అధికార టీఆర్‌ఎస్ పార్టీలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఆధిపత్య పోరు ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి సస్పెన్షన్‌కు దారితీస్తుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించిన విషయం విదితమే. ఈ పరిస్థితులు ఒక్క రూరల్ నియోజకవర్గానికే పరిమితం కాలేదు. బాల్కొండ నియోజకవర్గంలో కూడా ఇద్దరు ముఖ్య నేతల మధ్య వర్గ పోరు ఇటీవల తారా స్థాయికి చేరింది. ఇక్కడ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్‌రెడ్డిల వ్యవహారం నువ్వా..నేనా అన్నట్లుగా తయారైంది. ఈ నేతలిద్దరు ఎవరికి వారే వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నియోజకవర్గంలో పట్టునిలుపుకునేందుకు ఇద్దరు నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశాంత్‌రెడ్డి దృష్టి సారించగా, సేవా కార్యక్రమాలను సునీల్‌రెడ్డి ముమ్మరం చేస్తున్నారు. గ్రామాల్లో పరామర్శలు, శుభ కార్యాలకు హాజరవుతున్నారు. భీంగల్ మండలం బెజ్జోర గ్రామపంచాయతీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సునీల్‌రెడ్డి అనుచరుడిని గెలిపించుకున్నారని అప్పట్లో చర్చ జరిగింది. ఇలా ఇక్కడ టీఆర్‌ఎస్ పార్టీ క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయి పనిచేస్తోంది. కాగా సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రశాంత్‌రెడ్డికి పార్టీలో ప్రత్యేక స్థానం ఉంది. మిషన్‌భగీరథ వైస్ చైర్మన్ పదవిని ఇచ్చిన అధినేత కేసీఆర్ ప్రశాంత్‌రెడ్డి విషయంలో మంత్రితో సమానంగా ప్రొటోకాల్ పాటించాలని ఆదేశించారు. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షునిగా చాలా కాలం పనిచేసిన సునీల్‌రెడ్డి నిజామాబాద్ ఎంపీ కవితకు ప్రధాన అనుచరుల్లో ఒకరు. పార్టీలో చెప్పుకోదగిన పదవులేవీ లేకపోయినప్పటికీ సునీల్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుచరులతో స్పష్టం చేస్తున్నారు. భూపతిరెడ్డి సస్పెన్షన్ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్య నేతలు వేర్వేరుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు చర్చకు దారితీస్తోంది.
సీఎం కేసీఆర్ దృష్టికి వ్యవహారం..
బాల్కొండ నియోజకవర్గంలో వర్గ పోరు కూడా సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. సునీల్‌రెడ్డి తీరుపై ప్రశాంత్‌రెడ్డి పలుమార్లు కేసీఆర్‌కు ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరుతూ తీర్మానం చేసేందుకు ఇటీవల హైదరాబాద్‌లో మంత్రి పోచారం నివాసంలో జరిగిన ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం సందర్భంగా కూడా బాల్కొండ నియోజవర్గంలోని వర్గపోరుపై స్వల్ప చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులే దాదాపు ఇక్కడ కూడా నెలకొనడం ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment