‘భగీరథ’ పనుల పురోగతిపై సమీక్షలో ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వర్క్ ఏజెన్సీలను తొలగిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి హెచ్చరించారు. భగీరథ పనుల పురోగతిపై అధికారులు, వర్క్ ఏజెన్సీల ప్రతినిధులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ డిసెంబర్‌లోగా మంచి నీళ్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ క్రమంలో పనులను వేగంగా చేయని వర్క్ ఏజెన్సీలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
రాత్రిళ్లు కూడా పైప్‌లైన్ పనులు జరిగేలా చూడాలని అన్ని జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ఆదేశించారు. సూర్యాపేట డివిజన్‌లో భగీరథ పనులు మందకొడిగా సాగుతున్నాయని, అక్కడ పనులు చేస్తున్న వర్క్ ఏజెన్సీ తీరు మార్చుకోకుంటే చర్యలు చేపడతామని హెచ్చరించారు. పాత మెదక్ జిల్లాలో వ్యవసాయ పనుల కారణంగా ఆగిన పైప్‌లైన్ పనులను వెంటనే మొదలుపెట్టాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణాలకు ఆటంకాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, మెటీరియల్, కూలీల కొరత లేకుండా చూడాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో జరిగే సమీక్షకు సరైన సమాచారంతో రాని అధికారులపైనా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు సురేశ్ కుమార్, కృపాకర్ రెడ్డి, కన్సల్టెంట్లు నర్సింగరావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.