సాక్షి, ఢిల్లీ: కేసీఆర్‌కు మరోసారి అధికారం ఇస్తే వచ్చేది కిసాన్ సర్కార్ కాదని లిక్కర్ సర్కార్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదం ఇచ్చారు. దానికి కౌంటరుగా అబ్ కీ బార్ లిక్కర్ సర్కార్ అని విమర్శించాం. ఎందుకంటే కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన విషయాల్లో మద్యం ఒకటి. ఆయన కుటుంబానికి లిక్కర్‌కు అవినాభావ సంబంధం ఉంది. మద్యంతోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు విస్తరించారని ఎద్దేవా చేశారు.
‘‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కుమార్తె కవితపై ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం కాదు. నేను స్వయంగా ఆరోపిస్తున్న కేసీఆర్‌కి మరోసారి అధికారం ఇస్తే ఢిల్లీ లేదా తెలంగాణలో లిక్కర్ ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్‌పై ప్రభుత్వ ఆదాయం రూ.10,500 కోట్ల నుంచి రూ.36 వేల కోట్లకు పెరిగింది. తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలను కేసీఆర్ కొనేశారు. అందుకే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్నినిలదీస్తోంది. కేసీఆర్ అవినీతిపై కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
‘‘గత ఎనిమిదేళ్లుగా కేసీఆర్, మోదీ ఒకరికొకరు సహకరించుకున్నారు. నాణానికి బొమ్మా, బొరుసులా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. అధికారం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయి. వారి నాటకాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణలో బీహార్ రాష్ట్ర సమితిగా మార్చాలనుకుంటున్నారా?. తెలంగాణలో మోదీ మోడల్ పాలనను కేసీఆర్ తీసుకురావాలనుకుంటున్నారా?.
నరేంద్ర మోదీ విధానం ఐస్(ఇన్‌కంటాక్స్, సీబీఐ, ఈడీ), నైస్ (నార్కోటిక్స్, ఇన్‌కం టాక్స్, సీబీఐ, ఈడీ). తెలంగాణలో ఐస్, నైస్ మోడల్ చెల్లదు. ఈ రోజు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనికి కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. అవినీతిపరుడైన కేసీఆర్‌కు సహకరించవద్దని కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ ను కోరుతున్నా’’ అని రేవంత్ అన్నారు.
చదవండి: TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు!
‘‘కేసీఆర్ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణను కూతురుకు అప్పగిస్తారనే కేటీఆర్ తండ్రిపై అలిగారు. అందుకే ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కేటీఆర్ వెళ్లలేదు. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే డీఎన్ఏ మారదు. అలాగే పేరు మార్చినంత మాత్రాన ఆ పార్టీ డీఎన్ఏ మారదు. కేసీఆర్ డీఎన్ఏ ఏంటో అందరికీ తెలుసు. ప్లాస్టిక్ సర్జరీతో రూపు రేఖలు మార్చవచ్చు కానీ.. మనిషి ఆలోచనలు మార్చలేరు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా ఆ పార్టీతో పొత్తు ఉండదు. మాది యాంటీ బీఆర్ఎస్, యాంటీ కేసీఆర్’’ అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment