వాటర్‌గ్రిడ్‌లో గోదావరి–కృష్ణా లింక్!
► అవకాశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ ఆదేశం
► మిషన్ భగీరథ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ఆవిష్కరణ
► డిసెంబర్‌లోగా ప్రతి గ్రామానికీ రక్షిత మంచినీరిస్తామని వెల్లడి
► ఇంజనీర్లు, ఉద్యోగులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కృష్ణా బేసిన్‌లను అనుసంధానిస్తూ మిషన్ భగీరథలో తాగునీటి గ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇంటర్ కనెక్టివిటీ గ్రిడ్ ఏర్పాటుతో మిషన్ భగీరథ ప్రపంచస్థాయి ప్రాజెక్టుగా మారుతుందన్నారు. శుక్రవారం ఇక్కడి గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య సంస్థ (ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్) కార్యాలయంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు.
రూ. కోటి ప్రపంచ బ్యాంక్ రుణంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులే మొబైల్ యాప్, వెబ్‌సైట్‌ను రూపొందించడం అభినందనీయ మన్నారు. వీటి ద్వారా మిషన్ భగీరథ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు వినియోగదారుల భాగస్వామ్యానికి కూడా అవకాశముంటుందన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. తాగునీటి రంగంలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించేందుకు మిషన్ భగీరథకు సీఎం రూపకల్పన చేశారని, దాన్ని ఆర్‌డబ్ల్యూఎస్ అద్భుతంగా ఆచరణలో పెడుతోందని కేటీఆర్ ప్రశంసించారు.
ప్రధాని మోదీ కూడా ఈ ప్రాజెక్టును ఎంతగానో మెచ్చుకుంటున్నారని, ఇందుకు అధికారులు, ఇంజనీర్ల పనితీరే కారణమన్నారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శ నమూనగా మారిం దని, ఇప్పటికే 9 రాష్ట్రాల ప్రతినిధులు మిషన్ భగీరథ గురించి తెలుసుకోవడానికి వచ్చారన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా ప్రతి గ్రామానికీ రక్షిత మంచినీటిని అందిస్తామన్న కేటీఆర్...భగీరథ పైప్‌లైన్లతోపాటు ఆప్టిక్ ఫైబర్ డక్ట్‌ను వేస్తున్నామని, త్వరలోనే రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్‌ను అందుబా టులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం డబుల్ బెడ్‌రూం కాలనీలకు కూడా మంచినీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన గడువులోగానే ప్రాజెక్టును పూర్తిచేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా భగీరథ ఇంజనీర్లు, ఉద్యోగులతో కేటీఆర్ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ్ హీ సేవా’ నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.