
డిసెంబర్ నాటికి ‘భగీరథ’ నీరు: వేముల
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథతో తాగునీటిని అందిస్తామని వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇంటెక్ వెల్ నుంచి ఇంటింటికి నల్లా వరకు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
సచివాలయంలో సోమవారం మిషన్ భగీరథ పనుల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సెగ్మెంట్, జిల్లాల వారీగా పనులు ఏఏ దశల్లో ఉన్నాయో సమగ్ర నివేదిక రెండు రోజుల్లో అందించాలని ఆదేశించారు. వచ్చే నెలనుంచి ఏ సెగ్మెంట్లో ఎన్ని గ్రామాలకు భగీరథ నీటిని అందిస్తారో వివరాలు ఇవ్వాలన్నారు. పైప్‌లైన్, ఎలక్ట్రో మెకానికల్ సబ్ స్టేషన్ నిర్మాణాలు, వాల్వ్, వర్టికల్ కనెక్షన్లకు సంబంధించి ఏజెన్సీలు ఇచ్చిన ఆర్డర్ వివరాలతోపాటు యాక్షన్ ప్లాన్‌ను రెండు రోజుల్లో అందించాలని సూచించారు.