ఒకప్పుడు హిట్‌ డైరెక్టర్స్‌.. కొత్త కబురెప్పుడు | Tollywood Directors Update news | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు హిట్‌ డైరెక్టర్స్‌.. కొత్త కబురెప్పుడు

Nov 2 2025 12:27 AM | Updated on Nov 2 2025 7:54 AM

Tollywood Directors Update news

కృష్ణవంశీ, వీవీ వినాయక్, శివ నిర్వాణ, మెహర్‌ రమేశ్‌

చిత్ర పరిశ్రమ ఎప్పుడూ విజయాల వెంట పరిగెడుతూ ఉంటుంది. అది హీరోలు అయినా, హీరోయిన్లు అయినా, దర్శకులైనా... ఓ హిట్‌ మూవీ వచ్చిందంటే చాలు హీరో హీరోయిన్లకు అవకాశాలు వెల్లువలా వస్తుంటాయి. అలాగే ఓ సినిమా విజయం అనేది దర్శకుల కెరీర్‌ని నిర్ణయిస్తుందంటారు. ఓ సినిమా విజయం లేదా పరాజయం క్రెడిట్‌ అంతా డైరెక్టర్లదే అనే నానుడి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంటోంది. హిట్టు పడితే వరుస ఆఫర్లు వస్తాయి. 

అదే ఫ్లాపులొస్తే... కెరీర్‌లో స్పీడ్‌ బ్రేకర్స్‌ ఉన్నట్లే. ఫ్లాప్‌ల తర్వాత కూడా కొందరికి కొన్ని అవకాశాలు వచ్చినా... ఎక్కువమంది కెరీర్‌కి మాత్రం బ్రేకులు పడుతుంటాయి. ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడితో పని చేసేందుకు ఇటు హీరోలు, అటు నిర్మాతలు ఆలోచిస్తుంటారు. అంతేకాదు.. హిట్‌ ఇచ్చినప్పటికీ మరికొందరు దర్శకులకు కొత్త ప్రాజెక్ట్‌ కోసం నిరీక్షణ తప్పడం లేదు. అలా చిత్ర పరిశ్రమలోని పలువురు దర్శకుల నుంచి కొత్త కబురు ఎప్పుడు? అనే చర్చ ఇటు మూవీ లవర్స్‌లో అటు ప్రేక్షకుల్లో నడుస్తోంది. మరి... ‘కొత్త కబురు’ వినిపించని ఆ దర్శకులు ఎవరో ఓ లుక్కేద్దాం.

రెండున్నరేళ్లు దాటినా...  
కృష్ణవంశీ... ఈ పేరు చెప్పగానే క్రియేటివ్‌ డైరెక్టర్‌గా, కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకులకు గుర్తొస్తారు. బంధాలు, బంధుత్వాలు, అనురాగం, ఆ΄్యాయతలు, భావోద్వేగాలను మిళితం చేసి వెండితెరపై తనదైన శైలిలో అద్భుతంగా ఆవిష్కరిస్తుంటారు. సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, వాస్తవ ఘటనల నేపథ్యంలోనూ సినిమాలు తెరకెక్కించి, సమాజానికి సందేశం ఇస్తుంటారు. కుటుంబ కథా చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ మార్క్‌ క్రియేట్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఘన విజయాలు సాధించారు. కాగా నవదీప్, శివబాలాజీ, కాజల్‌ అగర్వాల్, సింధు మీనన్‌ ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వం వహించిన ‘చందమామ’ చిత్రం 2007లో విడుదలై హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత ఆయన ఏడు సినిమాలు తెరకెక్కించారు.

2017లో వచ్చిన ‘నక్షత్రం’ తర్వాత దాదాపు ఆరేళ్లు గ్యాప్‌ తీసుకున్న కృష్ణవంశీ  తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ మూవీ 2023 మార్చి 22న విడుదలైంది. ఆ చిత్రంలోని భావోద్వేగాలు ప్రేక్షకులచేత కన్నీరు పెట్టించాయి. ఇక ఆ సినిమా విడుదలై రెండున్నరేళ్లు దాటినప్పటికీ కృష్ణవంశీ తర్వాతి చిత్రం ఏంటి? అనే ప్రశ్నకు ఇప్పటివరకూ సమాధానం లేదు. అయితే ఇటీవల ట్విట్టర్‌ వేదికగా అభిమానులు అడిగిన ఓ ప్రశ్నకు కృష్ణవంశీ బదులిస్తూ... ‘నాకు ఓ హారర్‌ ఫిల్మ్‌ చేయాలనే ఆసక్తి ఉంది. అయితే రెగ్యులర్‌ హారర్‌ మూవీస్‌లా కాకుండా వేరే లెవల్‌లో ట్రై చేద్దాం. ఇందుకు కొంచం సమయం పడుతుంది’ అని తెలిపారు. మరి... ఆయన కొత్త సినిమా కబురు ఎప్పుడు? అంటే వేచి చూడాలి.  

లాంగ్‌ గ్యాప్‌...  
వీవీ వినాయక్‌ పేరు చెప్పగానే కమర్షియల్‌ మాస్‌ సినిమాలు గుర్తొస్తాయి. హీరోలకు మాస్‌ ఎలివేషన్స్‌ ఇవ్వడంలో ఆయన శైలి ప్రత్యేకం. ‘ఆది, దిల్, ఠాగూర్, బన్ని, లక్ష్మి, యోగి, కృష్ణ, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్‌ 150’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన ఆయనకి తెలుగులో చాలా లాంగ్‌ గ్యాప్‌ వచ్చింది. టాలీవుడ్‌లో ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. సాయిదుర్గా తేజ్‌ హీరోగా నటించిన ఈ మూవీ 2018 ఫిబ్రవరి 9న విడుదలైంది. ఆ చిత్రం తర్వాత తెలుగులో మరో తెలుగు సినిమా చేయలేదు వినాయక్‌. అయితే ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన హిట్‌ మూవీ ‘ఛత్రపతి’ సినిమాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో హిందీలో ‘ఛత్రపతి’ (2023) పేరుతోనే రీమేక్‌ చేశారు.

ఆ తర్వాత వినాయక్‌ నుంచి కొత్త సినిమా ప్రకటన ఏదీ రాలేదు. అయితే తనకు ‘దిల్‌’ వంటి హిట్‌ సినిమా ఇచ్చిన వినాయక్‌ హీరోగా ఓ సినిమా చేయనున్నట్లు ‘దిల్‌’ రాజు ప్రకటించారు. అయితే ఆ సినిమా ఎందుకో సెట్స్‌కి వెళ్లలేదు. ఇదిలా ఉంటే... ‘లక్ష్మీ’ (2006) వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో వెంకటేశ్, డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ మరోసారి కలిసి పని చేయబోతున్నారని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

‘లక్ష్మీ’కి కథ అందించిన ఆకుల శివ.. వెంకటేశ్‌ కోసం వినాయక్‌ శైలికి తగ్గట్టుగా కామెడీ, మాస్‌ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ కథని సిద్ధం చేస్తున్నారట. నిర్మాత నల్లమలుపు బుజ్జి ఈ సినిమాని నిర్మించనున్నారని టాక్‌. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు వెంకటేశ్‌. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక వినాయక్‌ సినిమాని సెట్స్‌కి తీసుకెళతారట ఆయన. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

అందమైన ప్రేమకథలకు సున్నితమైన భావోద్వేగాలు కలగలిపి తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారు శేఖర్‌ కమ్ముల. ‘డాలర్‌ డ్రీమ్స్‌’(2000) అనే మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన 25 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ‘ఫిదా’(2017), ‘లవ్‌ స్టోరీ’(2021) వంటి వరుస విజయాల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘కుబేర’. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మికా మందన్నా లీడ్‌ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్‌ 20న విడుదల అయింది.

ఈ సినిమా రిలీజై ఐదు నెలలు కావొస్తున్నా శేఖర్‌ కమ్ముల తర్వాతి సినిమాపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే తన తర్వాతి మూవీ కూడా తన అమిగోస్‌ క్రియేషన్స్, ఎస్‌వీసీ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌లో ఉంటుందని ఆయన ప్రకటించినప్పటికీ హీరో ఎవరు? ఎలాంటి కథ? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. అయితే తనకు బాగా అచ్చొచ్చిన ప్రేమకథని తెరకెక్కించేందుకు ఆయన స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నారని టాక్‌.  

వెయిటింగ్‌....  
కల్యాణ్‌రామ్‌ హీరోగా రూపొందిన ‘అతనొక్కడే’ (2005) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సురేందర్‌ రెడ్డి. మాస్‌ సినిమాలు తీయడంలో, హీరోలకు మాస్‌ ఎలివేషన్స్‌ ఇవ్వడంలోనూ ఆయన శైలి ప్రత్యేకమనే చెప్పాలి. ‘అతనొక్కడే, కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారాయన. చేసింది తక్కువ సినిమాలే అయినా ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక శైలి, గుర్తింపును సొంతం చేసుకున్నారు. తెలుగులో ‘ఏజెంట్‌’ మూవీ తర్వాత మరో సినిమా ప్రకటన ఏదీ ఆయన నుంచి రాలేదు.

అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్‌’ సినిమా 2023 ఏప్రిల్‌ 28న రిలీజైంది. ఈ చిత్రం రిలీజై రెండున్నరేళ్లు దాటినప్పటికీ సురేందర్‌ తెరకెక్కించబోయే న్యూ మూవీపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే పవన్‌ కల్యాణ్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రానుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి ఈ మూవీ నిర్మిస్తారని కూడా ప్రచారం అయింది.

అదే విధంగా ‘కిక్‌’ వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో రవితేజ–డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో మరో సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు సినిమాలపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి... సురేందర్‌ రెడ్డి తర్వాతి సినిమా పవన్‌ కల్యాణ్‌తోనా? లేకుంటే రవితేజతోనా? అనే 
విషయాలపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు వెయిటింగ్‌ తప్పదు.  

హిట్‌ ఇచ్చినా నిరీక్షణ...   
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పద్దెనిమిదేళ్ల ప్రయాణం వంశీ పైడిపల్లిది. ప్రభాస్‌ హీరోగా నటించిన ‘మున్నా’ (2007) మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారాయన. ఇన్నేళ్ల కెరీర్‌లో తెలుగులో ఇప్పటి వరకూ ఆయన తీసింది ఐదు చిత్రాలే (మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి) అయినా అన్నీ విజయాలు అందుకున్నాయి. తమిళ స్టార్‌ హీరోల్లో ఒకరైన విజయ్‌తో తమిళంలో ‘వారిసు’ (తెలుగులో వారసుడు) సినిమా చేశారు. ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజై తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచింది.

మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ (2019) వంటి హిట్‌ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి మరో తెలుగు సినిమా చేయలేదు. అలాగే తమిళంలోనూ ‘వారిసు’ తర్వాత అక్కడ కూడా ఏ మూవీ కమిట్‌ కాలేదు. తెలుగులో ఆయన సినిమా విడుదలై దాదాపు ఆరేళ్లు కావస్తున్నా తర్వాతి ప్రాజెక్టుపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఆ మధ్య మహేశ్‌బాబుతో మరో సినిమా చేయనున్నారనే వార్తలు వచ్చినా ఎలాంటి ప్రకటన లేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు మహేశ్‌బాబు.

అదేవిధంగా షాహిద్‌ కపూర్, సల్మాన్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్, షారుక్‌ ఖాన్‌ వంటి బాలీవుడ్‌ హీరోలకు వంశీ పైడిపల్లి కథలు వినిపించారనే వార్తలు బాలీవుడ్‌లో వినిపించినా ఏ ప్రాజెక్టు కూడా ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. అయితే తాజాగా పవన్‌ కల్యాణ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుందని, ‘దిల్‌’ రాజు నిర్మించనున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో వినిపిçస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని టాక్‌. మరి వంశీ పైడిపల్లి–పవన్‌ కల్యాణ్‌ సినిమా ఉంటుందా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.  

రెండేళ్లయినా...  
‘భోళా శంకర్‌’ సినిమా తర్వాత మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించనున్న సినిమా ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ‘ఆంధ్రావాలా’ (వీర కన్నడిగ), ‘ఒక్కడు’ (అజయ్‌) వంటి తెలుగు సినిమాల కన్నడ రీమేక్‌తో దర్శకుడిగా పరిచయమయ్యారు మెహర్‌ రమేశ్‌.  తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన ‘కంత్రీ’ (2008) చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారాయన. ఆ తర్వాత ప్రభాస్‌ హీరోగా రూపొందిన ‘బిల్లా’ (2009) మూవీతో హిట్‌ అందుకున్నారు మెహర్‌ రమేశ్‌. ఆ తర్వాత తెలుగులో ‘శక్తి, షాడో, భోళా శంకర్‌’ వంటి సినిమాలు, కన్నడలో ‘వీర రణచండి’ (2017) మూవీ తెరకెక్కించారు.

చిరంజీవితో ‘భోళా శంకర్‌’ (2023) సినిమా చేసే అవకాశం అందుకున్నారు మెహర్‌ రమేశ్‌. ఇరవయ్యేళ్ల ప్రయాణంలో ఏడు సినిమాలు తీశారాయన. వాటిలోనూ రెండు కన్నడ సినిమాలున్నాయి. అయితే ‘భోళా శంకర్‌’ సినిమా విడుదలై రెండేళ్లకు పైగా అయినప్పటికీ ఆయన తర్వాతి సినిమాపై ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా 
రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా చేసేందుకు మెహర్‌ రమేశ్‌ కథ సిద్ధం చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అదే విధంగా పవన్‌ కల్యాణ్‌తో తాను ఓ సినిమా చేస్తానంటూ మెహర్‌ రమేశ్‌ ప్రకటించడం కూడా హాట్‌ టాపిక్‌ అయింది. మరి.. ఈ వార్తల్లో ఏది నిజమవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు నిరీక్షణ తప్పదు.  

⇒  ‘పెదకాపు 1’ చిత్రం తర్వాత శ్రీకాంత్‌ అడ్డాల తర్వాతి చిత్రంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విరాట్‌ కర్ణ హీరోగా ఆయన తీసిన ‘పెదకాపు 1’ చిత్రం 2023 సెప్టెంబరు 29న రిలీజైంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘పెదకాపు 2’ ఉంటుందని చిత్రయూనిట్‌ గతంలో ప్రకటించింది. అయితే ఆ తర్వాత రెండో భాగంపై ఇప్పటి వరకూ ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అయితే కిరణ్‌ అబ్బవరం హీరోగా ఓ సినిమా చేయనున్నారని టాక్‌. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

నెక్ట్స్‌ ఏంటి?...  
తెలుగు చిత్ర పరిశ్రమలో 17ఏళ్ల  ప్రయాణం పూర్తి చేసుకున్నారు పరశురాం. నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా వచ్చిన ‘యువత’    (2008) సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం     అయ్యారాయన. ఆ తర్వాత ‘ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం, సర్కారువారి పాట, ది ఫ్యామిలీ స్టార్‌’ వంటి సినిమాలు తీసి, మంచి విజయాలు అందుకున్నారు. ‘గీత గోవిందం’ (2018) సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకోవడంతో పాటు హీరో విజయ్‌ దేవరకొండని వంద కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లారు పరశురాం. ‘గీత గోవిందం’ వంటి హిట్‌ మూవీ తర్వాత విజయ్‌–పరశురాం కాంబోలో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. 

2024 ఏప్రిల్‌ 5న విడుదలైన ఈ సినిమా హిట్‌గా నిలిచినప్పటికీ తన తర్వాతి సినిమాపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు పరశురాం. ‘ది ఫ్యామిలీ స్టార్‌’ నిర్మాత ‘దిల్‌’ రాజు బ్యానర్‌లోనే పరశురామ్‌ మరో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చినా ఎలాంటి ప్రకటన లేదు. ‘ది ఫ్యామిలీ స్టార్‌’ తర్వాత పరశురాం దర్శకత్వం వహించనున్న హీరోల లిస్టులో నాగ చైతన్య, రామ్‌పోతినేని, సిద్ధు జొన్నలగడ్డ వంటి వారి పేర్లు వినిపించినప్పటికీ ఈ ప్రాజెక్ట్స్‌పై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరి పరశురాం చేయబోయే నెక్ట్స్‌ మూవీ ఏంటి? అనే విషయంపై క్లారిటీ రావాలంటే వెయిట్‌ అండ్‌ సీ.  

⇒  ‘గూఢచారి, మేజర్‌’ చిత్రాల ఫేమ్‌ డైరెక్టర్‌ శశికిరణ్‌ తిక్క నెక్ట్స్‌ మూవీ ఏంటి? అనే విషయంపైనా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. అడివి శేష్‌ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘మేజర్‌’ చిత్రం 2022 జూన్‌ 3న విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ విజయం తర్వాత కూడా ఆయన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఏంటి? అనే విషయంపై స్పష్టత లేక΄ోవడం విశేషం.  

⇒ ‘ఖుషి’ సినిమా తర్వాత డైరెక్టర్‌ శివ నిర్వాణ తెరకెక్కించనున్న సినిమా ఏంటి? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఖుషి’ సినిమా 2023 సెప్టెంబరు 1న విడుదలైంది. ఆ చిత్రం రిలీజై రెండేళ్లు దాటి΄ోయినా ఆయన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై స్పష్టత లేదు. అయితే రవితేజ హీరోగా ఆయన ఓ మాస్‌ మూవీ తీసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలొచ్చాయి. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తయిందని తెలుస్తోంది. హీరో నాగచైతన్యకి కూడా ఓ అందమైన ప్రేమకథ వినిపించారట శివ నిర్వాణ. మరి... ఆయన తర్వాతి చిత్రం రవితేజతోనా? నాగచైతన్యతోనా? లేకుంటే మరో హీరోతోనా? అన్నది తెలియాలంటే వేచి చూడాలి.  

⇒ ‘మంగళవారం’ (2023) వంటి హిట్‌ మూవీ తర్వాత అజయ్‌ భూపతి దర్శకత్వం వహించనున్న సినిమాపై ఇప్పటివరకూ ఓ స్పష్టమైన ప్రకటన రాలేదు. ‘మంగళవారం’ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఇదిలా ఉంటే... సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, దివంగత హీరో రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణని హీరోగా పరిచయం చేస్తున్నారట అజయ్‌ భూపతి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు.    

⇒ ‘భలే మంచి రోజు, శమంతకమణి, దేవ దాస్, హీరో, మనమే’ చిత్రాల ఫేమ్‌ శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించనున్న తర్వాతి సినిమాపైనా ఎలాంటి ప్రకటన లేదు. శర్వానంద్‌ హీరోగా, కృతీ శెట్టి హీరోయిన్‌గా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకతం వహించిన ‘మనమే’ చిత్రం 2024 జూన్‌ 7న విడుదలైంది. ఈ మూవీ తర్వాత శ్రీరామ్‌ ఆదిత్య తర్వాతి సినిమా ఎంటి? అనే విషయంపై క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే... పైన పేర్కొన్న దర్శకులే కాదు.. చంద్రశేఖర్‌ ఏలేటి, క్రిష్‌తో పాటు మరికొందరు డైరెక్టర్స్‌ కొత్త సినిమాల కబురు కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.  – డేరంగుల జగన్‌ మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement