anti-people policies
-
Rahul Gandhi: బీజేపీని విమర్శిస్తే దూషిస్తారా?
కన్నూర్: కేంద్రంలోని అధికార బీజేపీ విధానాలను, సిద్ధాంతాలను విమర్శించినందుకు కొన్ని మీడియా సంస్థలు నిత్యం తనను దూషిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. గురువారం కేరళలోని కన్నూర్, పాలక్కాడ్, కొట్టాయంలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ మాట్లాడారు. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ విధానాలు దేశ ప్రజలకు శాపంగా మారాయన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తాను పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. అందుకు దూషణలు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన మీడియా చానళ్లు తనను లక్ష్యంగా చేసుకొని రోజంతా తిట్లదండకం వల్లిస్తున్నాయని ఆక్షేపించారు. బీజేపీతో పినరయి విజయన్ లాలూచీ భారతదేశం ఇప్పుడున్నంత అస్తవ్యస్తంగా గతంలో ఎన్నడూ లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సంపద పంపిణీలో ఇప్పుడున్న అసమానతలు గతంలో లేవని గుర్తుచేశారు. అందుకే రాబోయే తమ ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రాహుల్ మండిపడ్డారు. బీజేపీతో విజయన్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు జైలులో ఉన్నారని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయన్ ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆయనను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. దేశ ప్రజలపై ఒకే భాష, ఒకే చరిత్రను రుద్దడానికి కమల దళం కుట్రలు పన్నుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనే ఎన్నికలివి ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు జరుగుతున్న ఎన్నికలు అని రాహుల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు వీడియో సందేశం ఇచ్చారు. భారతదేశం అనే భావనను నిరీ్వర్యం చేసేందుకు బీజేపీ సాగిస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే వెన్నుముక అని, వారిపై పెద్ద బాధ్యత ఉందని చెప్పారు. స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థలపై, న్యాయ వ్యవస్థపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడికి దిగుతున్నాయని ఆరోపించారు. -
కేసీఆర్‌ను తరిమికొట్టే రోజులొచ్చాయ్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులొచ్చాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలను పూర్తిగా విస్మరించి కేవలం తన కుటుంబ క్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకే తాము బస్సుయాత్ర చేపట్టామని, ఈ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూసి టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. తెలంగాణలో ఉన్న సెటిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని ఉత్తమ్ కోరారు. మిషన్ భగీరథ పేరుతో కమీషన్లను బాగా తిన్న కేటీఆర్ కళ్లు నెత్తికెక్కి పొగరుబోతు మాటలు మాట్లాడుతున్నాడని ఉత్తమ్ అన్నారు. కేటీఆర్‌ను తిట్టేందుకు రేవంత్‌రెడ్డే సరైనోడని అన్నారు. తనపై కేసులున్నాయని, 2014 ఎన్నికలలో డబ్బులు దొరికాయని కేటీఆర్ పదేపదే అంటున్నారని, ఈ కేసును హైకోర్టు కూడా కొట్టివేసిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎన్నికల తర్వాత ఏదో వాహనంలో రూ.1.75 లక్షల రూపాయలు దొరికితే ఆ డబ్బు తనదని పెట్టిన కేసులో నిజం లేదని కోర్టు కొట్టివేసిందని చెప్పారు. బచ్చా కాదు... లుచ్చా ఈ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, బచ్చా అంటే ఊరుకోనని కేటీఆర్ అంటున్నారని, అందుకే ఆయన బచ్చా కాదు లుచ్చా అని అంటున్నామని, ఏం చేస్తాడో చేసుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీపై అడ్డగోలు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మీద కేసులున్నాయని కేటీఆర్ పదేపదే బ్లాక్మెయిల్ చేస్తున్నారని, మా మీద కేసులుంటే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్‌లో చేరిన శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్‌తో పాటు ఎల్లారెడ్డి, నిజామాబాద్‌ల నుంచి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఉత్తమ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట
శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలను కలుపుకుని పోరుబాట సాగిస్తామని ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు కొయ్య మోషేన్‌రాజు తెలిపారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 38 మండలాలకు సంబంధించి పార్టీ యువజన, రైతు, మహిళా, విద్యార్థి విభాగాల కమిటీలను ఎన్నుకుని పార్టీని గ్రామస్థాయి నుంచి మరింతగా బలోపేతం చేయనున్నామన్నారు. టీడీపీ అరాచకాలను, అన్యాయాలను ప్రజలకు వివరించడానికే మండలాల వారీగా పార్టీ అనుబంధ విభాగాల కమిటీల ఎంపిక ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. మండల కమిటీలో పనిచేసేందుకు కార్యకర్తలకు ఇదొక గొప్ప అవకాశమన్నారు. పార్టీ అధికారంలోకి వస్తేనే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణపాలన సాధ్యమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకే పార్టీ అనుబంధ విభాగాల మండల కమిటీ ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. పార్టీ యువజన, రైతు, మహిళా, విద్యార్థి విభాగాలకు కమిటీలు ఎంపిక చేసిన అనుబంధ విభాగాలను మరింత పటిష్టం చేయనున్నామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాగి దుర్గాప్రసాదరాజు, పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పాల్గొన్నారు. -
టీఆర్ఎస్వి ప్రజా వ్యతిరేక విధానాలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని టీ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం మాట్లాడారు. సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి మరీ మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని పెద్దిరెడ్డి విమర్శించారు. విమర్శలు చేస్తే కేసులు పెట్టిస్తామని సీఎం కేసీఆర్ మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఈ విషయంలో గవర్నర్‌ను సంప్రదిస్తామని చెప్పారు. గోదావరి ప్రాజెక్టుల అంశంలో కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వానికి లొంగిపోయారని రావుల విమర్శించారు. -
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం
సీపీఐ నాయకులు శ్రీనివాస్‌రావు, వెంకట్రాములు ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు హన్మకొండ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.వెంకట్రాములు ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట బుధవారం ధర్నా చేశారు. అలాగే, హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో శ్రీనివాస్‌రావు, వెంకట్రాములు మాట్లాడుతూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడంతో పాటు అధిక ధరలను నియంత్రించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. వంద రోజుల్లో ధరలను నియంత్రిస్తామని చెప్పిన నరేంద్రమోదీ అధికారంలోని వచ్చి రెండేళ్లు దాటుతున్నా అలా చేయలేకపోయారన్నారు. నిరంతరం స్వదేశీ జపం చేస్తూ విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ దేశ సంపదను కొల్లగొడతున్నారని ధ్వజమెత్తారు. లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, చివరకు రక్షణ రంగంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను యథేచ్ఛగా ఆహ్వానించడం సిగ్గుచేటని అన్నారు. మోదీ విధానాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అవలంబిస్తున్నారని వారు దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కాలయాపన చేస్తూ ప్రజల దృష్టిని మరలిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్థవ్యస్తంగా మారిందని, పేదలకు రేషన్ సరుకులు సక్రమంగా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా రెవెన్యూ అధికారి శోభకు వినతిపత్రం అందించారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, సీపీఐ నాయకులు సిరబోయిన కరుణాకర్, గోలి రాజిరెడ్డి, ఎన్.అశోక్‌స్టాలిన్, వి.సదానందం, బుస్స రవీందర్, ఎ.శ్రీనివాస్, ఎం.సాగర్, అలుపూర్తి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడతాం
* జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కందుల దుర్గేష్ * ‘బాబు’ ఒక్క హామీనీ నెరవేర్చలేదని ధ్వజం రావులపాలెం : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కార్యాచరణ రూపొందించినట్టు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం రావులపాలెం సీఆర్సీ ఆడిటోరియంలో జిల్లా పార్టీ సమావేశం దుర్గేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోనసీమలో రైతులు పంట విరామానికి సిద్ధమవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. ఎస్సీలు, బీసీలు, మహిళలు, మైనార్టీలు, రైతులు, చేనేతకార్మికులు, కాపులు.. ఇలా అందరినీ సర్కారు మోసగించిందని, ఇచ్చిన హామీల అమలుకు శాంతియుతంగా ఆందోళనలు చేస్తే పోలీసులతో అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ మూసివేత యత్నాన్ని తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. ఆదివాసీల సమస్యలపై రంపచోడవరం కేంద్రంగా ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు. నెలకో ఆందోళన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. పార్టీకి పూర్వ వైభవం తేచ్చేందుకు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, బీసీ సెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు జిత్ మోహన్‌మిత్రా తదితరులు మాట్లాడారు. అనంతరం కొత్తగా జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన నాయకులకు దుర్గేష్ నియామక పత్రాలందజేశారు. పింగళి, అల్లూరి, రంగాలకు నివాళి తొలుత జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు, అల్లూరి సీతారామరాజు, వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆకుల రామకృష్ణ తండ్రి ఆదినారాయణమూర్తి మృతికి సంతాపం తెలిపారు. పీసీసీ ప్రధాన కార్యద ర్శి ఎస్ఎన్ రాజా, శిక్షణా తరగతుల చైర్మన్ రామినీడి మురళి, పీసీసీ జాయింట్ సెక్రటరీ పొనుగుపాటి శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, ఎస్సీ సెల్ కన్వీనర్ వర్థినీడి సుజాత, జిల్లా ప్రధాన కార్యదర్శి సాధనాల శ్రీని వాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాశీ లక్ష్మణస్వామి, కార్యదర్శి బీవీవీ లక్ష్మీ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ను ఓడించాలి
బీజేపీ, టీడీపీ జిల్లా అధ్యక్షులు అశోక్‌రెడ్డి, సత్యనారాయణరావు హన్మకొండ : ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్ను వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓడించాలని బీజే పీజిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ అన్నారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నిక రావడానికి టీఆర్ఎస్ పార్టీయే కారణమని, అసందర్భ, అనాలోచిత నిర్ణయాలతో ఈ ఎన్ని క వచ్చిందని విమర్శించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందున ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలువడం వల్ల జిల్లాకు మేలు జరుగుతుందన్నారు. గండ్ర సత్యనారాయణరావు మాట్లాడు తూ వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా టీఆర్ఎస్ను ఓడించే సత్తా ఉన్న వ్యక్తిని బీజేపీ, టీడీపీ జాతీ య అధ్యక్షులు ఎంపిక చేస్తారని తెలిపారు. రెండు పార్టీల కార్యకర్తలు ఎన్డీఏ అభ్యర్థి విజ యానికి కృషి చేయాలన్నారు. బీజేపీ వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు చింతాకుల సునీల్ మాట్లాడుతూ ఈనెల 28న హన్మకొండ సహకారనగర్‌లోని విష్ణుప్రియ గార్డెన్లో బీజేపీ వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ కన్వీనర్లు, కోకన్వీనర్ల సమావేశం జరుగుతుం దని తెలిపారు. టీడీపీ వరంగల్ నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళిమనోహర్ మాట్లాడుతూ అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు చదువు రామచంద్రారెడ్డి, జన్నె మొగిళి, కూచన రవళి, కాసర్ల రాంరెడ్డి, కొత్త దశరథం, పుప్పాల రాజేందర్, మార్టిన్ లూథర్, త్రిలోకేశ్వర్, వీసం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీదే ఉజ్వల భవిష్యత్తు
- గ్రామస్ధాయి నుంచి పార్టీ బలోపేతం - ప్రజాసమస్యలపై పోరాడుతాం - వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ ఉట్నూర్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలో నిర్వహిం చిన పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏజెన్సీలో విష జ్వరాలు, వ్యాధులు ప్రబలి గిరిజనులు పదుల సంఖ్యలో మృత్యువాతపడుతున్నా, ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయూలన్నారు. వచ్చే నెల 10 వరకు గ్రామ, మండల కమిటీలు ఏర్పాటుచేయూలని సూచించారు. రానున్నా రోజుల్లో పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందన్నారు. అనంతరం పార్టీ ఉట్నూర్ మండల అధ్యక్షుడిగా ముజాహిద్, ఖానాపూర్ మండల అధ్యక్షుడిగా కే.జ్ఞానేశ్వర్లను నియమిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర సం యుక్త కార్యదర్శి, ఖానాపూర్ ఇన్చార్జి తోడసం నా గోరావ్, రాష్ట్ర కార్యదర్శి శంకర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు తిలక్‌రావ్, జాయింట్ సెక్రెటరీ పురుషోత్తం, ఆదిలాబాద్ పట్టణాధ్యక్షుడు సలావుద్దీన్; ఇంద్రవెల్లి మండల అధ్యక్షుడు ఉత్తమ్, నాయకులు మహేశ్, రమేశ్, మోసిన్, హాకీమ్ పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై సమరభేరి
హిందూపురం : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో కార్మికులు, ప్రజలు ‘సమరభేరి’ మోగించారు. మంగళవారం వారు హిందూపురంలో ఆందోళనలతో హోరెత్తించారు. ముందుగా ట్రాక్టర్ యజమానుల అసోసియేషన్ సభ్యులు, భవన నిర్మాణ కార్మికులు, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది ప్రజలతో కలిసి స్థానిక చిన్న మార్కెట్ సర్కిల్ నుంచి ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ సర్కిల్లో దాదాపు మూడు గంటల పాటు ఆందోళన చేశారు. తర్వాత తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని మహాధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు నెలలకు ఒకసారి చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రజల మధ్య ఉండాలని, సినిమాలు తీసుకుంటూ నియోజకవర్గ ప్రజల కష్టాలను విస్మరించడం తగదని హితవు పలికారు. ‘మీ బావ చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిలదీసేందుకు మీకు ధైర్యంలేదా’ అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజలు, కార్మికులు, కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికీ తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. దీంతో నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఆందోళనకు దిగినట్లు చెప్పారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చడం లేదని మండిపడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారని, చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్లీ కరువు తాండవిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇసుక వ్యాపారం ద్వారా పచ్చచొక్కాల పొట్ట నింపుతోందని దుయ్యబట్టారు. దీనివల్ల మూడు నెలలుగా ట్రాక్టర్ల యజమానులు, బేల్దార్లు, భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవన్నారు. వారు తమ సమస్యలను తెలపడానికి బాలకృష్ణ వద్దకు వెళ్లగా పోలీసులతో బెదిరించి పంపారన్నారు. ‘నవీన్ నిశ్చల్ విమర్శిస్తున్నాడని మీ నాయకులు ఫోన్ చేస్తేనే హిందూపురం వస్తున్నావు. పోలీసుల రోప్ పార్టీ మధ్య అలా తిరిగి వెళ్లిపోతున్నావు. ఏనాడైనా సామాన్యులు సమస్యలు చెప్పుకోవడానికి అందుబాటులో ఉన్నావా?’ అంటూ బాలకృష్ణపై నిప్పులు చెరిగారు. ధర్నాకు మద్దతుగా సీపీఐ కౌన్సిలర్ దాదాపీర్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసిందన్నారు. స్థానిక టీడీపీ నాయకులు భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, కమీషన్లతో కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. ధర్నా అనంతరం తహశీల్దార్ చల్లా విశ్వనాథ్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ షానూర్‌బాషా, పట్టణ అధ్యక్షుడు సమ్మద్, ఏ బ్లాక్ అధ్యక్షుడు ఇర్షాద్, బీ బ్లాక్ అధ్యక్షుడు మల్లికార్జున, రూరల్ అధ్యక్షుడు బసిరెడ్డి, మున్సిపల్ ప్రతిపక్షనాయకుడు శివ తదితరులు పాల్గొన్నారు. -
వ్యూహం మార్చిన మావోయిస్టులు..?
{పభుత్వాల పోకడలకు వ్యతిరేకంగా ప్రచారం బెజ్జంగిలో ప్లీనరీ ఇందుకేనని అనుమానం కొయ్యూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను సరికొత్త వ్యూహంతో తిప్పి కొట్టాలని మావోయిస్టులు యోచిస్తున్నారు. పోలీసులకు దీటుగా కరపత్రాలతోనే ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల దళసభ్యులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. వారికి వ్యతిరేకంగా ప్రచారం చేపడుతున్నాయి. వారు చేపడుతున్న హింస, సంఘ వ్యతిరేక కార్యకలాపాలను కరపత్రాలు ద్వారా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. దీనిని తిప్పి కొట్టాలనే మావోయిస్టులు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని మల్కన్‌గిరి డివిజన్ బెజ్జంగి సమీపంలో ప్లీనరీ ఏర్పాటు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మావోయిస్టులు సమావేశాలు లేదా ప్లీనరీల ఏర్పాటుకు ఎక్కువగా మల్కన్‌గిరి డివిజన్‌ను ఎంచుకుంటారు. అవసరమైన వస్తువులను చిత్రకొండ నుంచి తరలిస్తారు. ప్లీనరీ ఏర్పాటు చేస్తున్న సమాచారం చిత్రకొండలోనే బయటకు పొక్కిందని వారు అనుమానిస్తున్నట్టు సమాచారం. సాగుల సంఘటన నుంచి మావోయిస్టులపై పోలీసులు ఎదురుదాడికి పాల్పడుతున్నారు. నచ్చని వారిని దళసభ్యులు చంపేస్తున్నారంటూ కరపత్రా లు, బ్యానర్లతో ప్రచారం చేపట్టారు. ఇక వీరవరం సంఘటనతో ప్రచారాన్ని పోలీసులు మరింత ఉధృతం చేశారు. గిరిజనుల చైతన్యంతో మావోయిస్టులు కనుమరుగవుతారంటూ,విధ్వంసాలు, ఇన్ఫార్మర్ల నెపంతో అమాయకులను చంపేస్తున్న ఫొటోలతో సహా పోస్టర్లు అంటించారు. దీనిని తిప్పి కొట్టాలని మావోయిస్టుల అగ్ర నాయకత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రభుత్వం ప్రజలకు ఏమి చెప్పింది తరువాత ఏమి చేస్తున్నది అనే అంశాలతో పాటు గిరిజనుల అక్రమ అరెస్టులపై కూడా ప్రకటనలు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. -
ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం
టెక్కలి:అధికారంలోకి రాక ముందు ఒక మాట...అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట ఆడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలపై ఉద్యమానికి సమాయత్తం కావాలని సీపీఎంకు చెందిన పలువురు రాష్ట్ర కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు జరగనున్న సీపీఎం 15వ జిల్లా మహాసభలు టెక్కలిలో సోమవారం ప్రారంభమయ్యూయి. ఈ సందర్భంగా పార్టీకి చెందిన రాష్ట్ర , జిల్లా కమిటీ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహాసభల్లో భాగంగా ముందుగా ఎర్రజెండాలు , జానపద కళా జాతతో పట్టణంలోని పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను విదేశీ పెట్టుబడుల పేరుతో ప్రభుత్వాలు విధ్వంసాలను సృష్టించేందుకు తీవ్ర స్థాయిలో కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో ప్రజా వినాశనానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగా జపాన్ వంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ పేరుతో గద్దెనెక్కిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు వ్యతిరేక విధానాలను ప్రవేశపెడుతున్నారన్నారు. ఇందులో భాగంగా రాజధాని నిర్మాణం పేరుతో దౌర్జన్యంగా రైతుల భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజల్ని దగా చేస్తూ కేంద్రంలో మతతత్వ పార్టీగా పేరు సంపాదించుకున్న బీజేపీ, రాష్ట్రంలో మోసపూరిత పాలన అందజేస్తున్న టీడీపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్నాయన్నారు. వివిధ పరిశ్రమలకు అనుగుణంగా యాజమాన్యానికి అనుకూలమైన చట్టాలను అమలు చేస్తూ కార్మికులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన మంత్రి కార్మిక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బి.రోజా, బి.తులసీదాస్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. మహాసభల్లో ఎమ్మెల్సీ ఎంవీఎస్.శర్మ, సీపీఎం రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, భవిరి కృష్ణమూర్తి, ఎ.శ్రీనివాసరావు, గోవిందరావు, పినకాన కృష్ణమూర్తి, నంబూరు షణ్ముఖరావు, కొల్లి ఎల్లయ్య, హెచ్.ఈశ్వరరావు, పోలాకి ప్రసాదరావు పాల్గొన్నారు.