పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులొచ్చాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలను పూర్తిగా విస్మరించి కేవలం తన కుటుంబ క్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకే తాము బస్సుయాత్ర చేపట్టామని, ఈ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూసి టీఆర్‌ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు.
తెలంగాణలో ఉన్న సెటిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని ఉత్తమ్ కోరారు. మిషన్ భగీరథ పేరుతో కమీషన్లను బాగా తిన్న కేటీఆర్ కళ్లు నెత్తికెక్కి పొగరుబోతు మాటలు మాట్లాడుతున్నాడని ఉత్తమ్ అన్నారు. కేటీఆర్‌ను తిట్టేందుకు రేవంత్‌రెడ్డే సరైనోడని అన్నారు. తనపై కేసులున్నాయని, 2014 ఎన్నికలలో డబ్బులు దొరికాయని కేటీఆర్ పదేపదే అంటున్నారని, ఈ కేసును హైకోర్టు కూడా కొట్టివేసిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎన్నికల తర్వాత ఏదో వాహనంలో రూ.1.75 లక్షల రూపాయలు దొరికితే ఆ డబ్బు తనదని పెట్టిన కేసులో నిజం లేదని కోర్టు కొట్టివేసిందని చెప్పారు.
బచ్చా కాదు... లుచ్చా
ఈ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, బచ్చా అంటే ఊరుకోనని కేటీఆర్ అంటున్నారని, అందుకే ఆయన బచ్చా కాదు లుచ్చా అని అంటున్నామని, ఏం చేస్తాడో చేసుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీపై అడ్డగోలు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మీద కేసులున్నాయని కేటీఆర్ పదేపదే బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, మా మీద కేసులుంటే అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్‌లో చేరిన శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్‌తో పాటు ఎల్లారెడ్డి, నిజామాబాద్‌ల నుంచి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఉత్తమ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment