Mission Bhagirath
-
రబీ ఆశలు సజీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు రబీలో నీరిచ్చే అవకాశాలు సజీవమయ్యాయి. కొన్ని ప్రాజెక్టుల పరిధిలో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటిలభ్యత ఉండటంతో అక్కడ తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే, మిగతా నీటిని రబీ అవసరాలకు ఇవ్వాలని రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ (శివమ్) నిర్ణయించింది. ఎస్సారెస్పీ, కడెం, నాగార్జున సాగర్ పరిధిలో నిర్ణీత ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉండగా, నిజాంసాగర్, సింగూరు, జూరాల ప్రాజెక్టు ల్లో నిల్వలు ఆశించినంత లేని కారణంగా కింది ఆయకట్టుకు నీటి విడుదల చేయరాదని నిర్ణయించింది. తొలి ప్రాధాన్యం తాగునీటికే... రాష్ట్రంలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు గురువారం శివమ్ కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రత్యేకంగా భేటీ అయింది. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్‌కుమార్‌తోపాటు అన్ని ప్రాజెక్టులు, జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. మిషన్ భగీరథ కింద తాగు అవసరాలు, కనీస నీటిమట్టాలకు ఎగువన ఉండే లభ్యత జలాల లెక్కలపై భేటీలో చర్చించారు. ప్రభుత్వం మిషన్ భగీరథ కింద తాగునీటికి ప్రాధాన్యతిస్తున్న దృష్ట్యా, ఆ అవసరాల మేరకు కనీస నీటి మట్టాలను నిర్వహించాల్సిందేనని ఈఎన్సీలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఆయకట్టు నుంచి నీటి విడుదల కోసం రైతుల నుంచి వస్తున్న డిమాండ్లపై చర్చ జరిగింది. ఎస్సారెస్పీలో తాగునీటి కోసం పక్కన పెట్టగా కాకతీయ కెనాల్‌కు 15 టీఎంసీల నీటిని పంటలకు సప్లిమెంటేషన్ చేసేలా విడుదల చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నీటితో కనిష్ఠంగా 2 నుంచి 3 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. ఇక లక్ష్మి కెనాల్, సరస్వతి కెనాల్ కింద చెరో 1.6 టీఎంసీల నీటితో 40వేల ఎకరాలకు ఇవ్వవచ్చని వివరించారు. దీనికి శివమ్ కమిటీ ఓకే చెప్పింది. ఇక కడెం కింద సైతం 2 టీఎంసీలతో గూడెం లిఫ్ట్ ద్వారా 20వేల ఎకరాలకు నీరిచ్చేందుకు సమ్మతించింది. నాగార్జునసాగర్ కింద ప్రస్తుతం 23 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నందున దీనిద్వారా కనిష్టంగా 2.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయం జరిగినట్లుగా తెలిసింది. అయితే ఎన్ని తడులకు ఇవ్వాలి, ఎన్ని కిలోమీటర్ల వరకు ఇవ్వాలన్న దానిపై తుది నిర్ణయం ఇంకా చేయలేదు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాలు, గడ్డెన్నవాగు కింద మరో 2వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. -
భగీరథ అక్రమాలపై విచారణ చేపట్టాలి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనుల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు బీసీ సంక్షేమ సం ఘం ఆరోపించింది. పనుల్లో నాణ్యత లోపిం చిందని, దీంతో ప్రజాధనం అధిక మొత్తంలో వృథా అయిందని మండిపడింది. రూ.48 వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కయ్యారని పేర్కొంది. మిషన్ భగీరథ అక్రమాలపై శాసనసభా కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సీఎం కేసీఆర్‌కు ఆదివారం లేఖ రాశారు. ఈ పనుల్లో నాసిరకం పైపులు వాడుతున్నారని తెలిపారు. గ్రామ శివారు వరకు కొత్త పైపులు వేస్తుండగా.. గ్రామం, పట్టణాల్లో మాత్రం పాత పైపులను వినియోగిస్తున్నారన్నారు. సిమెంటు పైపుల్లో నాణ్యత పాటించడం లేదని పేర్కొన్నారు. -
కేసీఆర్‌ను తరిమికొట్టే రోజులొచ్చాయ్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులొచ్చాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలను పూర్తిగా విస్మరించి కేవలం తన కుటుంబ క్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకే తాము బస్సుయాత్ర చేపట్టామని, ఈ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూసి టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. తెలంగాణలో ఉన్న సెటిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని ఉత్తమ్ కోరారు. మిషన్ భగీరథ పేరుతో కమీషన్లను బాగా తిన్న కేటీఆర్ కళ్లు నెత్తికెక్కి పొగరుబోతు మాటలు మాట్లాడుతున్నాడని ఉత్తమ్ అన్నారు. కేటీఆర్‌ను తిట్టేందుకు రేవంత్‌రెడ్డే సరైనోడని అన్నారు. తనపై కేసులున్నాయని, 2014 ఎన్నికలలో డబ్బులు దొరికాయని కేటీఆర్ పదేపదే అంటున్నారని, ఈ కేసును హైకోర్టు కూడా కొట్టివేసిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎన్నికల తర్వాత ఏదో వాహనంలో రూ.1.75 లక్షల రూపాయలు దొరికితే ఆ డబ్బు తనదని పెట్టిన కేసులో నిజం లేదని కోర్టు కొట్టివేసిందని చెప్పారు. బచ్చా కాదు... లుచ్చా ఈ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, బచ్చా అంటే ఊరుకోనని కేటీఆర్ అంటున్నారని, అందుకే ఆయన బచ్చా కాదు లుచ్చా అని అంటున్నామని, ఏం చేస్తాడో చేసుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీపై అడ్డగోలు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మీద కేసులున్నాయని కేటీఆర్ పదేపదే బ్లాక్మెయిల్ చేస్తున్నారని, మా మీద కేసులుంటే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్‌లో చేరిన శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్‌తో పాటు ఎల్లారెడ్డి, నిజామాబాద్‌ల నుంచి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఉత్తమ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ ప్రధాన పనులు పూర్తి
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రధాన పనులు పూర్తయినందున ఇక నుంచి ఇంట్రా(అంతర్గత సరఫరా) పనుల మీద దృష్టిపెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇంట్రా పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రధాన పనులు చేసిన వర్క్ ఏజెన్సీల సహకారం తీసుకుంటామని చెప్పారు. వేముల ప్రశాంత్‌రెడ్డి మిషన్ భగీరథపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటిదాకా అయిన ఇంట్రా పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంట్రా పనుల కోసం ప్రత్యేకంగా ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు ఉన్నందున పనుల్లో మరింత వేగం చూపించాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంట్రా విలేజ్ పనులు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. -
వాటర్‌గ్రిడ్‌లో గోదావరి–కృష్ణా లింక్!
► అవకాశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ ఆదేశం ► మిషన్ భగీరథ వెబ్సైట్, మొబైల్ యాప్ ఆవిష్కరణ ► డిసెంబర్‌లోగా ప్రతి గ్రామానికీ రక్షిత మంచినీరిస్తామని వెల్లడి ► ఇంజనీర్లు, ఉద్యోగులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించిన మంత్రి సాక్షి, హైదరాబాద్: గోదావరి–కృష్ణా బేసిన్లను అనుసంధానిస్తూ మిషన్ భగీరథలో తాగునీటి గ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇంటర్ కనెక్టివిటీ గ్రిడ్ ఏర్పాటుతో మిషన్ భగీరథ ప్రపంచస్థాయి ప్రాజెక్టుగా మారుతుందన్నారు. శుక్రవారం ఇక్కడి గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య సంస్థ (ఆర్డబ్ల్యూఎస్ఎస్) కార్యాలయంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు వెబ్సైట్, మొబైల్ యాప్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. రూ. కోటి ప్రపంచ బ్యాంక్ రుణంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులే మొబైల్ యాప్, వెబ్‌సైట్‌ను రూపొందించడం అభినందనీయ మన్నారు. వీటి ద్వారా మిషన్ భగీరథ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు వినియోగదారుల భాగస్వామ్యానికి కూడా అవకాశముంటుందన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. తాగునీటి రంగంలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించేందుకు మిషన్ భగీరథకు సీఎం రూపకల్పన చేశారని, దాన్ని ఆర్డబ్ల్యూఎస్ అద్భుతంగా ఆచరణలో పెడుతోందని కేటీఆర్ ప్రశంసించారు. ప్రధాని మోదీ కూడా ఈ ప్రాజెక్టును ఎంతగానో మెచ్చుకుంటున్నారని, ఇందుకు అధికారులు, ఇంజనీర్ల పనితీరే కారణమన్నారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శ నమూనగా మారిం దని, ఇప్పటికే 9 రాష్ట్రాల ప్రతినిధులు మిషన్ భగీరథ గురించి తెలుసుకోవడానికి వచ్చారన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా ప్రతి గ్రామానికీ రక్షిత మంచినీటిని అందిస్తామన్న కేటీఆర్...భగీరథ పైప్లైన్లతోపాటు ఆప్టిక్ ఫైబర్ డక్ట్‌ను వేస్తున్నామని, త్వరలోనే రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ను అందుబా టులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం డబుల్ బెడ్రూం కాలనీలకు కూడా మంచినీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన గడువులోగానే ప్రాజెక్టును పూర్తిచేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా భగీరథ ఇంజనీర్లు, ఉద్యోగులతో కేటీఆర్ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ్ హీ సేవా’ నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. -
చకచకా ‘భగీరథ’
♦ పాలేరు సెగ్మెంట్లో పూర్తికావొచ్చిన పనులు ♦ రూ.578కోట్ల వ్యయంతో నిర్మాణాలు ♦ 7.20లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు కూసుమంచి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు చకచకా సాగుతున్నాయి. ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించాలనే ఉద్దేశంతో పాలేరు సెగ్మెంట్లో చేపట్టిన పనులు మరో రెండు నెలల్లో పూర్తి కానున్నాయి. పాలేరు రిజర్వాయర్ నీటి ఆధారంగా రూ.578కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. పనులన్నీ సక్రమంగా పూర్తయితే 370 ఆవాస గ్రామాలతోపాటు ఖమ్మం నగరంతో కలిపి మొత్తం 7.20లక్షల మందికి రోజుకు ఒక్కొక్కరికి 100 లీటర్ల చొప్పున శుద్ధి చేసిన జలాలను నల్లాల ద్వారా సరఫరా చేయనున్నారు. దీంతో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. జిల్లాలో చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో పాలేరు సెగ్మెంట్ పనులు ముందంజలో ఉండగా.. ఇటీవల పాలేరులో నిర్మించిన ఇన్‌టేక్‌వెల్ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించిన విషయం విదితమే. కాగా.. భగీరథ పనులను ఏప్రిల్‌లోగా పూర్తి చేసి సెగ్మెంట్లోని అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. తుది దశకు ఇన్‌టేక్‌వెల్.. మిషన్ భగీరథ ద్వారా పాలేరు సెగ్మెంట్లో ప్రజలకు తాగునీరు అందించేందుకు రిజర్వాయర్ వద్ద భారీ ఇన్‌టేక్‌వెల్ నిర్మించారు. దీని పనులు పూర్తికాగా.. అందులో మోటార్లు అమర్చటమే మిగిలి ఉంది. వాటిని వచ్చే నెలలో పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా.. పథకం కొరకు ప్రత్యేకంగా విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించగా.. ఆ పనులు పూర్తయ్యాయి. ఇన్‌టేక్‌వెల్(బావి) నిర్మాణం 55 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు, 14 అడుగుల ఎత్తుతో చేపట్టారు. ఇందుకోసం అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ ఇన్‌టేక్‌వెల్ నుంచి ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్మించే పథకాలకు పాలేరు నీటిని సరఫరా చేయనున్నారు. జీళ్లచెరువులో హెడ్‌వర్క్స్ పనులు మిషన్ భగీరథ పాలేరు సెగ్మెంట్లో భాగంగా జీళ్లచెరువు శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో పథకం నిర్మాణాలు చేపట్టారు. పనులను 2015 నవంబర్‌లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆయా పనుల్లో భాగంగా రోజుకు 90 ఎంఎల్టీ(మిలియన్ లీటర్లు) నీటిని సరఫరా చేసే సామర్థ్యంతో భారీ ఆర్ఎస్ఎఫ్(ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ హౌస్) నిర్మాణం చేపట్టగా.. పనులు పూర్తికావొచ్చాయి. దీంతోపాటు 4 ఫ్యాక్యులేటర్లు, ఏరియోటర్ పనులు కూడా పూర్తయ్యాయి. జీళ్లచెరువులోని గుట్టపైన తాగునీటి సరఫరా కోసం 1000, 500, 250కేఎల్ సామర్థ్యంలో మూడు జీఎల్‌బీఆర్ ట్యాంకులు నిర్మిస్తుండగా.. వాటి పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు నేలకొండపల్లి, కూసుమంచి, రఘునాథపాలెం మండలాల్లో మరో 8 భారీ ఓహెచ్‌బీఆర్, జీఎల్‌బీఆర్(ఓవర్ హెడ్ ట్యాంకులు) నిర్మాణాలు పూర్తికాగా.. మెయిన్, సబ్ పైపులైన్ పనులు çకూడా పూర్తయ్యాయి. కాగా.. గ్రామాల్లో అంతర్గత పైపులైన్ నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయి. స్వచ్ఛమైన నీరు.. మిషన్ భగీరథ పాలేరు సెగ్మెంట్ నుంచి కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ, రఘునాథపాలెం మండలాల్లోని 370 గ్రామాల ప్రజలతోపాటు ఖమ్మం నగరవాసులకు మొత్తంగా 7.20లక్షల మందికి ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు ఈ పథకాన్ని చేపట్టారు. పనులు నిర్ణీత గడువుకంటే ముందుగానే జిల్లాలో తొలుత పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్ణయించగా.. ఈ మేరకు అధికారులు, కాంట్రాక్టు పనులు చేపట్టిన సంస్థల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. రెండు జిల్లాల్లో తొలుత పాలేరు నియోజకవర్గంలోనే ఇంటింటికీ నల్లా నీరు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రతి ఇంటికి నల్లాలను బిగించే కార్యక్రమం శరవేగంగా సాగుతుండగా.. ఇప్పటికే 55 గ్రామాల్లో పనులు పూర్తి చేశారు. -
30 ఏళ్లు.. 87 టీఎంసీలు
► ‘మిషన్ భగీరథ’ అవసరాలపై అంచనాలు సిద్ధం సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’కు అవసరమయ్యే నీటి లెక్కలు సిద్ధమయ్యాయి. రాబోయే 30 ఏళ్ల అవసరాలపై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 2018 జనవరి నాటికి సుమారు 60 టీఎంసీల నీరు అవసరమవుతుందని, 2050 నాటికి అది 87.64 టీఎంసీలకు చేరుతుందని లెక్కలేసింది. నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి తాగునీటికి 10 శాతం నీటిని వాడుకోవాలనే నిర్ణయానికి అనుగుణంగా ఈ అంచనాలను తయారు చేసింది. ఏ నది బేసిన్ నుంచి ఎంత నీరు తీసుకోవాలి, ప్రాజెక్టుల నుంచి ఎంత తీసుకోవాలన్న అంశాలపై నీటిపారుదల శాఖ, తాగునీటి విభాగం అధికారులతో కలసి ఈ కార్యాచరణ రూపొందించారు. గత అంచనా కన్నా భారీగా పెరుగుదల వాస్తవానికి మిషన్ భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్లలోని 26 సెగ్మెంట్లకు నీరందించేందుకు ప్రాజెక్టుల నుంచి మొత్తం 39.19 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. కృష్ణా బేసిన్లో 19.59 టీఎంసీలు, గోదావరి నుంచి 19.67 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే పెరుగుతున్న రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఈ కేటాయింపుల్లో మార్పులు చేసింది. ఈ ఏడాది మొదట్లో నీటి అవసరాలపై అంచనాలు వేసిన అధికారులు వాటిని సవరించారు. 2018 నాటికి 41.31 టీఎంసీలు, 2033 నాటికి 50.6 టీఎంసీలు, 2048 నాటికి 60.75 టీఎంసీల అవసరం ఉంటుందని లెక్కకట్టారు. అయితే వచ్చే 30 ఏళ్ల అవసరాలపై అంచనాలు సిద్ధం చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నుంచి 10 శాతం నీటిని తీసుకోవాలని సూచించారు. దీంతో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో సమావేశాలు నిర్వహించిన నీటిపారుదల, తాగునీటి విభాగం అధికారులు నీటి అవసరాల ప్రణాళికలు సిద్ధం చేశాయి. రెండు బేసిన్ల పరిధిలోని 37 ప్రాజెక్టుల నుంచి 2018 నాటికే 59.17 టీఎంసీలు తీసుకోవాలని, ప్రతి ఐదేళ్లకు 5 టీఎంసీల మేర పెరిగినా 2050 నాటికి 87.64 టీఎంసీలు అవసరం ఉంటుందని లెక్కలేశాయి. ఇందులో గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నుంచే అధిక కేటాయింపులు ఉండేలా చూసుకున్నాయి. 2018లో ఈ బేసిన్ ప్రాజెక్టుల నుంచి 32.17 టీఎంసీలు తీసుకోనుండగా.. కృష్ణా బేసిన్ నుంచి 23.08 టీఎంసీలు తీసుకోనున్నారు. ఈ లెక్కన 2050 నాటికి గోదావరి నుంచి 54.50 టీఎంసీలు తీసుకోనుండగా.. కృష్ణా బేసిన్ నుంచి 33.11 టీఎంసీల మేర తీసుకోనున్నారు. ఈ నీటిని తీసుకునేందుకు 37 ప్రాజెక్టుల కనీస మట్టాన్ని (ఎండీడీఎల్) కూడా నీటిపారుదల శాఖ నిర్ధారించింది. మార్చిన ఎండీడీఎల్లకు అనుగుణంగా ప్రాజెక్టుల ఆపరేషన్ మాన్యువల్‌లో మార్పులు చేసి ప్రభుత్వానికి అందించింది. నీటి అవసరాల అంచనా ఇలా.. (టీఎంసీల్లో) ఏడాది నీటి అవసరం 2018 59.17 2023 66.16 2028 69.56 2033 72.65 2038 76.98 2043 81.20 2048 85.34 2050 87.64 ► వచ్చే జనవరి నాటికి నీటి అవసరం60టీఎంసీలు ►2028 నాటికి నీటి అవసరం69టీఎంసీలు ►ప్రాజెక్టుల నుంచి తాగునీటికి..10% -
మిషన్ భగీరథ భేష్
మధ్యప్రదేశ్ తాగునీటి శాఖ అధికారుల బృందం కితాబు సాక్షి, హైదరాబాద్: మెదక్–సింగూరు సెగ్మెంట్ మిషన్ భగీరథ పనులను మధ్య ప్రదేశ్ తాగునీటి శాఖ అధికారుల బృందం బుధవారం పరిశీలించింది. ఓ ప్రభుత్వ పథకానికి సంబంధించిన పనులు ఇంత వేగంగా పూర్తవడాన్ని చూడటం ఇదే తొలి సారని పేర్కొంది. ముందుగా మెదక్ జిల్లా పెద్దారెడ్డిపేట వద్ద నిర్మిస్తున్న ఇంటెక్ వెల్, హెడ్ వర్క్స్ పనులను పరిశీలించింది. నాణ్యతతో పనులు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర జల నిగమ్ మర్యాదిత్ చీఫ్ జనరల్ మేనేజర్ ఏకే శ్రీవాత్సవ ప్రశంసించారు. తర్వాత సంగారెడ్డి జిల్లా బుస్సారెడ్డిపేట వద్ద నిర్మిస్తున్న ఇంటెక్ వెల్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులను పరిశీలించారు. ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీటిని అందించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆశయం గొప్పదని కొనియాడారు. -
డిసెంబర్ నాటికి ‘భగీరథ’ నీరు: వేముల
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథతో తాగునీటిని అందిస్తామని వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇంటెక్ వెల్ నుంచి ఇంటింటికి నల్లా వరకు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సచివాలయంలో సోమవారం మిషన్ భగీరథ పనుల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సెగ్మెంట్, జిల్లాల వారీగా పనులు ఏఏ దశల్లో ఉన్నాయో సమగ్ర నివేదిక రెండు రోజుల్లో అందించాలని ఆదేశించారు. వచ్చే నెలనుంచి ఏ సెగ్మెంట్లో ఎన్ని గ్రామాలకు భగీరథ నీటిని అందిస్తారో వివరాలు ఇవ్వాలన్నారు. పైప్‌లైన్, ఎలక్ట్రో మెకానికల్ సబ్ స్టేషన్ నిర్మాణాలు, వాల్వ్, వర్టికల్ కనెక్షన్లకు సంబంధించి ఏజెన్సీలు ఇచ్చిన ఆర్డర్ వివరాలతోపాటు యాక్షన్ ప్లాన్‌ను రెండు రోజుల్లో అందించాలని సూచించారు. -
మిషన్ భగీరథ ఎందుకు?: కోదండరాం
కేయూ క్యాంపస్ (వరంగల్): తెలంగాణ ప్రభుత్వం విచిత్రంగా వ్యవహరిస్తోందని, గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు ఉండగా.. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారో తెలియడం లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హన్మకొండలో ఆదివారం మానవ హక్కుల వేదిక వరంగల్ జిల్లా ఏడో మహాసభల్లో ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ పథకం కోసం ప్రభుత్వం రూ. 42 వేల కోట్లు కేటాయించి పనులను మెగా కంపెనీకి అప్పగించారని, వీటిని ప్రభుత్వమే చేయిస్తే రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్ల వరకు మిగులుతాయన్నారు. నేరెళ్లలో ఇసుక రవాణా అధికంగా ఉందని, స్పీడ్ బ్రేకర్లు వేసి లారీల వేగాన్ని నియంత్రించాలని కోరిన వారిపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తాము ఎక్కడికి వెళ్తున్నా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. -
రాష్ట్రానికి అన్యాయమే!
⇔ జీఎస్టీతో ఏటా రూ.4,000 కోట్ల లోటు ⇔ ఇలా పన్నుల సొమ్ము తగ్గినా పరిహారం దక్కే చాన్స్ లేదు ⇔ తమ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోకపోవడంపై రాష్ట్రం కినుక ⇔ రాజకీయంగా ఆఖరి ఒత్తిడికి ప్రభుత్వ యత్నం ⇔ కేంద్రంతో రాజీ పడే ప్రసక్తి లేదన్న మంత్రి ఈటల ⇔ ఢిల్లీలో జీఎస్టీ వేడుకలకు హాజరుకానున్న ఆర్థిక మంత్రి సాక్షి, హైదరాబాద్ : జీఎస్టీ అమలుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. పన్నుల రాబడిలోనే ఏటా సుమారు రూ.4,000 కోట్ల లోటు ఏర్పడు తుందని లెక్కలు వేసింది. అంతేగాకుండా రాష్ట్రం తరఫున పంపిన ప్రతిపాదనలపై కేంద్రం నుంచి స్పందన రాకపోవటంతో.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటివాటిపై పన్ను రూపేణా వేల కోట్ల రూపాయల భారం పడుతుందని తేల్చింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రతిపాదనలపై కేంద్రాన్ని ఒప్పించేందుకు రాజకీయంగా ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఏటా రూ.4,000 కోట్లు లోటు! జీఎస్టీ అమలుతో రాష్ట్ర ఖజానాకు పన్నుల రాబడిలో రూ.4,000 కోట్ల మేర లోటు తప్పదని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఇలా జీఎస్టీ అమలుతో వచ్చే లోటును కేంద్రం పరిహారం రూపంలో తిరిగి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ 14.5 శాతం కంటే తక్కువ ఆదాయ వృద్ధి ఉన్న రాష్ట్రాలకు మాత్రమేనని మెలిక పెట్టింది. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రం కావడం, ఆదాయ వృద్ధి 17.9 శాతంగా ఉండడంతో రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం దక్కే అవకాశం తక్కువని భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, వివిధ కార్యక్రమాలపై జీఎస్టీ కారణంగా రూ.19,200 కోట్ల మేరకు అదనపు పన్ను భారం పడుతుందని లెక్కలు వేశారు. ఇక జీఎస్టీ శ్లాబ్‌ల ఖరారు సమయంలో తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదనే అభిప్రాయాలున్నాయి. దాంతో చేనేత, బీడీ పరిశ్రమపై పెరిగిన పన్ను భారంతో రాష్ట్రంలోని లక్షలాది మంది బీడీ, చేనేత కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని గ్రానైట్ పరిశ్రమకు సైతం పన్నుపోటు తగలనుంది. వీటన్నింటికి కొంత మేర మినహాయింపులు ఇవ్వాలని, జీఎస్టీ స్లాబ్‌ను కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం: ఈటల జీఎస్టీకి సంబంధించి రాష్ట్రం చేసిన కొన్ని ప్రతిపాదనలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకున్నా.. మరికొన్నింటిని తోసిపుచ్చిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఈ విషయంలో తాము రాజీపడబోమని, కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు అంశాలపై కేంద్రానికి లేఖ రాశారని.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, బీడీ, చేనేత, సాగునీటి రంగాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారని వెల్లడించారు. ఫిర్యాదులుంటే కాల్ చేయండి జీఎస్టీ అమలును సాకుగా చూపి ధరలు పెంచొద్దని వ్యాపార, వాణిజ్య వర్గాలకు మంత్రి ఈటల సూచించారు. అనుమానాలు, అపోహలు వద్దని.. ప్రస్తుతమున్న వ్యాట్ తరహాలోనే పారదర్శకంగా పన్నులు, పన్నుల చెల్లింపు విధానం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాట్ పరిధిలో 2.25 లక్షల మంది ఉన్నారని, జీఎస్టీతో డీలర్ల సంఖ్య పెరిగే అవకాశముందని చెప్పారు. జీఎస్టీ అమలుకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. దేశంలో అత్యధి కంగా వాణిజ్య పన్నుల రాబడి ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, అందుకే రాష్ట్ర ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరైనా అనుమానా లుంటే 18004253787 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఎక్సైజ్‌పై ప్రభావం లేకుండా.. జీఎస్టీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే ఎక్సైజ్ ఆదాయంలో కోత పడకుండా ఉండేందుకు ఎక్సైజ్ చట్టం– 1968కు పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ పరిధిలోకి వచ్చే అంశాలను జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఉండేలా ఈ సవరణ లు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలి పాయి. మరోవైపు కొత్త జిల్లాలు ఏర్పడ టంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టును ఎక్సైజ్ ఆఫీసర్‌గా మారుస్తూ సవరణ చేసింది. -
వడివడిగా భగీరథ
► డిసెంబర్ నాటికి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ► నల్లా కనెక్షన్‌కు రూ.40,854 లక్షలు కేటాయింపు ► తీరనున్న 22 మండలాల ప్రజల దాహార్తి ‘మిషన్ భగీరథ’ వడివడిగా సాగుతోంది. డిసెంబర్ నాటికి ‘ఇంటింటికీ నల్లా’ కనెక్షన్ జారీ చేసే దిశగా పనులు వేగం అందుకున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్ భగీరథకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నల్లా కనెక్షన్ ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తోంది. ప్యాకేజీల ఖరారులో కొంతమేర జాప్యం జరిగినా.. ఈ నెలాఖరులోపు వాటిని కొలిక్కి తేవడం ద్వారా నిర్ణీత వ్యవధిలోపు పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. అలాగే ప్రజల ముంగిటకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన సర్కారు... ఇంటర్నెట్ వినియోగించేందుకు వీలుగా అన్ని ఇళ్లకు లైన్ వేయనుంది. నల్లాల కనెక్షన్ కోసం తవ్వే భూగర్భ పైప్లైన్లోనే ఇంటర్నెట్ ఓఎస్పీ కేబుల్ వేయనుంది. మిషన్ భగీరథ కింద జిల్లాలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు రూ.40,854.27 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో 22 మండలాల(రెవెన్యూ) ప్రజల దాహార్తి తీర్చనుంది. – సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్ సర్కారు వినూత్న పథకానికి రూపకల్పన చేసింది. ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టులకు సంబంధం లేకుండా... ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ జారీ చేసేలా భగీరథను రూపొందించింది. ఈ మేరకు జిల్లాలోని 1,056 ఆవాసాలకు నీటిని సరఫరా చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును ఈ ఏడాది చివరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన సర్కారు.. వాయువేగంతో పైప్లైన్లను వేస్తోంది. మిషన్ భగీరథ పనులను 33 ప్యాకేజీలుగా విభజించిన పంచాయతీరాజ్‌శాఖ.. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలాప్రణాళికను అమలు చేస్తోంది. 2.19 క్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ జిల్లాలోని ఆరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1,056 ఆవాసాలలోని సుమారు పది లక్షల జనాభా నివాసముంటున్న 2,19,211 గృహాలకు నల్లా కనెక్షన్ జారీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 853 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులతో 2,093.54 కి.మీ.మేర పైప్లైన్ల ద్వారా వీటికి నీటి సరఫరా చేయాలని ప్రతిపాదించింది. అయితే, జిల్లావ్యాప్తంగా నిర్మించతలపెట్టిన 853 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల్లో 50శాతం వాటికీ ఇంకా టెండర్లు ఖరారు కాకపోవడం అధికార యంత్రాంగానికి చెమటలు పట్టిస్తోంది. ఇంకా ఖరారు కానీ టెండర్లను ఈ వారంలోపు పూర్తి చేయకపోతే గడువులోగా భగీరథను పూర్తి చేయడం సాధ్యంకాదని యంత్రాంగం అంటోంది. ఈ నేపథ్యంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణ పనులను మూడు కేటగిరీలుగా విభజించింది. జూన్‌లోపు కొన్ని, సెప్టెంబర్ ఇంకొన్ని, డిసెంబర్లో మరికొన్నింటిని పూర్తి చేయాలని నిర్దేశించింది. -
నిర్లక్ష్యపు ఏజెన్సీలను తొలగిస్తాం
‘భగీరథ’ పనుల పురోగతిపై సమీక్షలో ఈఎన్సీ సురేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వర్క్ ఏజెన్సీలను తొలగిస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి హెచ్చరించారు. భగీరథ పనుల పురోగతిపై అధికారులు, వర్క్ ఏజెన్సీల ప్రతినిధులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ డిసెంబర్‌లోగా మంచి నీళ్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ క్రమంలో పనులను వేగంగా చేయని వర్క్ ఏజెన్సీలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాత్రిళ్లు కూడా పైప్‌లైన్ పనులు జరిగేలా చూడాలని అన్ని జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ఆదేశించారు. సూర్యాపేట డివిజన్లో భగీరథ పనులు మందకొడిగా సాగుతున్నాయని, అక్కడ పనులు చేస్తున్న వర్క్ ఏజెన్సీ తీరు మార్చుకోకుంటే చర్యలు చేపడతామని హెచ్చరించారు. పాత మెదక్ జిల్లాలో వ్యవసాయ పనుల కారణంగా ఆగిన పైప్‌లైన్ పనులను వెంటనే మొదలుపెట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణాలకు ఆటంకాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, మెటీరియల్, కూలీల కొరత లేకుండా చూడాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో జరిగే సమీక్షకు సరైన సమాచారంతో రాని అధికారులపైనా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు సురేశ్ కుమార్, కృపాకర్ రెడ్డి, కన్సల్టెంట్లు నర్సింగరావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.