింతల ప్రాజెక్టులోకి.. మళ్లీ అక్కడి నుంచి టెయిల్ పాండ్‌లోకి.. ఆ తర్వాత సాగర్‌లోకి.. అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోసే అంశంపై కూడా అధ్యయనం చేయాలని అధికారులకు వైఎస్ జగన్ సూచించారు. నదిలో జలాలను తరలించడంవల్ల భూసేకరణ సమస్య ఉత్పన్నం కాదని.. దీనివల్ల వ్యయం కూడా తగ్గుతుందన్నారు. దీనిపై నెలలోగా నివేదిక ఇవ్వాలని.. దాని ఆధారంగా నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పారు. కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గుతున్న నేపథ్యంలో.. ఆ జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు గోదావరి జలాలను తరలించి.. కరువురహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. పోలవరం నిధులు రాబట్టండి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రీయింబర్స్ చేసిన రూ.1,850కోట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సోమవారం చేరాయని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన మిగిలిన రూ.3,823 కోట్లను కూడా రీయింబర్స్ చేయాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల ఆమోదం ప్రక్రియ కూడా తుదిదశకు చేరుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి, పోలవరానికి నిధులు రాబట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయాలని సీఎం చెప్పారు. అలాగే, జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. పోలవరం, గండికోట, వెలిగొండ, సీబీఆర్ (చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) తదితర ప్రాజెక్టుల నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ప్రాజెక్టుల పనులను క్షేత్రస్థాయిలో తాను పరిశీలిస్తానని, ఇందులో భాగంగా ఈనెల 19న వెలిగొండ ప్రాజెక్టు.. 27న పోలవరం పనులను తనిఖీ చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. కరువు నివారణకు రూ.33,869 కోట్లు కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లో ఆ వరద జలాలను ఒడిసి పట్టేలా రాయలసీమ ప్రాజెక్టుల కాలువల సామర్థ్యాన్ని పెంచడం.. కరువు నివారణ పనులకు రూ.33,869 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. దీంతో ఆ పనులకు పరిపాలన అనుమతులిచ్చి.. టెండర్లు పిలవాలని ఆయన ఆదేశించారు. అలాగే.. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి.. కొత్తగా ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రాధాన్యత ప్రాజెక్టు కింద చేపట్టాలన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.15,488 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని అధికారులు వివరించగా.. ఈ పనులూ చేపట్టడానికి అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం నుంచి విశాఖకు నీటిని తరలించే నిమిత్తం పైప్‌లైన్ వేయడానికీ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. -
డీపీఆర్ ఇస్తే నిధులు!
సాక్షి, అమరావతి: సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను ఒడిసి పట్టి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గోదావరి–కృష్ణా (బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్)– పెన్నా నదుల అనుసంధానానికి నిధులివ్వాలంటూ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చేసిన వి/æ్ఞప్తిపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పంపితే పరిశీలించి నిధులిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులతో జల్ శక్తి అభియాన్, సాగు, తాగునీటి ప్రాజెక్టులు, స్వచ్ఛ భారత్ తదితర పథకాలపై గజేంద్రసింగ్ షెకావత్ సమావేశం నిర్వహించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి తదితరులు దీనికి హాజరయ్యారు. మూడు రాష్ట్రాలకు ప్రయోజనం గోదావరి నుంచి ఏటా సగటున 2,500 టీఎంసీలకుపైగా సముద్రంలో కలుస్తున్నాయని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. నీటి లభ్యత నానాటికీ తగ్గుతుండటం, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానాన్ని చేపట్టాలని నిర్ణయించిందని చెప్పారు. డీపీఆర్ రూపకల్పన బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించామన్నారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానం వల్ల తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు ప్రయోజనం చేకూరుతుందని, ఈ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. వాటర్ గ్రిడ్‌కు సహకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ రోజూ పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు నీటిని అందచేసే వాటర్ గ్రిడ్ పథకానికి నిధులివ్వాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ కోరారు. అయితే 55 లీటర్ల నీటి సరఫరాకు అయ్యే వ్యయాన్ని మాత్రమే కేంద్రం ఇస్తుందని, అంతకంటే ఎక్కువ పరిమాణంలో నీటిని అందించడానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో శుద్ధి చేసి ఇళ్లకు సరఫరా చేయాలని వ్యయం తగ్గుతుందని సూచించారు. వాటర్ గ్రిడ్‌కు అవసరమైతే విదేశీ ఆరి్థక సంస్థల ద్వారా రుణం అందించేందుకు సహకరిస్తామని చెప్పారు. త్వరలో మిగతా నిధులు.. పోలవరానికి మిగతా రూ.3,222.75 కోట్లను కూడా రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి టి.రాజేశ్వరిని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఆదిత్యనాథ్ దాస్ కోరారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖకు పంపామని, త్వరలోనే నిధులు విడుదలయ్యేలా చూస్తామని టి.రాజేశ్వరి పేర్కొన్నారు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి రూ.రెండు వేల కోట్ల బిల్లులను మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. -
వాటర్‌గ్రిడ్‌లో గోదావరి–కృష్ణా లింక్!
► అవకాశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ ఆదేశం ► మిషన్ భగీరథ వెబ్సైట్, మొబైల్ యాప్ ఆవిష్కరణ ► డిసెంబర్‌లోగా ప్రతి గ్రామానికీ రక్షిత మంచినీరిస్తామని వెల్లడి ► ఇంజనీర్లు, ఉద్యోగులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించిన మంత్రి సాక్షి, హైదరాబాద్: గోదావరి–కృష్ణా బేసిన్లను అనుసంధానిస్తూ మిషన్ భగీరథలో తాగునీటి గ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇంటర్ కనెక్టివిటీ గ్రిడ్ ఏర్పాటుతో మిషన్ భగీరథ ప్రపంచస్థాయి ప్రాజెక్టుగా మారుతుందన్నారు. శుక్రవారం ఇక్కడి గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య సంస్థ (ఆర్డబ్ల్యూఎస్ఎస్) కార్యాలయంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు వెబ్సైట్, మొబైల్ యాప్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. రూ. కోటి ప్రపంచ బ్యాంక్ రుణంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులే మొబైల్ యాప్, వెబ్‌సైట్‌ను రూపొందించడం అభినందనీయ మన్నారు. వీటి ద్వారా మిషన్ భగీరథ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు వినియోగదారుల భాగస్వామ్యానికి కూడా అవకాశముంటుందన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. తాగునీటి రంగంలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించేందుకు మిషన్ భగీరథకు సీఎం రూపకల్పన చేశారని, దాన్ని ఆర్డబ్ల్యూఎస్ అద్భుతంగా ఆచరణలో పెడుతోందని కేటీఆర్ ప్రశంసించారు. ప్రధాని మోదీ కూడా ఈ ప్రాజెక్టును ఎంతగానో మెచ్చుకుంటున్నారని, ఇందుకు అధికారులు, ఇంజనీర్ల పనితీరే కారణమన్నారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శ నమూనగా మారిం దని, ఇప్పటికే 9 రాష్ట్రాల ప్రతినిధులు మిషన్ భగీరథ గురించి తెలుసుకోవడానికి వచ్చారన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా ప్రతి గ్రామానికీ రక్షిత మంచినీటిని అందిస్తామన్న కేటీఆర్...భగీరథ పైప్లైన్లతోపాటు ఆప్టిక్ ఫైబర్ డక్ట్‌ను వేస్తున్నామని, త్వరలోనే రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ను అందుబా టులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం డబుల్ బెడ్రూం కాలనీలకు కూడా మంచినీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన గడువులోగానే ప్రాజెక్టును పూర్తిచేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా భగీరథ ఇంజనీర్లు, ఉద్యోగులతో కేటీఆర్ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ్ హీ సేవా’ నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.